బాల సాహిత్యం - 30 -- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 1888 ఫిబ్రవరి 7వ తేదీన కృష్ణాజిల్లా కల్లేపల్లి గ్రామంలో జన్మించారు.వేటూరి సుందర శాస్త్రి,శేషమ్మ వీరి తల్లిదండ్రులు.వీధి బడి చదువులు చదివి తెలుగు, సంస్కృతం ఒక గురువు గారి దగ్గర నేర్చుకున్నారు. మహా పండితుల సాహిత్య గోష్ఠులు, ప్రసంగాలు ఇతనిని
మనిషిగా తీర్చి దిద్దాయి. చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారి దగ్గర పద్య రచనలు, ఉపన్యాసాలు, కవితా గోష్టులు, వాదప్రతి వాదాలు శాస్త్రి గారి ప్రావీణ్యత కు దోహదం చేశాయి. దేశమంతా తిరిగి  కనుమరుగవుతున్న బాల సాహిత్యానికి సంబంధించిన పద్యాలను పాటలను వెలుగులోకి తెచ్చారు. తెలుగులో మహా గ్రంథాలను శాస్త్రి గారు చదివి తన మేధస్సును పెంచుకున్నారు. ముందు తరాలవారికి బాలసాహిత్య విలువలను రుచి చూపించడానికి "బాల భాష'' అనే గ్రంథాన్ని తీసుకువచ్చారు. తెలుగుదేశంలో బాలల పాడే పాటలు చెప్పుకునే కథలను సేకరించే గేయాలను 1930లో " భారతి"  సాహిత్య పత్రికలో బాల భాష అనే శీర్షికతో ప్రచురించారు.నేడు లభించే చెమ్మ చెక్క- చారడేసి మొగ్గ; "తారంగం తారంగం" వంటి పాటలు ఈనాటికి చెక్కుచెదరకుండా ఉండి పిల్లలు పాడుకుంటున్నా  రంటే ప్రభాకరశాస్త్రి గారి కృషి వల్లనే. గ్రంథస్థంగానే బాలసాహిత్యాన్ని ప్రచురించి భవిష్యత్ తరాలవారికి ఉపయోగపడే విధంగా కృషి చేశారు. తెలుగు సాహిత్యంలో ఉన్న నానుడులు, పాటలు, నుడికారాలు, పదాలు, చమత్కారాలు,  పొడుపు పద్యాలు ,దేశీయాలు మొదలగునవి సేకరించి శాస్త్రిగారు గ్రంథస్తం చేశారు. “ బాల భాష” అనే బాలల గేయాలను 1956లో పుస్తక రూపంలోకి తెచ్చి భావితరాల బాలలకు అందించారు. ఇక చొక్కాపు వెంకటరమణ గారు “బాలల వలనే ముద్దు మాటలు శబ్దం ధ్వని కలిగి ఉండటమే ప్రధానమని, అర్థం ఉన్నా లేకపోయి నా  ముచ్చటైన మాటలను ముద్దు ముద్దుగా కూర్చి సుతిమెత్తగా పలక గలిగినదే " బాల భాష " అవుతుందని అంటారు. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తన 12వ ఏటనే పరభాషలో కవితలు రాసిన ఘనుడు. బాల సాహితీవేత్త, శతావధాని, ఖండకావ్యాల రచయిత, విమర్శకుడు. ప్రౌఢ సాహిత్యములో బసవ పురాణం, రంగనాథ రామాయణం, ఆంధ్రుల చరిత్ర, అన్నమాచార్య కీర్తనలను వంటి గ్రంథాలు అనేకం రాశారు.వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సేకరించిన బాల భాష బాలల పాటలు సంకలనాన్ని భవిష్యత్తు తరాల బాల బాలికలకు అందుబాటులోకి  తెచ్చేటందుకు 1982లో ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ పునర్ముద్రణ జరిపి రాష్ట్రంలో గల పాఠశాలలన్నింటికీ సరఫరా చేసింది. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆరోగ్యం క్షీణించి 1950 ఆగస్టు 29వ తేదీన స్వర్గస్తుల య్యారు. ఈ వ్యాసం చొక్కాపు వెంకటరమణ గారిచే వ్రాయబడిన "బాల సాహితీ వైతాళికులు" అనే గ్రంథం ఆధారంగా వ్రాయబడింది. ( సశేషం )