బాలసాహిత్యం - 35- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి--ఫోన్ 7013660252

దాసరి సుబ్రహ్మణ్యం గారు ప్రముఖ బాల సాహితీవేత్త. ఇతను తెనాలి సమీపంలో చుండూరు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పెద్దగాజులూరులో  1922 అక్టోబర్ 25 వ తేదీన జన్మించారు. సుబ్రహ్మణ్యంగారు సెకండరీ గ్రేడ్ లీవింగ్ సర్టిఫికేట్ ( ఎస్. ఎస్. ఎల్. సి ) వరకు చదువుకున్నారు. స్వయంకృషితోనే తెలుగు,  ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. పంచతంత్రం, పాండురంగ మహత్యం, లాంటి గ్రంథాలను చదివారు. అంతేకాకుండా ఆంగ్ల భాషలో ఫీల్డింగ్,డికెన్స్, మార్క్ ట్వైన్ వంటి వారి రచనలను అనేకం చదివారు. సుబ్రహ్మణ్యం గారు కుటుంబ పరంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు . ఆ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కొరటాల సత్యనారాయణ వాసిరెడ్డి నారాయణరావుగారికి సుబ్రహ్మణ్యం విషయంలో ఒక సిఫార్సు లెటర్ ఇచ్చి నారాయణరావుగారి ఇంట్లో సుబ్రహ్మణ్యంగారికి కొన్ని రోజులు అంటే ఉద్యోగం లభించే వరకు ఆశ్రయం ఇమ్మన్నారు.సుబ్రహ్మణ్యంగారు ఒకరిని ఇబ్బంది పెట్టకూడదనీ, బయటే తిండి తిని గదికి చేరేవారు. తిండి తినని రాత్రులు ఎన్నో ఉండేవి. అయినా బయటపడే వారు కాదు . తిండి తిన్నట్టు నటించేవారు. ఒక నాడు వాసిరెడ్డి సీతాదేవి అమ్మగారికి దొరికిపోయారు. ఎందుకు అలా చేసావని ఆమె నానాచీవాట్లు పెట్టి భోజనంపెట్టారు.  తన జీవితములో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకుని  కథలు రాసి పత్రికలకు పంపేవారు. కథలు రాయాలనే తపనతో కాదు. పేరుప్రఖ్యాతులు సంపాదించాలన్న ఆలోచన అంతకన్నా లేదు.ఈ తపనంతా తన వ్రాసే కథ పత్రికల్లో అచ్చుయితే వచ్చిన డబ్బులతో ఒక పూట తిండి  గడుస్తుందని. ఒక నాడు సుబ్రహ్మణ్యంగారి కథ పత్రిక ఆఫీస్ నుంచి తిరిగి వచ్చింది. అప్పటికి సుబ్రహ్మణ్యం గారు ఇంట్లో లేరు. నారాయణరావుగారు సుబ్రహ్మణ్య వ్రాసిన కథను కవరులో నుంచి తీసేసి కథను ప్రచురణకు స్వీకరిస్తున్నట్లు  మరో లెటర్ నారాయణరావుగారే రాసిపెట్టారు సరదాకు.సుబ్రహ్మణ్యంగారు ఇంటికి వచ్చిన తర్వాత  ఆ కవరును  తీసుకొని చూశారు. అందులో తన కథను పత్రికలో ప్రచురిస్తున్నట్టు దానికి పారితోషికం కూడా ఇస్తున్నట్టు చూసి సంతోషపడ్డారు . పది రోజులు భోజనానికి సరిపడుతుందని సుబ్రహ్మణ్యంగారు నారాయణరావు గారితో అన్నారు. అందుకు నారాయణరావుగారు, సీతాదేవిగారు నవ్వుకొనిఅసలు విషయం చెప్పారు. సుబ్రహ్మణ్యంగారు తర్వాత కాలంలో అనేక పుస్తకాలు చదివి కథలు రాయడం మొదలుపెట్టారు. ఆయన రాసిన మొదటి కథ స్వతంత్ర పత్రికలో వచ్చింది. వాసిరెడ్డి సీతాదేవిగారు ' పాండి చ్చేరి అరవిందాశ్రమం ప్రెస్' లో తెలుగు కంపోజిటర్, ప్రూఫ్ రీడర్ కావాలట అని చెప్పడంతో అక్కడకు వెళ్లి సుబ్రహ్మణ్యంగారు పనిలో చేరారు. ఆ ప్రెస్ లో పనిచేస్తున్నప్పుడు " తుమ్మల్లో అస్తమయం", మరికొన్ని కథలు వ్రాసారు. ఆ సందర్భంలోనే అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పాత్రికేయులు చలపతిరావు, ఇంగ్లీష్ పత్రిక సంపాదకుడు ఖాసా సుబ్బారావులతో పరిచయం ఏర్పడింది. ఇంతలో తెనాలిలో ధనికొండ హనుమంతరావుగారు '' అభిసారిక " అనే పత్రికను స్థాపించారు. హనుమంతురావు గారితో తన పరిస్థితిని వివరించుకొన్నారు. ఆ వెంటనే తన పత్రిక ఆఫీసులో    ఉద్యోగంలో చేరమన్నారు. పత్రిక ఆఫీసులోనే బస. అప్పటికి సుబ్బారావుగారి ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగాలేవు. హనుమంతరావు గారు నెలకు 60రూపాయలు జీతంగా ఇచ్చేవారు. హనుమంతరావుగారు సుబ్రహ్మణ్యంగారికి కథల రాయమని ఏదైనా ఒక ఫ్లాట్ నిచ్చి  దాని కనుగు ణంగా కథలు వ్రాయమనే వారు. ఇతర పత్రికలకు కూడా కథలు రాసి పంపేవారు. వాటి వలన కొంత పారితోషికం వచ్చేది. ఆలా తన జీవితం గడిచింది. సుబ్రహ్మణ్యంగారు రాసిన కథలు, " తుమ్మల్లో అస్తమయం '' అనే శీర్షికన సంకలనం వచ్చింది. మరికొన్ని నవలలు కూడా అచ్చయ్యా యి. కొన్నాళ్ళకు కొన్ని కారణాల వలన అభిసారిక పత్రిక మూత పడవలసి వచ్చింది.1952లో చందమామలో దాసరి సుబ్రహ్మణ్యంగారు సర్క్యులేషన్ సెక్షన్లో చేరారు.1954 నుంచి 2006 వరకు వివిధ హోదాలలో పనిచేసి సంపాదకవర్గ సభ్యుడిగా పదవీ విరమణ చేశారు . దాసరి సుబ్రహ్మణ్యం గారు చందమామ మాసపత్రిక లో అద్భుత ధారావాహికల అపురూప సృష్టికర్తగా నిలిచిపోయారు. చందమామలో ఇతని తొలి సీరియల్ "తోకచుక్క" తో మొదలు కొని 1978లో ఇతనిచే వ్రాయబడిన " బళ్ళూక మాంత్రికుడు" వరకూ ధారావాహికంగా దాసరి వారివి  ప్రచురింపబడ్డాయి.1964 జూన్ నుండి 1966 ఏప్రిల్ వరకు, అలానే 1974 జూన్ నుండి 1975 డిసెంబర్ వరకు దాసరి సుబ్రహ్మణ్యంగారి సీరియల్స్ ను చక్రపాణిగారు ఆపించి బకించంద్ర గారి " దుర్గేశ నందిని" , "నవాబు నందిని" బెంగాలీ నవలలను కొడవటిగంటి కుటుంబరావుతో వ్రాయించి చక్రపాణిగారు చందమామలో ప్రచురించారు. దీంతో చందమామ సర్క్యులేషన్ పడిపోయింది.   ఆ కారణంగా దాసరి సుబ్రహ్మణ్యం గారి సీరియల్ ప్రారంభించ వలసి వచ్చింది.1960 లలో సంచిక చివరిపేజీలో దాసరి గారు రాసిన చిత్ర కథ ఒకటి ప్రచురితమయ్యేది. చందమామ తయారు చేసే బాధ్యత అంతా దాసరి పైనే పడింది.చక్రపాణి "యువ" అనే మాస పత్రికను కూడా కలిగి ఉండేవారు. చక్రపాణిగారు ఆ పత్రికకు కూడా దాసరి వారిచే రచనలు చేయించేవారు. కానీ యువ మాస పత్రిక రచనలు చేయడం దాసరి వారికి ఇష్టం ఉండేది కాదు. అయినా చక్రపాణిగారి  మాటను కొట్టలేకపోయేవారు. దాసరి సుబ్రహ్మణ్యంగారికి కొడవటిగంటి అంటే చాలా అభిమానం. చందమామ  కథల సొగసు కుటుంబరావుదని సుబ్రహ్మణ్యం  అనేేవారు.   బాలసాహిత్యానికి ఇరువురు ప్రాధాన్యతనిచ్చేవారు. దాసరి సుబ్రహ్మణ్యంగారు జీవితములో క్రమశిక్షణ, ఒక పద్ధతి 
ప్రకారం నడిచేవారు. తను ప్రారంభ దశలో రచయితగా ఉన్నపుడు సంపాదకులచే నిరాశా నిస్పృహలకు గురయ్యేవారు. కొంతమంది సంపాదకులు సుబ్రహ్మణ్యం గారు రాసిన రచనలను  ప్రచురిస్తున్నది లేనిది అతనికి తెలియపరిచేవారు కాదు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తరువాత కాలంలో సుబ్రహ్మణ్యం గారు ఇతర రచయితల  కథలు  అందిన వెంటనే రచయితకు లేఖ వ్రాసేవారు. అలాగే తరువాత కాలంలో ఆ కథపై తీసుకున్న నిర్ణయాన్ని కూడా రచయితకు తెలియపరిచేవారు. అలా రచయితలకు ఎంతో విలువనిచ్చేవారు. ప్రచురణకు స్వీకరించని కథలను రచయితలు స్టాంపులు అంటించిన కవర్లు జత చేయకపోయినా తన స్వంత కవర్లలో తిరిగి పంపించేవారు. కాంప్లిమెంటరీ కాపీ, పారితోషికం రచయితకు  పంపడం లాంటి విషయాలను  ప్రత్యేక శ్రద్ధతో చూసేవారు. దానికి కారణం రచయితగా దాసరి వారు ప్రాథమిక దశలో అనుభవించిన కష్టాలను మరచిపోలేదు. చందమామ కథలలో ఎక్కడా ఆంగ్ల పదాలను దొర్లనిచ్చే వారు కాదు. చిన్న చిన్న పదాలతో చిన్నచిన్న వాక్యనిర్మాణం చేసి తిరిగి  రచయితల కథలను వ్రాసి ప్రచురించేవారు. ఆ కారణంగా ఆబాలగోపాలం చదువుకోవడానికి వీలుగా ఉండేది. దాసరి సుబ్రహ్మణ్యం గారు వ్రాసినది ధారావాహి కలు మరే రచయిత  రాయలేదని ప్రముఖ సాహిత్యకారులు చెప్పుకుంటారు.1952 నుండి 2006 వరకు 54 సంవత్స రాల కాలం చందమామ సంపాదక వర్గంలో ఉండేవారు. కథల ఎంపిక పట్ల అంకిత భావం ఉండేది. తోటి ఉద్యోగు లతో స్నేహపూర్వకంగా ఉండేవారు. దాసరివారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా దేనికీఅతను తొనకలేదు బెణకలేదు. ఆ కష్టాలే తన  భవితకు మార్గదర్శకాలయ్యాయి. అనారోగ్య కారణంగా దాసరి సుబ్రహ్మణ్యంగారు 2010 జనవరి 27వ తేదీన స్వర్గస్తు లయ్యారు.  బాలసాహిత్య చరిత్రలో ఆయన పేరు  చిరస్మరణీయంగా  ఉంటుంది. ( సశేషం )