మిన్ను - బాలల నవల నాలుగో భాగం--డా.ఎం.హరికిషన్-కర్నూలు-944103221

“అప్పుడు నా వయస్సు పదేళ్ళు. ఐదోతరగతి చదువుతా వున్నా. రోజూ పొద్దున్నే మా అమ్మతో బాటు లేచి ఇంటి ముందంతా నున్నగా కసువు కొట్టి, చక్కగా పెండనీళ్ళు చల్లి, ముచ్చటగా ముగ్గులు వేసేదాన్ని. అమ్మకు అన్ని పనుల్లో బాగా సాయం చేసేదాన్ని. ఒక రోజు ఇంకా తెల్లవారలేదు. ఐదు కూడా కాలేదు. తలుపు దగ్గర బరబరమని ఏదో గీకుతున్న చప్పుడు. అలికిడికి అదిరిపడి అమ్మతోబాటు నేనూ లేచి కూచున్నా. లైటేసి తలుపు వంక చూశాం. ఏదో భయం . అంతలో చిన్నగా వినబడీ వినబడనట్టుగా “మి... యా... వు..." అంటూ పిల్లిపిల్ల అరుపు. నేను నెమ్మదిగా గొళ్ళెం తీసి తలుపు వారగా కొంచం తీసి చూశా...


ఎదురుగా పచ్చని మిలమిలలాడే కళ్ళతో, ఒత్తయిన బూడిదరంగు జుట్టుతో... అక్కడక్కడ తెల్లని చారలతో... చలికి గజగజా వణికిపోతా వున్న చిన్న పిల్లిపిల్ల. నాకు చానా జాలేసింది. తలుపు ఇంకొంచం తెరిచా... అంతే... అది ఆ సందులోంచే గబుక్కున లోపలికి దూరి వచ్చేసింది. నా వంకే రెప్ప కొట్టకుండా చూడసాగింది. నెమ్మదిగా దాని మీద చెయ్యేశా. ఏమీ అనలేదు. పక్కకి పారిపోలేదు. నా అరచేయి దాని కడుపు కింద పెట్టి పైకెత్తుకున్నా. అది నా చేతిని నాకుతా నా కళ్ళలోకి చూసి నవ్వు ముఖం పెట్టింది. ఎందుకో ఆ నిమిషంలోనే అది నాకు తెగ నచ్చేసింది.
 “దాని అమ్మ ఏమన్నా బైటుందేమో... చూసి వదిలిరాపో అంది మా అమ్మ. నేను దాన్ని తీసుకొని వీధంతా ఆ మూల నుంచి ఈ మూలకు వెదకి చూసినా, ఎక్కడా ఏమీ కనబళ్ళేదు. ఆ చిన్నపిల్లను అలా ఒంటరిగా బైట వదలబుద్ది కాలేదు. దాంతో దాన్ని మరలా ఇంటికి తీసుకువచ్చినా.


నా చేతిలో పిల్లిపిల్లను చూసి మా అమ్మ “మరలా దీన్ని ఎందుకు తీసుకొచ్చావే" అంది. నేను అమ్మ వంక చూసి 'అమా... అమా... పాపం చిన్నపిల్ల. ఎంత ముద్దుగా వుందో చూడు. దీనమ్మ దీన్ని వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. మనం పెంచుకుందామా" అన్నాను. అంతలో మా నాన్న వేపపుల్లతో పళ్ళు తోముకుంటా అటువైపు వచ్చాడు. విషయం విని దాని వంక చూశాడు. చానా చిన్నపిల్ల గదా... అమాయకంగా, ముద్దుగా వుంది.


జాలేసి “సరేలే...  ఎలాగూ తిన్నాక చానా మిగిలిపోతోంది కదా... బైట కుక్కలకు, పందులకు పారేసే బదులు దీనికి పెడదాం" అన్నాడు. అలా అది మా ఇంటిలో భాగమైపోయింది.


ఎప్పుడూ అమ్మా నాన్నల చుట్టూ, నా చుట్టూ రాసుకోని పూసుకోని తిరుగుతా వుండేది. కూచుంటే చాలు వచ్చి ఒళ్ళో వాలిపోయేది. చీకటి పడితే చాలు మంచం మీదికెక్కి దుప్పటిలో దూరిపోయి వెచ్చగా తగులుతా పడుకొనేది. కొద్దిరోజుల్లోనే అది మాకందరికీ తెగ నచ్చేసింది. దానికి మిగిలిపోయిన కూరలూ, అన్నం పెట్టకుండా పొద్దున్నే పాలు, బన్ను పెడతా వుంటిమి. దాని కోసమే మా నాన్న అప్పుడప్పుడు అంగడికి పోయి మాంసం, ఎండుచేపలు, గుడ్డు తెచ్చేవాడు. నేనయితే పాలూ, చక్కెర వేసి అన్నం బాగా పిసికి తినిపించేదాన్ని.


కానీ ఒకసారి వేసవి సెలవుల్లో మేమంతా మా అమ్మ చిన్న చెల్లెలి పెళ్ళికి పోవలసిన పనిబడింది. పెళ్ళికి పిల్లిని తీసుకొని వెళ్ళలేం గదా.... దాంతో ఏం చేయాలో తోచలేదు. ఎవరయినా ఒకరు ఇంటివద్దనే వుండిపోదామా అని అమ్మా నాన్న అనుకున్నారుగానీ అది సొంత ఇంటిలో పెళ్ళి. పోకుంటే తరువాత అనవసరంగా మాట పడాల. రాకపోకలు గూడా దెబ్బతింటాయి. ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళను గూడా అడిగి చూశాము. నాలుగు రోజులుంచుకుంటారా మా పిల్లిని అని. మా వల్ల కాదంటే మా వల్ల కాదన్నారు. దాంతో ఏం చేయాలో తోచక ఒక పెద్ద గిన్నె నిండా నాలుగు రోజులకు సరిపడా అన్నం చేసి, దాన్నిండా పాలూ, చక్కెర కలిపి ఇంటి వెనుక వరండాలో పెట్టినాము. నాన్న ఎండుచేపలు, మాంసం ముక్కలు తెచ్చి వాటిని గూడా ఒక గిన్నెలో వేసి పెట్టాడు. వదల్లేక వదల్లేక దాన్ని వదలి వెళ్ళిపోయాం కళ్ళనీళ్ళతో.


పెళ్ళికి పోయాక వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ వాళ్ళు వెంటనే వెళ్ళనివ్వలేదు. దాంతో నాలుగు రోజులు అనుకున్నది పదిరోజులయింది. మా మనసంతా పిల్లి మీదే వుంది. ఇంటికి తిరిగి రాగానే గబగబా తలుపు తెరచి పరుగులాంటి నడకతో వరండాలోకి చేరుకున్నాం. గిన్నెలో అన్నం అలాగే పాసిపోయి వుంది. మాంసం ముక్కలు ఎక్కడివక్కడ ఎండిపోయి వున్నాయి. పిల్లి ఎక్కడా కనబడలేదు. చుట్టుపక్కల వాళ్ళని చానా మందిని అడిగి చూశాం. ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు.


ఎదురింటి ముసలాయన “మీరు వెళ్ళిన రోజు చానా సేపు అది మీ ఇంటి తలుపుల ముందు అటూయిటూ తిరుగుతా తలుపు మీద గీకుతా కనబడింది. కానీ అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్దకుక్క ఎగిరి దాని మీద దుంకింది. దాని నుంచి తప్పించుకోవడానికి అది ఎటువైపు పారిపోయిందో తెలీదు. మరలా దాని అరుపు ఎప్పుడూ వినలా, ముఖమూ చూడలా" అని చెప్పాడు.


అది తిరిగి ఇంటికి చేరుతుందేమో అని మేం చానా రోజులు ఎదురుచూశాం. చుట్టుపక్కల వీధులన్నీ వెదికాం. కానీ అది ఎక్కడా దొరకలేదు. తిరిగి రాలేదు. ఇప్పటికీ ఆ పిల్లిని మతికి చేసుకుంటే చాలు. మనసంతా బాధతో మెలిపెడతాది. పిలవని అతిథిలా వచ్చింది. అలాగే వెళ్ళిపోయింది. మీకు తెలుసా... దాన్ని మేము అప్పుడు 'బంగారూ' అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళం" అంది. ఆ మాట అంటా వుంటే మౌళిని కళ్ళలోంచి సర్రున నీళ్ళు కారాయి. పిల్లలకు కనబడకుండా ఛటుక్కున తల అటువైపుకు తిప్పుకొని చెంగుతో కళ్ళు వత్తుకుంది.
చిన్ని, మిన్ను మౌనంగా అమ్మ ఒళ్ళోకి చేరుకున్నారు. అమ్మ చేతిని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నారు.