బాలసాహిత్యం -29- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, --ఫోన్: 7013660252.

గిడుగు వెంకట సీతాపతి గారు 1885 జనవరి 28వ తేదీన  విశాఖపట్నం జిల్లాలోని భీముని పట్నంలో జన్మించారు. సీతాపతిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి వక్త, నటుడు, ఆధునిక బాల గేయ సాహిత్యానికి ఆధ్యుడు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం మూడు భాషలకు ముద్దుబిడ్డ. ఇతని తండ్రి గిడుగు రామ్మూర్తి పంతులుగారు. తల్లి  అన్న పూర్ణమ్మ. ఆమె గాయకురాలు. తండ్రి గిడుగు రామ్మూర్తి పంతులుగారు  వ్యవహారిక భాషోద్యమకర్త. ఈ భాషోద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు రామ్మూర్తిగారు తన కుమారుడైన వెంకట సీతాపతిని ఉత్తేజపరిచారు. సీతాపతికి  బడికి పంపకుండా ఇంటి వద్దనే తల్లి అన్నపూర్ణమ్మ చదువు నేర్పించేవారు. సీతాపతి బాల్యంలో తోటి పిల్లలతో స్నేహపూర్వకంగా తిరిగే అలవాటు లేక గిల్లికజ్జాలు తెచ్చుకునేవారు.1891లో తండ్రి రామమూర్తి పంతులుగారు సీతాపతిని పాఠశాలలో చేర్పిం చారు.1897లో విక్టోరియా రాణి వజ్రోత్సవాలలో 12 సంవత్సరాల వయసులో సీతాపతి  విక్టోరియా రాణిని ప్రశంసిస్తూ కొన్ని పద్యాలను వ్రాసి ఆ ఉత్సవ సభలో చదివి నందుకుగాను  బహుమతిగా  "బాయ్స్ ఓన్ ఏన్యువల్" అనే పుస్తకాన్ని సీతాపతికి ఇచ్చారు. ఆ పుస్తకం ఆంగ్ల భాషలో ఉంది. అందులో అనేక కథలు, వ్యాసాలు, పద్యాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని సీతాపతి పదే పదే చదివేవాడు. ఇటువంటి పుస్తకం తెలుగులో ఉంటే బాగుండేది అనుకునేవాడు.   సీతాపతి చదువుతున్న రోజుల్లోనే కొన్ని కొన్ని పద్యాలను వ్రాసి తండ్రికి చూపించేవాడు. అందుకు రామమూర్తి పంతులుగారు ఎంతగానో సంతోషించి తాను తలపెట్టిన భాషోద్యమాన్ని తన కొడుకు ముందుకు తీసుకు వెళ్లగలడని విశ్వసించారు.1909లో సీతాపతిగారు చాలా బాల గేయాలను రాశారు. అందులో "చిలుకమ్మ పెళ్లి" " రైలుబండి" మొదలైన గేయాలు ఉన్నాయి. అయినా తను రాసిన గేయాలు అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఆంగ్ల భాషలో బాలసాహిత్యంలో  చెట్లు,పువ్వులు, పండ్లు, మృగములు పక్షులు గురించి ఆయా రచయితలు వ్రాసేవారు. వాటిలో అందరినీ ఆకర్షించే బొమ్మలు ఉండేవి. అవి చూసిన సీతాపతి ఇవి ఎలా సాధ్యమని  ఆశ్చర్యపోయే వారు. “ వివేకవతి” అనే పత్రికలో క్రైస్తవ సంఘం వారు  సీతాపతి గారు రాసిన రచనలను ప్రచురించేవారు. ఆ రచనలను అనేక మంది బాలలు వీధుల్లో పాడుకునే వారు.1930 తర్వాత వ్యవహారిక భాష బాగా వ్యాప్తి చెందింది. అదే సమయంలో సీతాపతిగారు  తెలుగు, ఆంధ్ర, సంస్కృత భాషలలో విశేషకృషిచేసి పాండిత్యాన్ని సంపాదించారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో బి ఏ పూర్తి చేశారు. 1940 నుండి “ భారతి” అనే సాహిత్య మాస పత్రికలో సీతాపతిగారు 1949లో " బాలానందం” అనే శీర్షికన అనేకమైన గేయాలు, గేయ కథలు, చిన్న చిన్న కథలు రాశారు. బాలానందం శీర్షికలో వ్రాసిన రచనలకు మంచి ఆదరణ లభించింది. సీతాపతిగారు వ్రాసిన "చిలుకమ్మ పెండ్లి''  పాటను చూడండి...........!
“చిలుకమ్మ  పెండ్లియని చెలికత్తెలందరును/ చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు" అని అంటారు. "ఎలుక -- పిల్లి" వినోదంతో కూడుకున్న గేయ కథ. "కావు... కావు..." అను పాటలో పక్షులగుణగణాలను తెలియజెప్పారు.    అందులో ముఖ్యమైనవి బాలానందం, భారతీ శతకం, స్వీయచరిత్రలు. 1950లో వీరు వ్రాసిన "బాలానందం'' పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వం బాల సాహిత్యములో ఉత్తమ గ్రంథముగా ప్రకటించారు. తర్వాత కాలంలో కేంద్ర ,  రాష్ట్ర ప్రభుత్వాలు బాలసాహిత్యాన్ని అభివృద్ధి పరచడానికి అనేక చర్యలు తీసుకున్నారు.1956లో రాజమండ్రి లోనూ, 1958, 1961 సంవత్సరాలలో హైదరాబాదులోనూ ఆరు వారాల కార్యక్రమంగా  శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి బాలసాహిత్య రచయితలకు శిక్షణను అందజేశారు. సీతాపతి గారు మంచి రచయితే కాకుండా మంచివక్త, నటుడు కూడాను. నటుడిగా ఆయన 8 సినిమాల్లో నటించారు. కానీ సినీ రంగంకన్నా  భాషోద్యమం మీద మిక్కిలి ఆశక్తిని కనపరిచారు. తండ్రి ఆశయం మేరకు సవరజాతి భాషా సంస్కృతుల అభివృద్ధికి ఎంతగానో కృషి
చేశారు.  సీతాపతి గారు “ బాల వినోద గేయములు” వ్రాసి అందరి మన్ననలు పొందారు.ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు  సీతాపతి గారికి “ కళాప్రపూర్ణ” బిరుదును, గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి సన్మానించారు. అందరి మన్ననలను పొందిన  సీతాపతి గారు1969 ఏప్రిల్ 4న స్వర్గస్తులయ్యారు( సశేషం )