లోకల్ రైల్వే స్టేషన్లు--మద్రాసులో లోకల్ ఎలక్ట్రిక్ రైల్వే స్టేషన్లతో ప్రజలకు దగ్గర సంబంధాలుంటాయి. ఈ స్టేషన్ల ఆనుకునే సిటీ బస్సులు అందుబాటులో ఉండటం వల్ల నగరంలో ఎక్కడికైనా వెళ్ళే వీలుంటుంది. లోకల్ రేల్వే స్టేషన్లు ఓ పొడవాటి మార్గంలోనే (ఆక్కడక్కడ కొన్ని మలుపులు మినహా) ఉండేలా రూపొందించారు.ఈ రైళ్ళన్నీ తాంబరం - మద్రాస్ బీచ్ స్టేషన్ల మధ్య నడుస్తాయి. 1.. మద్రాస్ బీచ్: ఈ స్టేషన్ ని ఇప్పుడు చెన్నై బీచ్ అని అంటున్నారు. పూర్వం మద్రాస్ బీచ్ అనే వారు. దక్షిణ రైల్వేకిది టెర్మినస్ లా పరిగణిస్తారు. ఈ స్టేషన్ కి పదిహేను వందల చదరపు మీటర్ల పార్కింగ్ఏరియా ఉంది. మద్రాస్ హైకోర్టుకీ బ్రాడ్వేకి అతి సమీపంలో ఉంటుందీ స్టేషన్. అలాగే స్టేషన్ ని ఆనుకునే బర్మాబజార్ ఉంది. ఇక్కడ విదేశీ సరుకులు దొరుకుతాయి. ప్రభుత్వ కార్యాలయాలలో అధికశాతం, బ్యంకుల హెడ్ క్వార్టర్స్, ప్యారీస్ గ్రూప్ కార్యాలయాలు ఈ స్టేషన్ కి సమీపంలో ఉంటాయి. ఈ స్టేషన్ రాకముందు మద్రాసులో హార్బర్ నుంచి తాంబరం వరకు ఓ స్టీమ్ రైల్ లైన్ ఉండేది. అయితే 1923లో దక్షిణ రైల్వే ఏజెంట్ సర్ పెర్సీ రొథెరా కృషితో ఈ లోకల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్లు ఏర్పడ్డాయి. 1930 డిసెంబర్ 27న ఇంగ్లండ్ నుంచి 25ఎలక్ట్రిక్ బోగీలు మద్రాస్ చేరాయి. వాటికి పచ్చరుగు పెయింట్ చేసి నడిపారు. ఆ రంగుకూడా వెలిసిపోయినట్లుండేది. మద్రాస్ బీచ్ - తాంబరం మధ్య 1931 ఏప్రిల్ 2 వ తేదీన మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ రైల్ సేవలు మొదలయ్యాయి. అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ జార్జ్ ఫ్రెడ్రిక్ స్టాన్లీ ఈ రైల్ సేవలకు పచ్చజెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. అయితే మరో నెల రోజుల తర్వాతగానీ ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి రాలేదు.1931 మే 11 వ తేదీన తొలిసారిగా ప్రజలకు వీలుగా ఈ రైళ్ళు నడవసాగాయి. మద్రాస్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కార్పొరేషన్ ఈ రైల్వే లైన్ కి అవసరమైన విద్యుత్ సరఫరా చేస్తూ వచ్చింది. మొదట్లో మద్రాస్ బీచ్ నుంచి తాంబరం చేరుకోవడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. పోనుపోను ఈ కాలవ్యవధిని నలబై తొమ్మిది నిముషాలకు తగ్గించారు. అంటే మద్రాస్ బీచ్ నుంచి తాంబరానికి నలభై తొమ్మిది నిముషాల్లో చేరుకోవచ్చన్న మాట. తెల్లవారు జామున నాలుగు గంటలకు మొదలయ్యే ఈ ఎలక్ట్రిక్ ట్రైన్ అర్థరాత్రి పన్నెండు గంటలవరకూ నడుస్తుంది.2. చెన్నై ఫోర్ట్ (కోట్టయ్) -మద్రాస్ లో టౌన్ అని చెప్పుకునే ప్రాంతానికి వెళ్ళాలంటే ఈ స్టేషన్ లో దిగుతారు.. 3.పార్క్ - మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కి, జనరల్ ఆస్పత్రికి సమీపంలో ఉన్న స్టేషన్ ఇది. నగరంలో ఇదొక ముఖ్యమైన రైల్వే స్టేషన్. తమిళంలో దీనిని పూంగా స్టేషన్ అంటారు.4. ఎగ్మూర్ - తమిళనాడులో దక్షిణ ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఇక్కడి నుంచే నడుస్తాయి. 5.చెట్ పట్ - తమిళంలో సేత్తుపట్ అంటారు.చెన్నైలోని ధనవంతులుంండే చోటు. ఆడిస్, బిఎండబ్ల్యు కార్లు కలిగిన సంపన్నులు ఈ ప్రాంతంలో ఎక్కువ. అయినప్పటికీ లోకల్ రైళ్ళల్లో వస్తువులు విక్రయించే చిన్నచిన్న వ్యాపారులు, బిచ్చగాళ్ళు రాత్రుళ్ళ పూట ఈ చెట్ పట్ స్టేషన్ సమౌపంలో విశ్రాంతి తీసుకోవడం గమనించవచ్చు.6 నుంగంబాక్కం - రోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ పని చేసే మధ్యతరగతివారికి ఈ నుంగంబాక్కం స్టేషన్ ఓ గుండెకయలాటిది. నేను మద్రాసు అణ్ణానగర్లో వార్త పత్రికా కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు మాంబళంలో రైలెక్కి నుంగంబాక్కంలో దిగి చూలైమేడులోని నెల్సన్ మాణిక్యం రోడ్డుకొచ్చి నిల్చునే వాడిని బస్సుకోసం. ముగప్పేర్ వెళ్ళో 47 సిరీస్ బస్సొచ్చేది అటు. ఆ బస్సెక్కి అణ్ణానగర్ మెయిన్ రోడ్డులో బ్లూస్టార్ బస్టాప్ దగ్గర దిగేవాడిని. అక్కడ ఎదురుగా ఉండే ఆప్టెక్ బిల్డింగ్ లో వార్త ఆఫీసు ఉండేది. పైగా నుంగంబాక్కం స్టేషన్ ని ఆనుకునే మరోవైపు లయోలా కొలేజీ ఉంది. ఈ కాలేజీ అప్పట్లో సిటీలో నెంబర్ ఒన్ కొలేజీగా ఉండేది. స్కూల్ ఫైనల్లో మంచి మార్కులు వస్తే తప్ప ఇక్కడ సీటు దొరకదు.ఈ కాలేజీకొచ్చే విద్యార్థులతోనూ ఈ స్టేషన్ రద్దీగా ఉండేది.7కోడంబాక్కం - కోడంబాక్కం అనేది ఔత్సాహిక అసిస్టెంట్ దర్శకులు, సినీ పరిశ్రమలో ఎలాగైనా నిలదొక్కుకోవాలనుకునే వారికి కోడంబాక్కం ఓ ప్రధాన కేంద్రం. స్టేషన్ లోంచి ఓవైపుకొస్తే కోడంబాక్కం. మరొకవైపుకొస్తే టీ.నగరు. ఈ స్టేషన్ కి దగ్గర్లోనే మేము అద్దెకుండేవాళ్ళం. నా మద్రాసు జీవితంతో పెనవేసిన కోడంబాక్కం స్టేషన్ ని ఎప్పటికీ మరచిపోలేనిది. మద్రాస్ వెళ్తే ఒకటిరెండుసార్లయినా ఇటు కోడంబాక్కం, అటు టీనగరులోనూ ఉన్న రోడ్లల్లో నడుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ మనసుకి.8. మాంబళం - చెన్నైలో షాపింగ్ కి ప్రియమైన నిలయం మాంబళం. స్టేషన్ నుంచి బయటికొస్తే టీ. నగర్ రంగనాథన్ స్ట్రీట్ లోకి అడుగుపెడతాం. ఆ వీధిలో ఎప్పుడు అడుగుపెట్టినా జాతరలో ఉన్నట్టే అనిపిస్తుంది. రెండు మూడు రోజులక్రితం కూడా ఓ తమిళ న్యూస్ ఛానల్లో రంగనాథన్ స్ట్రీట్ లో కొన్ని దుకాణాలు లాక్ డౌన్ కారణంగా వ్యాపారం దెబ్బతిన్నట్లు ఓ కథనం చూపించాడు. అది చూస్తుంటే మనసు టీ. నగర్లో ఉన్నట్టే అనిపించింది. హెయిర్ పిన్ మొదలుకుని కంప్యూటర్ వరకూ ఏదైనా ఈ వీధిలో లభిస్తుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వే స్టేషన.లలో మాంబళం ఒకటి. 9సైదాపేట - సైదాపేట మధ్యతరగతి, దిగువ మధ్యతరగతివారు నివసించే చోటిది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ స్థితి మారి ఉండొచ్చు. ఈ స్టేషన్ నుంచి బయటకు వస్తే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు చూడొచ్చు.10గిండీ - పారిశ్రామికవాడతోనూ రేస్ కోర్స్ తోనూ ప్రముఖంగా మారిన ప్రాంతం గిండీ. అనేక ఐటీ సంస్థలు కూడా ఈ స్టేషన్ కి సమీపంలోనే ఉన్నాయి.ళగిండీ అనగానే ఇక్కడ నేను పని చేసిన ఓ ఫ్యాక్టరీతోపాటు ఓ మూడు వారాలు గుర్రప్పందాలు చూడటానికి వెళ్ళిన రేస్ కోర్స్ గుర్తుకొస్తుంటాయి.11.సెయింట్ థామస్ మౌంట్ - తమిళంలో దీనిని పరంగిమలై అని కూడా అంటారు. ఈ లైన్లో మెట్రో సర్వీస్ కూడా ఉంది. 2015 జూన. నెలలో కోయంబేడు - ఆలందూర్ మధ్య చెన్నై మెట్రో సర్వీస్ ప్రారంభించారీ మార్గంలో.12పళవన్ తాంగళ్ - ఇదొక చిన్న స్టేషన్. మొదట్లో ఈ స్టేషన్ ని పెద్దగా చెప్పుకునేవారుకాదు. సెయింట్ థామస్ మౌంట్ స్టేషన్ తర్వాత బాగా చెప్పుకునే స్టేషన్ మీనంబాక్కమే. అయితే పవళన్ తాంగళ్ లో జనసమ్మర్దం దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ బాగా వాడుకలోకొచ్చింది. నంగనల్లూరు, పళవన్ తాంగళ్, హిందూ కాలనీ, మడిపాక్కం తదితర ప్రాంతాలవారికి ఈ స్టేషన్ ఎంతో ఉపయోగం. పవళన్ తాంగళ్ స్టేషన్ లోంచి నంగనల్లూరులోకి ప్రవేశిస్తే ఆంజనేయుడి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ గుడి మద్రాసునగరంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ గుడి నిర్మాణం జరుగుతున్న రోజుల్లోనూ, ముప్పై రెండు అడుగుల ఆంజనేయుడి విగ్రహం రూపుదిద్దుకుంటున్న సమయంలోనూ, ప్రతిష్టించిన రోజున మిత్రులతో కలిసి ప్రత్యక్షంగా చూసిన క్షణాలు మరచిపోలేనివి.13-మీనంబాక్కం - ఈ స్టేషన్ కి దగ్గర్లో మద్రాసు విమానాశ్రయం ఉంది. కానీ విమానాశ్రయానికి ఇది కేంద్రంకాదని చెప్పవచ్చు. ఈ స్టేషన్ చుట్టుపక్కల అనేక కాలనీలు, ఎఎం జైన్ కాలేజీ ఉన్నాయి. ఈ కాలేజీ విద్యార్థులకు ఈ స్టేషన్ ప్రధానమైంది.14-త్రిశూలం -ఇది మద్రాసు విమానాశ్రయానికి చేరుకోవడికి త్రిశూలం స్టేషన్ ఎంతో ఉపయోగం.15పల్లావరం - ఇది కూడా జనసమ్మర్దంతో కూడిన ప్రాంతమే.రైళ్ళల్లో ప్రయాణించే వారిలో అరవొ డెబ్బై శాతం మంది ఇక్కడ దిగుతారు. 16క్రోంపేట - ఇది క్రమంగా షాపింగ్ కేంద్రంగా మారిపోయింది. అలాగే రాధానగర్ వంటి కాలనీలున్నాయి.17తాంబరం సానిటోరియం - చెన్నై బీచ్ స్టేషన్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ ఇది-. ఇది పురాతన స్టేషనే. 1967 జనవరి 15న ఈ సెక్షన్ ని 25 kV AC ట్రాక్ గా మార్చారు.1970లలో Thoracic Medicine ప్రభుత్వ ఆస్పత్రిని విస్తరించడంతో ఈ స్టేషన్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 18-తాంబరం - ఇది అత్యంత ప్రముఖమైన లోకల్ రైల్వేస్టేషన్లలో ఒకటి. క్రిస్టియన్ కాలేజీతోపాటు ఎయిర్ ఫోర్స్ ఈ స్టేషన్ పరిధిలోనే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. చిన్నప్పుడు కోడంబాక్కంలో రైలెక్కి తాంబరం వరకూ వెళ్ళి రావడం ఓ ఆనందం. కాస్సేపు తాంబరం స్టేషన్ బయటికొచ్చి తిరగడం ఓ సరదా. ఈ స్టేషన్ సమీపంలో రైల్వే క్వార్టర్స్ లో నాకు మిత్రులున్నారు ఇప్పటికీ.- యామిజాల జగదీశ్
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులే పునాది
• T. VEDANTA SURY
ఖాళీ!!:- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
ఊరుగాలి ఈల:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
• T. VEDANTA SURY
కాప్రా మల్కాజగిరి కవుల వేదిక తొలి అంతర్జాల కవిసమ్మేళనం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి