149.పదవీవిరమణ కార్యక్రమం:--బెలగాం భీమేశ్వరరావు--9989537835

1972 జూన్ 12 న సెకండరీ గ్రేడ్ సహాయోపాధ్యాయుడిగా ఉద్యోగం లో ప్రవేశించి ఎం.యు.పి.పాఠశాల, గెంబలివారివీధి;టి.ఎం.ఇ.
పాఠశాల, దుగరాజుపేట; ఎం.యు.పి.పాఠశాల,కొత్తవలస;ఎం.యు.పి.పాఠశాల, జగన్నాధపురం;ఆ తరువాత మళ్ళీ టి.ఎం.ఇ. పాఠశాల,దుగరాజుపేట లలో 30 సంవత్సరాలు సెకండరీగ్రేడ్ టీచర్ గా పనిచేసి 2002లో బి.ఇడి.సాంఘికశాస్త్ర సహాయోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది టి.ఆర్.ఎం.ఎం.బాలికోన్నత పాఠశాలలో మిగతా8 సంవత్సరాలు పనిచేసి 2010 జూలై 31నఅదే పాఠశాలలో పదవీవిరమణ చేశాను.ఉపాధ్యాయుడిగా 1వ తరగతి నుంచి10వ తరగతి వరకు పాఠాలు చెప్పే అవకాశంకలిగింది.విద్యార్థుల వివిధ స్థాయిలను,వారి వివిధమానసిక స్థాయిలను తెలుసుకొనే అవకాశం దక్కింది. విద్యార్థుల ఇష్టాలు కష్టాలు,సరదాలు సందడులు , సమస్యలు నివారణోపాయాలు తెలుసుకొనే అవకాశం చిక్కింది.పిల్లలకు ఎంతవరకు చెప్పాలి ఎలా చెప్పాలి అనే అంశాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోగలిగాను. ఇవన్నీ నా బాలసాహిత్య ప్రయాణానికిఉపయోగపడినవే! 2010 జూలై 31 తేదీనఉపాధ్యాయుల హాజరుపట్టీలో రెండవ పూటసంతకం చేసినప్పుడు కొంత ఉద్విగ్నతకు లోనయ్యాను!అదే ఉపాధ్యాయుల హాజరుపట్టీలోచివరి సంతకం!మా నాన్నగారు తరచుగా అనేమాటలు గుర్తు వచ్చాయి.మనకు బతుకునిచ్చేపాఠశాలే దైవం, పిల్లలకు నిజాయితీగా పాఠాలు చెప్పడం మనం దైవానికి చేసే పూజఅని అంటుండేవారు. మనకు మనకుటుంబానికిఅన్నం పెట్టేది వృత్తి అని దానికి ఎప్పుడూఅన్యాయం చేయరాదని పదే పదే చెప్పేవారు.ఆయనన్న మాటలు అక్షర సత్యాలు.నేను చేసేఉపాధ్యాయవృత్తి నాకు స్థిరమైన కుటుంబాన్ని
ప్రసాదించింది.స్వగృహంలో ఉండే భాగ్యం కల్పించింది. నా పిల్లలకు చదువులు చెప్పించేస్తోమతనిచ్చింది.నేను పాఠాలు చెప్పే విద్యార్థులకుఅక్షరజ్ఞానం,పుస్తకజ్ఞానం లతో పాటు మంచినడవడి నేర్పే అవకాశమిచ్చింది.ఇవే కాకుండాబాలసాహిత్య రచయితగా మారడానికి ఎదగడానికి బంగారు దారి నాకు చూపించింది!నా జీవిత ప్రయాణానికి చుక్కాని అయిన నావృత్తికి కోటి దండాలు కృతజ్ఞతలు మనసులోతెలుపుకొని ఆ రోజు సాయంత్రం ఉపాధ్యాయులువిద్యార్థులు వీడ్కోలు ఇవ్వగా బరువైన హృదయంతో పాఠశాల బయటకు భారంగా వచ్చాను! మర్నాడు ఆగష్టు 1 ఆదివారం నాడు స్థానిక కళ్యాణ మండపంలో పదవీవిరమణ వీడ్కోలు సభ మా ఉపాధ్యాయ సిబ్బంది ఏర్పాటు చేశారు.ఆ వీడ్కోలు సభకు పురపాలక సంఘ పాఠశాలలఉపాధ్యాయులందరు వచ్చారు.మా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వచ్చారు.సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్.వెంకటరావు గారు అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథులుగా స్థానిక ఎం.ఇ.ఓ.శ్రీసింహాచలం గారు,మా చిన్ననాటి గురువుగారు,సాహితీలహరి వ్యవస్థాపకులు డా.మంచిపల్లిశ్రీరాములు గారు,నా మొదటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రావిపల్లి దాసు మాష్టారుపాల్గొన్నారు! సాధారణం తీరులో వీడ్కోలివ్వండనికోరినా నా మీద ప్రేమాభిమానాలతో ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్.వెంకటరావు గారుసహోపాధ్యాయులు శ్రీ పి.రాజా,శ్రీ ఆర్.చంద్రమౌళి,
శ్రీ ఏ.మిన్నారావు,శ్రీ రమేష్ , శ్రీ జగదీష్ గారలు ఘనంగానే సభాఏర్పాట్లు చేశారు. వారిని మరియు నా పదవీవిరమణకు కొద్ది రోజులు ముందుగా వేరొక పాఠశాలకు బదిలీ అయినశ్రీ బి.గోవింద, శ్రీ జి.విశ్వం,శ్రీ జె.సింహాచలం, శ్రీజె.శ్రీరాములు గారలను,ఒక సోదరుడిలా నన్నుఅభిమానించిన శ్రీమతి ఇ.జ్యోతి, శ్రీమతి శోభాదేవి, శ్రీ మతి రమణమ్మ,శ్రీమతి పి.సుజాత, కుమారి మాధురి,శ్రీమతి మంజుల మేడంలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోడం సముచితమని భావిస్తున్నాను. నా ఉపాధ్యాయ ప్రయాణంలోఎందరో ఉపాధ్యాయులు తారసపడ్డారు.అందరికీవందనాలు!(సశేషం).