ఊరూ - పేరూ---మా తాత ముత్తాతలది విజయనగరం జిల్లా అని తెలుసు. కానీ మా ఇంటి పేరుతో ఉన్న ప్రదేశం తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ శివార్లలో ఉంది. యామిజాలలో రెండు రకాలు పేర్లతో ఉన్న ఊళ్ళు చూసొచ్చాను. అవి దేవర యామిజాల. మరొకటి తుర్క యామిజాల. సికిందరాబాద్ నుంచి ఆ యామిజాల ఊళ్ళకు వెళ్ళే బస్సులపైన యంజాల్ అని రాసి ఉండటం చూశాను. బ్రాహ్మణులలో వైదీకులు, నియోగులు ఇలా రకరకాల శాఖలున్నాయి. మేము తెలగాణ్యులు అంటారు. తెలగాణ్యుల ఇళ్ళ పేర్లలో చాలా వరకు తెలంగాణా రాష్ట్రంలోని ఊళ్ళ పేర్లవే అని ఎప్పుడో ఒక వ్యాసం చదివానుకూడా. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా వీటిని వివరిస్తున్నట్లే మద్రాసులోని ప్రాంతాల గురించి రెండు మూడు రకాల వివరాలు దొరికాయి.గతంలో ఓమారు చెప్పినట్లు గుర్తు మద్రాసు నగరం అనేది ఎన్నో గ్రామాల కలయికతో ఏర్పడినదని. అటువంటి మహానగరంలో కొన్ని ప్రాంతాలకు ఎలా ఆ పేర్లు వచ్చాయో కూడా తెలిపాను. నిన్న ఓ తమిళ వ్యాసం చదువుతుంటే అందులో కొన్ని వివరాలున్నాయి. వాటిని క్లుప్తంగా ఇస్తున్నాను....నూట ఎనిమిది శక్తి స్థలాలలో యాభై ఒకటవ ఊరు మద్రాసులోని అంబత్తూరు. తమిళంలో యాభై ఒకటిని అయింబత్తు ఒండ్రు అని అంటారు. క్రమంగా ఈ అయింబత్తు ఒండ్రు అనేది అంబత్తూరు అనడం వాడుకలోకొచ్చింది. Armoured Vehicles And Depot of India అనే మాటలలో ఉన్న మొదటి అక్షరాలను కలిపితే ఆవడి అవుతుంది. అంటే ఆవడి అనే ప్రదేశానికి ఈ విధంగా పేరొచ్చినట్లు నేను చదివిన తమిళ వ్యాసం ద్వారా తెలిసింది. chrome leather factory అధికంగా ఉండే ప్రదేశాన్ని క్రోంపేట అని పిలువబడుతోంది. 17, 18 శతాబ్దాలలో ఓ నవాబు ఆధీనంలో ఉన్న ప్రదేశం పేరు కోడంబాక్కం. ఇక్కడ అతనికి సంబంధించిన గుర్రాలు బోలెడు ఉండేవట. వాటి మేతకోసం అనేక తోటలు ప్రత్యేకించి ఇక్కడ ఉండేవి. ఈ తోటలు ఓ నందనవనంలా కనిపించేవి. అందుకని గార్డెన్ ఆఫ్ హార్శస్ garden of horses అనే అర్థం వచ్చేటట్టు ఘోడా బాగ్ Ghoda bagh అని చెప్పుకునేవారు. కాలక్రమేణా ఇది కాస్తా కోడంబాక్కం అయింది.మగప్పేర్ అనే ప్రదేశం అణ్ణానగర్ తర్వాతది. ఇది ముగపేర్ గా మారింది.తెన్నై మరంగళ్ (కొబ్బరి చెట్లు) లెక్కలేనన్ని ఉన్న ప్రాంతానికి తెన్నంపేట్టయ్ అనే పేరుండేది. ఇది క్రమంగా తేనాంపేటగా మారింది. సయ్యిద్ షా పేట్టయ్ అనేదే నేడు సైదాపేటగా పిలువబడుతోంది.పురాతన కాలంలో వేదశ్రేణి అని పిలువబడే ప్రదేశాన్నే ఇప్పుడు వేలచ్చేరిగా మారినట్టు ఆ వ్యాసం వల్ల తెలిసింది.ఉర్దూ మాటైన che bage (six gardens అని అర్థం) నుంచే చేప్పాక్కం అనే పేరొచ్చిందట.సౌందర పాండియన్ బజార్ అనే దానినే కుదించి పాండిబజార్ అని చెప్పుకోవడం జరుగుతోంది. ఇది టీ.నగర్లో అతి ముఖ్యమైన ప్రదేశం.కళైంగర్ కరుణానిధి నగర్ ని కుదించి కె.కె. నగర్ అని అంటున్నారు.శివుడికి ప్రియమైన బిల్వ వృక్షాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని తమిళంలో మహావిల్వం అని పిలుస్తూ వచ్చారు. కాలక్రమేణా మావిల్వం అయి ఆ తర్వాత మాంబళంగా మారినట్లు తెలిసింది.పల్లవులు పాలించిన కాలంలో పల్లవపురం అనేదే తర్వాతి రోజుల్లో "పల్లావరం"గా మారింది. చెన్నై మాగాణానికి రాజుగా ఉండిన పానగల్ రాజుకు గుర్తుగా టీ. నగర్లోని ప్రధాన పార్కుని పనగల్ పార్క్ అని అంటున్నారు. ఇక్కడే కీ.శే. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి ఆధ్వర్యంలో అలనాటి కవులు రచయితలూ సమావేశమై సాహిత్యంతోసహా అనేక విషయాలపై చర్చించుకునేవారు. ఈ చర్చలలో శ్రీశ్రీ, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, మా నాన్నగారు తదితరులు పాల్గొనే వారు. పానగల్ పార్కులో అనే శీర్షికన మా నాన్నగారు ఆంధ్రప్రభ దినపత్రికలోనూ, జ్యోతి మాసపత్రికలోనూ అనేక వ్యాసాలు రాశారు. జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండిన సర్ పిట్టి త్యాగరాజన్ చెట్టి పేరుతోనే త్యాగరాయ నగర్ అనే పేరు వచ్చింది. దీనినే టీ. నగర్ అంటారు.పురసై అనే చెట్లు అధికంగా ఉన్న ప్రదేశాన్నే పురసై వాక్కం అని పిలిచేవారు.భారీ మొత్తంలో మల్లె పూలను సాగు చేసిన ప్రదేశమొకటుండేది. తిరుక్కచ్చి నంబి ఆళ్వార్ రోజు ఇక్కడి నుంచి పువ్వులు కోసుకెళ్ళి కాంచి వరదరాజ పెరుమాళ్ ని పూజించేవారు. దీనిని సంస్కృతంలో పుష్పకవల్లి అని, తమోళంలో పూవిరుందవల్లి అని అనేవారు. తర్వాతిరోజుల్లో ఇది పూందమల్లిగా మారింది. వల్లి అనేది అమ్మవారి పేరు. 17 వ శతాబ్దంలో ఓ ముస్లింసాధువు ఉండేవారు. ఆయన పేరు కునంగుడి మస్తాన్ సాహిబ్. ఆయన సొంత ఊరు రామనాథపురం జిల్లాలోని తొండి. అక్కడుండే వారు ఆయనను తొండియార్ అని పిలిచేవారు. ఆ ప్రదేశమే ఇప్పటి తండయార్ పేటగా మారింది. పూర్వం మేకలు ఆవులు మేయడానికి వీలుగా పచ్చికబయళ్ళు ఉండిన ప్రదేశాన్ని మందైవెలి గా చెప్పేవారు. దినినే మందైవల్లి అనీ మందవల్లి అని అంటున్నారు.పల్లవుల కాలంలో యుద్ధాలు జరిగిన ప్రదేశమే పోరూర్ అయింది.కొన్ని శతాబ్దాల క్రితం వెదురు ( మూంగిల్ చెట్లు) చెట్లు ఎక్కువగా ఉండిన ప్రదేశమే పెరంబూర్ అని పిలువబడి వాడుకలోకొచ్చింది.త్రిశూల్ నాదర్ ఆలయం ఉండిన ప్రదేశాన్ని త్రిశూలం అని పిలువబడుతోంది.థామస్ ప్యారీ అనే వ్యాపారి ఉండేవాడు. ఈయనకు విశేష ఆదరణ ఉండేది. అందుకే ఆయన గుర్తుగా ప్యారీ మునై (ప్యారిస్ కార్నర్) అని పేరు పెట్టారు.వెల్లి సేరి పాక్కం అనేదే కాలక్రమేణా వలసరవాక్కంగా మారింది. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు