బాల సాహిత్యం -31-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, --ఫోన్: 7013660252.

బాలబంధు బి వి నరసింహారావుగారి గురించి బాల సాహితీవేత్త అన్నవాడు ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సిందే. ఇతను1913 ఆగస్టు 15 తేదీన కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలో  "కవుతరం" అనే గ్రామంలో జన్మించారు. గుడివాడలో స్థిరపడి ఉపాధ్యాయుడుగానూ, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గాను పని చేశారు. గేయాలు రాసేటప్పుడు చక్కని బాణీ కట్టి వాటిని పలు సభలలో పాడేవారు. తన పాఠాలను విన్న పిన్నలు పెద్దలు ఎంతో ఆనందాన్ని పొందేవారు. నరసింహారావు గారికి బాల్యము నుండి అంతర్ లయ, స్పందన, కవితావేశం, ఊహా కల్పనలు ఉండేవి. ఆయనలో అనుకరించే శక్తి అధికంగా ఉండేది. పాట కంటే ముందు లయగతి ఆయనలో మనకు కనిపించేది. వెంకట పార్వతీశ కవులలో ఒకరైన ఓలేటి పార్వతీశ కవి నరసింహారావు గారి పాటలు విని "  మనం పిల్లల కోసం రాసేటప్పుడు పిల్లలమై పోవాలని చెబుతూ, వారు కూడా బాల గీతాలను అలాగే రాశామని" చెప్పారు. పార్వతీశ కవిచెప్పిన మాటలు జీవితాంతం నరసింహారావు గారికి గుర్తుండిపోయాయి. న్యాయపతి రాఘవరావు గారు మద్రాసు నుండి " బాల '' పత్రికను ప్రచురిస్తున్న సందర్భంలో వారు ఈ క్రింది గేయాన్ని రాశారు.  "అనగా అనగా కోతి-- కోతికి కలదు మూతి-- మూతికి కలదు ముక్కు-- ముక్కు ముక్కు ఉక్కు-- డీ డీ డీ డీ డిక్కు" అని. న్యాయపతి రాఘవరావు గారిచే వ్రాయబడిన ఈ గేయము బి వీ నరసింహారావుగారిని ఎంతో ముగ్ధుల్ని చేసింది. తను కూడా ఇటువంటి గేయాలను వ్రాయాలని ముందుకు వచ్చారు. ఆ వెంటనే " చింత చెట్టు తొర్రలోన/ చిలక ఉన్నదీ/ తాత బోడి బుర్ర మీద/ పిలక ఉన్నదీ"// అని రాశారు. అదే పాటను మద్రాసు రేడియోలో పాడారు. అంత్య ప్రాసలతో రాసిన గేయాలు పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తాయని నరసింహా రావుగారు గుర్తెరిగారు. నరసింహారావు గారు పాఠశాలల ఇన్స్పెక్టర్గా తూర్పు గోదావరిలో గల రామచంద్రాపురం తాలూకాలో పని చేసేవారు. ఆ సమయంలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిని నరసింహారావు గారు ఒక కోరికను కోరారు. అదేమిటంటే ఇక పాఠశాలల విద్యార్థుల కోసం బాల గేయాలను రాసి పెట్టమన్నారు. అందుకు ఇంద్రగంటి వారు నవ్వి " అయ్యా! పిల్లల బడులను నిత్యం మీరు పర్యవేక్షిస్తున్నారు. వారి మనస్తత్వం నాకన్నా మీకే బాగా తెలుస్తుంది. నాట్య శిల్పిగా అందరి మన్ననలు పొందారు. రాగం, తాళం, పల్లవి, భావం తెలిసిన మీరు బాల గేయాలను బాలలకు నచ్చినట్లుగా వ్రాయగలరు.” అన్నారు.  ఇంద్రగంటివారి మాటలను ముత్యాల మూటలుగా భావించి నరసింహారావు గారు ముందుకు సాగారు. అంతేకాకుండా చింతా దీక్షితులు, చలం, నాళం కృష్ణారావు, ఓలేటి పార్వతీశ కవి లాంటి బాల సాహితీవేత్తలు తన రచనల వెనుక ఎందరో ఉన్నారని  నరసింహారావు గారు మరీ మరీ చెప్పుకునేవారు. అంతే కాకుండా మద్దులూరి రామకృష్ణ , కవిరావు, నార్ల చిరంజీవి, అలపర్తి వెంకట సుబ్బారావు, వేజెండ్ల సాంబశివరావు మొదలగు వారంతా నరసింహారావు గారికి సమకాలీనులే ! వీరు ఒకరినొకరు కలుసుకునేటప్పుడు బాల సాహిత్యంపై చర్చలు జరిపేవారు. ( సశేషం )