164.పిల్లలూ దేవుడూ చల్లని వారే::-బెలగాం భీమేశ్వరరావు,9989537835.

ఒకరోజు కథ రాయాలని కూర్చున్నాను.మా పెద్దమ్మాయి గీతాకిరణ్మయి తన బాల్యంలో చేసిన పని గుర్తొచ్చింది. అమాయకత్వం, నిర్మలత్వం చిన్నపిల్లల సహజ గుణాలు.ఒక రోజు అర్ధరాత్రిమా అమ్మాయి చేసిన పనికి త్రుళ్ళిపడి నిద్ర లేచాం.ఆ సన్నివేశం ఇతివృత్తంగా తీసుకుని"నైవేద్యం" అనే కథను రాశాను.ఇక కథలోకివెళ్దామా... ఉదయం,సాయంత్రం రెండు పూటలూ
దేవుడి పీని వద్ద దీపం వెలిగించి ఖర్జూరమో కిస్మిస్పళ్ళో దేవుడికి పెట్టడం ఆ ఇంటి ఇల్లాలు జానకమ్మకు అలవాటు. ఆమె కూతురు స్నేహ.నాలుగో యేడాది దాటినా స్నేహను ఇంకా 
కాన్వెంట్ కి పంపలేదు.తల్లి చేసే ప్రతి పనీ పరిశీలించి అనుకరించడం ఆ పాపకు అలవాటు.
తల్లి దేవుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు స్నేహ
పక్కనే ఉండి తల్లి చేసేదంతా గమనించేది.పూజ
అయ్యాక తల్లి ఇచ్చే ప్రసాదం కోసం ఎదురు 
చూసేది.స్నేహకు ఖర్జూరమన్నా కిస్మిస్ పళ్ళన్నా
మహా ఇష్టం. పూజ పూర్తయ్యాక తల్లి ఇచ్చిన
ప్రసాదం అందుకొని ఆడుకోవడానికి తుర్రున పారి
పోయేది.ఒక రోజు రాత్రి స్నేహకు నిద్రపట్టలేదు.
ఆమె దృష్టి దేవుడి పీని దగ్గరున్న ప్రసాదం డబ్బా
మీద పడింది. డబ్బాలో కిస్మిస్ పళ్ళున్నాయి.
ఆ పళ్లు తినాలనిపించింది స్నేహకు.తల్లీ తండ్రీ
ఆదమరచి నిద్ర పోతున్నారు.మెల్లగా ఆమె
మంచం దిగి దేవుడి పీని వద్దకు వెళ్ళింది.కిస్మిస్
పళ్లున్న డబ్బా తెరిచింది. గుప్పెడు పళ్లు తీసింది.
అక్కడున్న చిన్న పళ్ళెంలో వేసింది. పళ్ళెం
దేవుడి పీని మీద పెట్టి గంట అందుకొని గణ గణ
మోగించింది. తల్లీ తండ్రీ ఇద్దరు త్రుళ్ళిపడి లేచారు.స్నేహ పీని ముందు రెండు చేతులూ
జోడించి మొక్కుతూ కనిపించింది. తల్లి స్నేహ
దగ్గరకు గబుక్కున వెళ్ళి "ఇప్పుడెందుకు పూజ?"
అని అడిగింది."పళ్లు తినాలనిపించింది అందుకే
పూజ చేశాను"అంది స్నేహ.తల్లి నవ్వుతూ డబ్బా
లోని పళ్లు తీసి తినవచ్చుగా అంది.స్నేహ
ముక్కు మీద వ్రేని పెట్టి "తప్పు. జేజికి ఇచ్చాకే
తినాలి.నువ్వు రోజూ అలాగే చేస్తున్నావుగా!"అంది. స్నేహ సమాధానం విని
తల్లిదండ్రులు నివ్వెరపోయారు.ఈ కథ 2012
మార్చి 4 వార్త ఆదివారం సంచికలో వచ్చింది.
(సశేషం)