బాలసాహిత్యం 31(2)-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, --ఫోన్: 7013660252.

1952లో బాల సాహిత్య రచయితలంతా బి.వి నరసింహ రావుగారితో సహా  తమ తమ రచనల గురించి సమీక్షించుకుని  బాల సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో వీరంతా ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఆ సందర్భంగా బాలల రచయితల సంఘం ఆవిర్భవించింది. ఆ సంఘానికి బి వి నరసింహా రావుగారు అధ్యక్షునిగా ఎంపికయ్యారు. నరసింహారావుగారు అనేక బాలగేయాలు, గేయ కథలు, నృత్య నాటికలు రాశారు. అతను రాసిన వాటిలో "బాలబడి పాటలు,బాల రసాలు, ఆవు- హరిశ్చంద్ర, ప్రియదర్శి, చిన్నారి లోకం, ఋతు రాణి,  అమ్మ ఒడి,  బాలల లోకం, వెన్నెల బడి, మున్నీ గీతాలు , భీమసేనుడు గేయ సంకలనాలు తనచే తీసుకురాబడ్డాయి. వీటన్నింటిలో  " పాల బడి పాటలు" అనే గ్రంథానికి మంచి ప్రాచుర్యం లభించింది. ఈ గ్రంథానికి 1958లో భారతదేశ ప్రభుత్వం నరసింహారావుగారిని జాతీయ పురస్కారంతో సత్కరించింది. 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి.  ఆ సందర్భంగా బి వీ నరసింహారావు గారు " బాల వాఙ్మయం" పేరుతో తెలుగు బాలసాహిత్య చరిత్రను రాశారు.1978లో ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ పీవీ నరసింహారావును " బాలబంధు"
బిరుదుతో సత్కరించింది.1979లో బి.వి.నరసిం హారావు గారికి ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ బాల సాహితీ రచయితల బాలగేయాలను " మల్లెల మందారాలు" అనే పేరుతో సంకలనం చేసి ఇచ్చే బాధ్యతను అప్పగించింది. నరసింహారావు గారి పాటలు, గేయాలు, గేయ నాటికలు తరచూ ఆకాశవాణిలో ప్రసారం అవుతూ ఉండేవి. అంతేగాక ప్రముఖ పత్రికలైన కృష్ణా పత్రిక, విశాలాంధ్ర, ప్రారంభ విద్య, బాలజ్యోతి, ఆంధ్ర మహిళ లాంటి పత్రికలలో ప్రచురితమయ్యేవి.కేరళ సాహిత్య అకాడమీ వారు సంకలన పరచిన “ కంపారిటివ్ ఇండియన్ లిటరేచర్” కి నరసింహా రావుగారు తెలుగు బాల సాహిత్యం గురించి ఆంగ్లంలో ఒక వ్యాసం రాశారు. బి వి నరసింహారావు గారు బాల సాహిత్యం గురించి చెబుతూ"సాహిత్యం వ్రాసేవారు పసి హృదయాల లోతులు పరిశ్రమించి పరిశోధించాలి. గేయ రచన కు  మాత్రా ఛందస్సు మర్మాలు క్షుణ్ణంగా తెలుసు కోవాలి. తేలికైన మాటలలో అపురూప మైన భావాలను పొదిగే నేర్పు రచయిత కలిగి ఉండాలి. కథ రాసినా, గేయం రాసినా, నాటిక రాసినా, వ్యాసం రాసినా, పిల్లలు తామై  పలికి నట్లు పాడినట్లు, పరవశించి ఆడినట్లు ఉండాలి.
అన్నీ మనకే తెలిసినట్లు , పిల్లలకు ఏమీ తెలియ దన్నట్లు మనం ఉండకూడదు. ప్రాచీన బాల వాగ్మయాన్ని , ప్రపంచ బాల వాగ్మయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. బాల సాహితీ  క్షేత్రంలో కృషీవలులందరూ బాలోద్ధరణకు కంకణం కొట్టుకోవడానికి ఆత్మ సంస్కారం ముందుగా అవసరం అంటారు. అంతేకాదు పిల్లలకు నీతి కథలు రాయాలన్న సంకల్పం ఒక గొప్ప విషయం. నీతి కథా సాహిత్య సృష్టికి కేవలం భాషాపాండిత్య  మే గాక లోక వృత్త పరిశీలన, బాల మనస్తత్వ పరిజ్ఞానం, మంచి బోధనానుభవం  ఉండాలి. పిల్లలకు తెలుప వలసిన విషయం యొక్క పరిమితి, పద్ధతి ముందు రచయితలకు ఆకలింపు కావాలి. భాష , భావం  పిల్లల అంతస్తుకు సరిపడా ఉండాలి. నీతి అనేది బ్రతుకులో ఒక చక్కని రీతికి మార్గం చూపుతుంది. నీతి లేని మనిషి బ్రతుకు నిరర్థకం. నీతులను కేవలం పిల్లల చేత వల్లె వేయించినంత   మాత్రాన అవి వారికి ఒంట పట్టవు. జీవిత వృత్తములో వాటిని మిళితం చేసి కథలుగా అందిస్తే పిల్లల మనస్సులలో అవి బాగా హత్తుకుంటాయి. చిన్ననాడు నాటుకున్నవి చిరకాలం నిలిచి ఉంటాయి"అని అంటారు బి వి  నరసింహారావుగారు. ఇలా తన వ్యాసములో బాల సాహిత్య అభివృద్ధి గురించి ఎన్నో సూచనలు చేశారు.   దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు బాలబంధు బి వి నరసింహారావు గారి సంపూర్ణ రచనల సంకలనాలను తీసుకురా వాలని ప్రయత్నించారు.ఈ సంస్థవారు నరసింహా రావుగారి సమగ్ర సాహిత్యం ముద్రించాలన్న ప్రయత్నములో వారి జీవన రేఖలు, గేయాలు, కథలు, వ్యాకరణం అన్నీ కలిపి 30కి పైగా ఉన్నట్లు తెలుసుకున్నారు. వాటినన్నిం టినీ పొందాలని ప్రయత్నించారు. కానీ  మున్నీ గీతాలు, ఋతు గీతాలు, ముద్దుబిడ్డ కథలు లభించలేదు. మిగిలిన రచనలన్నీ లభించాయి. వాటిని మూడు భాగాలు చేశారు. మొదటి భాగంలో జీవన రేఖలు, వ్యాసాలు, బి వి గారి గురించి మిత్రులు రాసిన వ్యాసాలు, చలం లేఖలను, అలానే  సంజీవ్ దేవ్ గారి  ముందుమాట  ఇందులో పొందుపరిచారు. ఇక రెండో విభాగానికి వస్తే  నరసింహారావు గారి కథలు, గేయాలు, గేయ నాటికలను పొందుపరిచారు. మూడవ భాగంలో బాల వాంగ్మయము, పదవిపంచి, ఆంధ్ర పదావళి, అమృతాంశువులుగా చేర్చారు. ముందు తరాలకు తెలుగు భాష అభివృద్ధికి ఈ సంపుటాలు ఉపయోగపడతా యని దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు అంటారు. మన బాల బంధువు  బి వి నరసింహారావు గారు 1994 జనవరి 7వ తేదీన స్వర్గస్తులయ్యారు.నా రచనకు ఆధారం 
1. KINIGE తెలుగు ఈ -- పుస్తకాల ప్రపంచం
2. చొక్కాపు వెంకట రమణ గారి బాల సాహితీ వైతాళికులు. 3. 1977లో హైదరాబాదులో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ బాలల మహాసభలలో బి వి నరసింహారావు గారు రాసిన వ్యాసం. ( సశేషం )