నేను జాగ్రత్త..--అవును, మనం ఒక్కొక్కరం మనతో మనమే "నేను జాగ్రత్త" అని చెప్పుకోవాలి.ఇది ఎంతో అవసరం.ఎందుకంటే, మనలో పలు మృగాలు దాగి ఉన్నాయి.ఏది ఎప్పుడు బయటకు తొంగి చూస్తుందో ఎవరికీ తెలీదు. కుక్కయితే రెండు గుణాలు. ఒకటి, తెలియనివారిని చూస్తే మొరుగుతుంది. తెలిసినవారిని చూస్తే తోక ఆడిస్తుంది.పాము దానికి ఇబ్బంది కల్పిస్తే ఎదురు తిరుగుతుంది. బుస కొడుతుంది. లేకుంటే అసలు మన జోలికిరాదు. ఏ హానీ చేయదు.ఇలా అన్ని మృగాలూనూ. ఒక్కొక్కదానికీ తనకంటూ కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటూ ఉంటాయి. కానీ మనిషిలో మాత్రం అన్ని మృగాల గుణాలూ ఒక్కటిగా ఉంటాయి. అది మనిషి గొప్పతనమో కాదో అనేది ఆయా సందర్భాన్ని బట్టి తెలుస్తుంది.అందుకే మనిషి స్వభావం ఒక్కలా ఉండదు. అతనిలో అన్ని జంతువుల గుణగణాలూ ఉంటూ ఉంటాయి. అందుకే నేను నా విషయంలోనే జాగర్తగా ఉండాలి అని మనిషి అనుకోవాలి. సమీక్షించుకోవాలి. అప్పుడే మనం ఇతరులతో అప్రమత్తంగా సవ్యంగా వ్యవహరించగలం.మనిషి మనసు పేరుకోసమో ప్రతిష్టకోసమో అధికారం కోసమో హోదా కోసమో ఆశపడితే రేపు వాటిని కోల్పోవచ్చు.సర్కస్సులో తీగ మీద నడిచే యువతి మనసంతా తీగ మీదా, చేతిలో ఉండే కర్రమీదా ఉండాలి. కింద పడకుండా తాను నడవాల్సి ఉంటుంది. మనస్సు కాస్త చెదరినా తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "వాళ్ళు నన్ను చూసేగా చప్పట్లు కొడుతున్నారు" అని అనుకుంటే ఆ యువతి కథ అక్కడితో సరి.ఆ యువతి తన విషయంలో తాను అప్రమత్తంగా ఉండటంవల్లే ఒకవైపు నుంచి మరొక వైపునకు తీగమీద నడవగలుగుతోంది. అలాకాకుండా చప్పట్లకు ఉబ్బిపోతే ఆమె కథ ముగిసినట్లే. దీనినే జాగ్రదావస్థ అంటారు. ఆ "అవస్థ" ను గాలికి వదిలేస్తే అసలే లేకుండా పోతాం. ఈ " అవస్థ " విషయంలో జాగర్తగా ఉండాలి. కళ్ళు మూసుకుపోతే ఏం జరుగుతుందో వేరేగా చెప్పక్కర్లేదు. నేనూ అనే అహం తొంగి చూసిందో కథ నాశనానికి దారి తీస్తుంది. కనుక చైతన్యంతో కూడిన అప్రమత్తత ఎంతో అవసరం. అందరినీ నమ్మాలి. అలాగని ఆ నమ్మకంలోనే మునిగిపోతే ఇవతలకు రాలేం. అందరి మాటా వినాలి. వినడం అనేది సుగుణం. కానీ మనకెంత వరకు ఉపయోగపడుతాయో అనే విచక్షణ మనకుండాలి. లేకుంటే అంతేసంగతులు.నేను జీవితంలో నమ్మి మోసపోయిన సంఘటనలు ఒకటా రెండా. అరవై ఏళ్ళ వరకూ సాగిన జీవితం వేరు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు వేరు. ఏ క్షణంలో ఎక్కడ ముప్పు పొంచి ఉందో ఎవరూ చెప్పలేరు. ఎన్ని ఎగుడుదిగుళ్ళో.... వాటి నుంచి ఎప్పటికప్పుడు నేర్చుకున్న పాఠాలతో పొందిన అనుభవం తీరా నా వయస్సు సగం కన్నా ఓ రెండేళ్ళు తక్కువ ఉన్న ఒకరి ఆటలో పావునై నేను దెబ్బతినడంతోపాటు నాతో ఉన్న మరో ఇద్దరినికూడా ఇబ్బందులకు లోను చేసి ప్రశాంతంగా పోతున్న జీవిత నౌకను సుడిగుండంలోకి నిలిపి ప్రశాంతతను కోల్పోయి ఇవతలకు రావడంకోసం గత మూడేళ్ళుగా నానాపాట్లు పడుతున్నాను. "నా" అనుకున్న ఓ మనిషి మా వెంటే నీడై ఉండి ఓ ఆట ఆడిస్తుందని తెలుసుకోలేక పోయాను. అందుకే అన్పిస్తుంది నాతో నేను జాగ్రత్తగా ఉండు అని అనుకోవాల్సి వస్తోంది. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు