బాలసాహిత్యం - 37- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, --ఫోన్ : 701 3660 252.

నార్ల చిరంజీవి అసలైన సిసలైన బాల సాహితీవేత్త. ఇతను కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా కాటూరు గ్రామములో 1925 మే ఒకటో తేదీన సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. ఆయనకు చదువు అంటే ప్రాణం. కుటుంబ ఆర్థిక పరిస్థితు లు బాగోలేవు. ఆ ఇంట ఈ ఇంట పూట కూళ్ళు తింటూ గడిపేవారు. ఉన్నతస్థాయిలో విద్యాభ్యాసం చేయలేక పోయారు. అయినా తన స్వశక్తితో హిందీ ఆంగ్లము తెలుగు భాషను నేర్చుకున్నారు.నార్లచిరంజీవి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. ఆధునిక సాహిత్య ధోరణలను పరిశీలించా రు.1945 నుండి అంటే తన 20 సంవత్సరాల వయస్సు నుండి బాలల మనస్తత్వ పరిశీలన కొనసాగిస్తూ బాల సాహిత్య రచనలకు పూనుకున్నారు. నార్లవారు అనేకమైన బాలగేయాలు, గేయ కథలు, కథలు, నవలలు నాటికలు ఎన్నో రాశారు. ఇతను వ్రాసిన "తెలుగు పూలు" మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. తెలుగు పూలు గ్రంథములో అనేక పద్యాలు ఉన్నాయి. బాలలలో మానవత్వాన్ని, మంచితనాన్ని, దేశభక్తిని పెంపొందింపచేస్తాయి. 
" కలుగు మేలు నీకు తెలుగు బిడ్డ"; //  " తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ"//అంటూ చాలా పద్యాలు వ్రాశారు. ఈ పద్యాలు బాలల భవితకు ఎంతో మేలు చేకూరుస్తాయి. " తెలుగు పూలు" పుస్తకాన్ని తొలిసారిగా 1946లో అభ్యుదయసంఘం వారు ప్రచురించారు. నార్ల చిరంజీవి గారి మిత్రుడు ప్రయాగ రామకృష్ణ ' బీ . వీ నరసింహారావులు, కాటూరి వెంకటేశ్వరరావు గారలు మంచి ప్రోత్సాహాన్ని అందించిన కారణంగా “ తెలుగు పూలు ” మంచి ప్రాచుర్యం పొందింది. నార్ల చిరంజీవిగారు 1949లో విజయవాడకు తరలి వచ్చారు. అప్పటినుండి చిరంజీవి గారు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పని చేశారు. కొన్ని చలన చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు. ఆకాశవాణి కోసం అనేక రచనలు చేశారు. విజయవాడలో అలపర్తి వెంకట సుబ్బారావు, బి.వి నరసింహారావు, మద్దులూరు రామకృష్ణ , కవి రావు, వేజెండ్ల సాంబశివరావు మొదలగు రచయితలతో పరిచయాలు ఏర్పడ్డాయి.  వీరందరితో కలిసి నార్ల చిరంజీవి గారు బాలసాహిత్యం పై చర్చలు జరిపే వారు.1952 నవంబర్ 23న బి.వి.నరసింహారావు అధ్యక్షులుగా నార్ల చిరంజీవి మద్దులూరి రామకృష్ణ  కార్యదర్శులుగా  “ తెలుగు బాలల  రచయితల సంఘం” ఏర్పడింది. మొదటి నుండి తెలుగు బాల రచయితల సంఘం సాంప్రదాయ పద్ధతిలో గాక ఒకే రంగంలో మనసు లు కలిసిన మిత్రమండలిగా పనిచేశారు. ఈ బాలల రచయి తల సంఘానికి మూలధనం లేదు. సభ్యత్వ  రుసుము లేదు. ఖర్చులకోసం తగాదాలు లేవు. మీటింగ్ లు ఒక్కసారి 
ఒక్కొక్క ఒక్కొక్క ఊరులో  పెట్టేవారు.   స్థానికంగా ఉన్న రచయిత ఎవరైతే వారే మిగిలినవారికి ఖర్చులు పెట్టాలి. ఇదీ నిబంధన.  ఇలా సరదాగా ఐక్యతతో మెలిగేవారు.
1954 లో నార్ల చిరంజీవి విశాలాంధ్రలో ప్రారంభించిన   "చిన్నారి లోకం"  శీర్షిక ద్వారా బాలసాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. చిరంజీవి గారి ఆధ్వర్యంలో నడుపబడుతున్న  ఈ శీర్షికలో బాల సాహిత్య రచయితలకు ఎంతో ప్రోత్సాహం కల్పించారు.1955లో పిళ్ళా సుబ్బారావు శాస్త్రి (గీతా సుబ్బా రావు) గారు వ్రాసిన " పారిపోయిన బఠానీ" అనే రచనను ప్రచురించారు. “ చిన్నారి లోకం” ద్వారా నార్ల వారు బాల సాహిత్యానికి ఎనలేని  సేవ చేశారు. చిరంజీవి గారు రాసిన గేయాలు, ఆట పాటలు, కొత్త పాటలు, జాబిల్లి పాటలు, ఎర్ర గులాబీ అనేశీర్షికలతో పుస్తకాలుగా వచ్చాయి. మందారాలు రాజుగారి జాబు; పిల్లల నాటికలు నాటకాల సంకలనాలు,  మామ కథలు,  నీతి కథ నిధి ప్రచురితమయ్యాయి" పేను- పెసర చేను, కీలుబొమ్మ, మందార బాల, వీధి గాయకుడు మొదలైన బాలల నవలలు ప్రచురించారు. ఎర్ర గులాబీ అనే రచన పాట కథల సంకలనం. ఇందులో కరుణరసం ప్రధానం గా ఉంటుంది.  నార్ల చిరంజీవి రాసిన భాగ్యనగరం అనే నాటకం అసంఖ్యాక పాఠకుల, ప్రేక్షకుల మన్నన పొందింది.
నార్ల చిరంజీవి మద్దులూరి రామకృష్ణ, కలసి “ బాలల విజ్ఞాన సర్వస్వం” రూపకల్పన చేయాలని అనుకున్నారు. అయితే 1971అక్టోబర్16వ తేదీన చిరంజీవిగారు మరణించడంతో ఈ గ్రంథం కార్యరూపం దాల్చలేదు. నార్ల చిరంజీవి మరణం బాల సాహిత్య రంగానికి తీరని లోటు.  ( సశేషం )