ప్రియమైన చెల్లాయ్ కి
నీకొక ఉత్తరం రాయాలనిపించింది. కానీ
దగ్గర్లోనే కాదు కదా దూరంగానైనా ఒక్క పోస్టాఫీసూ లేదు. పోస్టాఫీసుతో పనేమిటీ...కాగితాలూ కలమూ ఉన్నాయిగా...రాయడానికి అంటున్నావు కదూ. నిజమే. నువ్వన్నది నిజమే. రాస్తాను. నా దగ్గరున్న కాగితాలన్నింటా నీకోసం రాసేస్తాను. చెప్పాలనుకున్నవన్నీ చెప్పేస్తాను పెన్నులో సిరా అయిపోయేవరకూ...కానీ ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయడానికో పోస్ట్ బాక్స్ ఉండాలిగా. అదీ చేసొచ్చాను ఈమధ్య. మన ఇంటికి దగ్గర్లోనే అంటే రెండో వీధి చివర్లో ఓ లైట్ పోల్ కి ఓ పోస్ట్ బాక్స్ తగిలించారు. ఎర్రటి రంగు అప్పుడే పూసి పోయినట్లున్నారు. తళతళా మెరుస్తోంది ఎర్రటి ఎరుపుతో. అసలా బాక్స్ చూసినప్పటి నుంచీ నీకొక ఉత్తరం రాయాలని కోరిక పుట్టింది. ఉత్తరం అనే మాట గుర్తుకొచ్చినప్పటి నుంచీ ఎంత ఆనందమో మనసుకి. ఒకప్పుడు నేనెన్ని ఉత్తరాలు రాసే వాడినో. వాటికి జవాబులూ అలాగే వచ్చేవి. పోస్ట్ మాన్ వాకిట్లోకొచ్చి అమ్మా పోస్ట్ అనే సరికి గదిలో ఏ పనిలో ఉన్నాసరే ఆ పని మానేసి పరిగెత్తుకుని వాకిట్లోకొచ్చి పోస్ట్ మాన్ నుంచి ఉత్తరం అందుకుని అక్కడికక్కడే ఉత్తరం చదవడంలోని ఆనందం మరెవరు ఇవ్వగలరు? ఎంత ఆనందమనుకున్నావు...రాసిన ఉత్తరానికి జవాబు వచ్చినా లేక నా ఉత్తరం కోసం ఎదురుచూస్తున్నామంటూ అందుకునే ఉత్తరంలోని ప్రతీ అక్షరమూ ఇచ్చే ఆనందానికి అంతుండదు. ఉత్తరప్రత్యుత్తరాలనేవి లేకుండాపోయాయి ఈ సెల్ ఫోన్ల రాకతో. వెధవ వాట్సప్పులూనూ ట్విట్టర్లూనూ వచ్చి ఉత్తరాలు రాసుకునే అలవాటే పోయింది. దాంతో ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న బంధం తెగ్గొట్టినట్లయ్యింది. వాట్సప్ లోనూ ట్విట్టర్లోనూ ఏం చెప్పుకుంటాం? ఏం చదువుతాం? రాయడంలోని ఆనందం రాయడంలోని ప్రేమ రాయడంలోని అనురాగం రాయడంలోని ఆప్యాయత ఈ వాట్సప్పులేమివ్వగలవు? ఉత్తరాలలో రెండు హృదయాల మధ్య అంతరంగాన్ని చదవొచ్చు. అందులోని ప్రతీ అక్షరంలోనూ పొదిగే హృదయానుబంధాన్ని మనోనేత్రంతో స్పర్శిస్తుంటే కలిగే ఆనందం వాట్సప్పుకెక్కడిది? వెధవది టెలిగ్రాఫిక్ భాషలాగా కట్టె కొట్టె తెచ్చే అన్నట్లు పొడి పొడి మాటలతో చెప్పుకునేవి ముచ్చట్లెలా అవుతాయి? ప్రేమెక్కడ పుడుతుంది? అనురాగాలకు తావెక్కడిది? ఆప్యాయతకు చోటేదీ? అందుకే చెల్లెమ్మా నీకు ఉత్తరాయలనిపించింది. మనసులో గూడుకున్న ప్రేమనంతా చెప్పెయ్యాలని ఆరాటం. కానీ ఏం చెయ్యను? పోస్టు బాక్సూ లేదు. పోస్టాఫీసూ లేదు నేనున్న చోట. ఇదేమీ ఎడారి ప్రాంతం కాదు. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశమే. కానీ రెండు హృదయాలను చూసుకునేలా చేసే పోస్టాఫీసే లేదు. అందుకే నా దగ్గరున్న కాగితాలన్నీ అక్షరాలు లేకుండా తెల్లగా బోసిపోయి ఉన్నాయి. వెలవెలబోతున్న ఈ కాగితాలన్నీ అక్షరాలతో కళకళలాడేదెప్పుడో తెలీలేదు చెల్లెమ్మా....నంవ్వేదైనా ప్రత్యామ్నాయముంటే చెప్పు. నీకు బోలెడు మాటలు చెప్పాల్సి ఉంది ఈ అన్నయ్య...
ఉత్తరం - జయా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి