తెలంగాణతొలిశతావధాని శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు జయంతి నేడు* శతావధాని కృష్ణమాచార్యులు గారు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 13 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు (కొన్ని చోట్ల ఆగష్టు 12 అని కూడా పేర్కొనబడింది) జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారా చార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు.వీరు 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు.వీరు సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. *వీరి రచనలలో కొన్ని*: కళాశాల అభ్యుదయం రామానుజ చరితం చిత్ర ప్రబంధం రత్నమాల (ఖండ కావ్యం) మనస్సందేశ కావ్యము సంపత్కుమార సంభవ కావ్యము గాంధీతాత నీతిశతకము గీతాచార్య మతప్రభావ శతకము వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము వేణుగోపాల స్వామి సుప్రభాతము నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము పద్మావతీ పరిణయము (హరికథ) రుక్మిణీ కళ్యాణము (హరికథ) ముకుందమాల యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు విశిష్టాద్వైతమత సంగ్రహము వేదార్థ సంగ్రహము (అనువాదం) గురువంశ కావ్యనిధి ఇతని ఆత్మకథ పేరు : స్వీయ కవితాను జీవనం వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారువీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు.. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.వారికి నివాళి--మాడిశెట్టి గోపాల్


కామెంట్‌లు