గురజాడవారి ' సంస్కర్త హృదయం ' లో రంగనాథ య్యరు తన మిత్రుడు విశ్వనాథశాస్త్రిని సరళ హృదయాన్ని మార్చేటందుకు ఏ‌ర్పాటు చేస్తాడు. శాస్త్రి సకల శాస్త్రాలు ఆమె ముందు చదివాడు. తనూ ఆమెచే చదివించాడు .సరళకు తన వల్ల పాండిత్యమే అబ్బుతుందికానీ, వేశ్యా వృత్తి నుండి ఆమెను విముక్తి చేయాలనే ప్రొఫెసర్ కోరిక, శాస్త్రులవారి కోరిక నెరవేరలేదు. అందుకు శాస్త్రులవారు చాలా బాధపడతారు. శాస్త్రులవారి దృష్టిలో రంగనాథయ్య రును సరళ గౌరవిస్తున్నది, ప్రేమిస్తున్నది. అతడే ఆమెను మార్చగలడు అనుకుంటాడు. శాస్త్రిగారి పాఠాలు సరళ విన్నప్పటినుండీ దేవాలయానికి వెళ్ళడం మానేసింది. శాస్త్రి గారి పాఠాల వలన ఆమెలో దైవభక్తి తగ్గిపోయిందని ప్రొఫెసర్ భావిస్తాడు.తనే స్వయంగా వెళ్లి ఆమెను బుజ్జిగించి అన్ని విషయాలు బోధించి ఆమెను ఒక గృహిణిగా మార్చాలనుకుంటాడు. సోక్రటీసు, బుద్ధుని ఆదర్శంగా తీసుకుని తనలో నైతిక స్థైర్యం పెంచుకొని సరళను చేరుకోవాలను కుని ఆమెను సంస్కరించాలనుకుంటాడు. ఒకనాడు ప్రొఫెసర్ లేబరేటరీలో తను చేసిన ప్రయోగం విజయవంతంఅయిన సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంతలోఒక చక్కటి చిన్న పిల్ల ( సరళ చెల్లి ) లేబరేటరీకొచ్చి వచ్చీ రాని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఒక ఉత్తరాన్ని ప్రొఫెసర్ కు అందిస్తుంది. ఆ ఉత్తరంలో సరళ రెండు సంస్కృత శ్లోకాలలో వ్రాసింది. ఆమె వ్రాసే విషయాలు అతనిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. '' చంద్రకాంతిని ఆస్వాదించే చకోరం ఇతరమైన ఖాద్యాలను( తినదగిన పదార్థాలను ) తిరస్కరిస్తుంది. .........చంద్రుడొక్కడే ఆమె చీకట్లను తరిమి కొట్టగలడు " అనే భావం ఆ శ్లోకాలలో ఉండటాన్ని ఎంతగానో అతని మనసును కరిగించివేసింది. ఆమె ఆత్మ , ఆమె దేహంకంటే సుందరమైనది, నిర్మలమైంది, ఉజ్వల తేజో మయమైనది. ఒక నీచకులంలో పుట్టిన స్ర్తీలో ఇంతటి దేవతా స్రీ లక్షణాలు ఉండటమేమిటని ఆశ్చర్య పోతాడు." మీ ఇంటికి ఈరోజు వస్తానని మీ అక్కతో చెప్పు"అనగానే ఆ చిన్న అమ్మాయి ( సరళ చెల్లి ) ఇంటికి వెళ్లిపోతుంది. ఆ సాయంత్రం ప్రొఫెసర్ ఆలోచన చేస్తూ ' సరళ ఇంటికి వస్తానని చెప్పడం ఒక విధమైన అలసత్వమే అను ఏమిటీ దౌర్భాగ్యమని తనకు తాను నిందించుకుంటాడు.మరల మరో క్షణంలోనే మనసు మార్చుకుని సరళతో ఐక్యతకోసం , స్వర్గానందంకోసం , దేనినైనా త్యజించాలి. జీవితంలో ఏది శాశ్వతం ? నిర్మల మైన ప్రేమ పవిత్రమైనది. ప్రేమికుల హృదయాల మధ్య తన క్రూర సాంప్రదాయాలతో ప్రపంచం అడ్డుగా నిలబడుతుంది. గ్రీక్ దేవత అయిన ఎస్టేసియా కోసం పెరిక్లెజ్ పరితపించలేదూ ! అయినా ప్రపంచం వారిని వేరు చేసింది. ఈవిధంగా ప్రొఫెసర్ ఆలోచనాసరళి ఉంది. ప్రొఫెసర్ తనో అవివాహితుడైతే, సరళ కోసం అలా పరితపించుకుపోయినా బాగుండేది. కానీ అతడు వివాహితుడు. సరళ ప్రేమకోసం, ఐక్యతకోసం, స్వర్గానందంకోసం దేనినైనా విడిచి పెట్టాలి అంటే తనుపెండ్లి చేసుకున్న భార్యనైనా విడిచిపెట్టేస్తాడా ? ఇదేనా మహా మేథావి, మహా సంఘసంస్కర్త చేసేపని. భోగం స్ర్తీయొక్క పొందునుకోరి భార్యకు అన్యాయం చేయడంసంఘసంస్కరణ అనిపించుకుంటుందా ? గురజాడ తన రచనల ద్వారా సంఘసంస్కరణోద్యమానికి మార్గం సూచిం చాలంటే రంగనాథయ్యరు పాత్రను ఒక అవివాహితుని పాత్రలో చూపాలి. ఆ అవివాహితుడు సరళ వంటి భోగం స్రీని అంతగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ' సంఘసంస్కర్త హృదయం ' ఎంతో మంచిది అనుకుంటారు అందరూను. అంతేగాని రంగనాథయ్యరులాంటి వివాహితులు అందమైన వేశ్యను చూసి ఆమె వ్యామోహంలో పడి భార్యలను విడిచి పట్టేస్తే అది సంఘసంస్కరణ అనిపించుకుంటుందా ? ( సశేషం ) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.


కామెంట్‌లు