భాస్కర శతకము- - పద్యం (౩౬ - 36)

ఉత్పలమాల : 
*గిట్టుట కేడఁగట్టడ ల | భించిన నచ్చటఁగాని యొండుచోఁ*
*బుట్టదు చావు? జానువుల | పున్కల నూడిచి కాశిఁ జావఁగా*
*ల్గట్టన శూద్రకున్ భ్రమలఁ | గప్పుచు దద్విధి గుర్రమౌచు నా*
*పట్టునఁగొంచు మర్రికడఁ | బ్రాణము దీసెగదయ్య భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
కాశీ పట్టణం లో మరణము సంభవించిన ముక్తి కలుగును అనునది నానుడి.  అందువల్ల, పూర్వము శూద్రకుడు అను రాజు తనకు జీవన్ముక్తి కావాలి అని ఆశించి, కాశీలో మరణించాలి అని కోరుకుని, కాశీ పట్టణం చేరి, మోకాలి చిప్పలు తొలగించుకొని, కదలలేని పరిస్థితి కలపించుకుని కూర్చున్నాడు.  కానీ పరమాత్మ, ఆ శూద్రకునకు భ్రమ కలిగించి గుర్రము పైన కూర్చుండ పెట్టి, ఒక మర్రి చెట్టును గుద్దుకోవడంతో ఆరాజుకు మరణం ఇస్తాడు.  శూద్రకునికి మరణం మర్రిచెట్టు దగ్గర రాసి పెట్టివుంది. వేరొకచోట ఎలా సాధ్య పడుతుంది.  కనుక మనకు మరణం ఎక్కడ, ఎలా రాసి పెట్టి వుంటే అలానే సంభవిస్తుంది.  మనం మార్చుకోవాలి అనుకుంటే అది మారదు..... అని భాస్కర శతకకారుని వాక్కు.
*పుట్టుక మనకు తెలియదు. మరణం మనచేతిలో లేదు.  కాబట్టి, పుట్టుక మరణాల మధ్య వున్న అతి తక్కవ సమయంలో, ఎంత వీలైతే అంత సాధ్యం చేసుకుని పరమాత్మకు దగ్గరగా ఉపవాసం చేసే ప్రయత్నం చేయాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss