మిన్ను - బాలల నవల ఆరో భాగం--డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

ఊరికి చివర ఒక పెద్ద మేడ వుంది. అది చానా పాతది. ఒకప్పుడు అందులో ఒక పెద్ద పాలెగాడు వుండేవాడు. వాళ్ళ వంశంలో ఎవరూ ఇప్పుడు ఆ ఊరిలో ఎవరూ లేరు. పిల్లల చదువుల కోసమని పక్కనే వున్న కందనవోలు నగరానికి వెళ్ళిపోయారు. ఊరిలో వున్న భూములన్నీ అమ్మేసుకున్నారు. మిగిలింది ఆ భవనమే. దాన్ని అమ్ముదామన్నా అంత పెద్దది కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో చానా కాలం నుంచి అది అలాగే వుండిపోయింది.


ఆ వూరిలో గంగన్న అని ఒక పెద్ద గూండా వుండేవాడు. పక్కనే వున్న నల్లమల అడవిలో ఎక్కడైనా టేకుచెట్టుగానీ, ఎర్రచందనం చెట్టుగానీ కనబడితే చాలు... పోలీసులకు తెలియకుండా కూలీలతో నరికించి నగరంలో అమ్మేసేవాడు. అలా బాగా దొంగడబ్బు సంపాదించాడు. పోలీసులు వానిని పట్టుకోవాలని అప్పుడప్పుడు దాడులు చేసినా ఎప్పుడూ చిక్కలేదు. ఆ గంగన్న కన్ను జమీందారు మేడపై పడింది. ఊరికి దూరంగా అడవిని ఆనుకొని వుంటాది కాబట్టి తనకు బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. దాంతో జమీందారు వెంటపడి తక్కువ ధరకు కొనేశాడు. దాన్ని మరమ్మత్తులు చేసి తన గోదాముగా తయారు చేసుకున్నాడు. ఊరివాళ్ళకు గంగన్నంటే చానా భయం. అతని గురించి ఎవరన్నా పోలీసులకు చెబితే వారి మీద రౌడీలతో దాడులు చేయించేవాడు. చంపడానికి కూడా వెనుకాడేవాడు కాదు. దాంతో ఎవరూ నోరిప్పేవారు కాదు. గంగన్న వుంటున్న భవనం వైపు కన్నెత్తి గూడా చూసేవాళ్ళు కాదు.


ఒకరోజు రాము, మిన్ను పావురాలను తీసుకొని పోతా వున్నారు. అవి కొత్తవి, కొని రెండు నెలలే అయింది. వాటికి ఇల్లు అలవాటు చేయడం కోసం రోజూ కొంచం దూరం తీసుకుపోయి వదులుతా వున్నారు. ఎప్పటిలాగే వాళ్ళు ఆరోజు గూడా చానా దూరం తీసుకుపోయి వదిలారు. అదే సమయంలో జమీందారు మిద్దె మీద, ఆకాశంలో పెద్ద పావురాల గుంపు గిరికీలు కొడతా వుంది. వాళ్ళు వాటిని గమనించుకోలేదు. ఈ కొత్త పావురాలు పోయి వాటితో జత కలిశాయి. గిరికీలు కొడతా కొడతా బాగా అలసిపోయి మిగతా వాటితోపాటు పోయి, ఆ జమీందారు మిద్దెమీద వాలాయి. అవి అక్కడే వాటితోబాటే తిరగసాగాయి. వాటికి ఆ కొత్తచోటు అయోమయంగా వుంది. కానీ ఎలా వెళ్ళాలో తెలీక బెదురుబెదురుగా దిక్కులు చూడసాగాయి. రాముకు, మిన్నుకు ఏం చేయాలో తోచలేదు. అవి చానా దూరంలో వున్నాయి. చేతులూపుతా, గాల్లోకి ఎగురుతా వాటిని పిలవసాగారు. కానీ అవి గమనించలేదు.
 “రామూ ఎలా వాటిని తిరిగి మన ఇంటి వద్దకు రప్పించడం" అడిగాడు మిన్ను. 


రాము బాగా ఆలోచించి “వాటికి బాగా తెలిసిన మన పావురాలను తీసుకువచ్చి దగ్గరగా వదిలితే, మన కొత్త పావురాలు వాటిని గమనించి, వాటి వెంబడే ఎగురుతా వచ్చి ఇంటికి చేరుకుంటాయి" అన్నాడు.


“అయితే... ఇంకేం... పద మన పావురాలు తీసుకువద్దాం" అన్నాడు మిన్ను సంబరంగా. 


 రాము ఆ మిద్దె వంక చూపుతా "అది మా ఊరిలో పెద్ద రౌడీ గంగన్న వుండే భవనం. వాకిలి దగ్గర చానా మంది అనుచరులు కాపలా వుంటారు. ఎవరినీ వదలరు. చీమ చిటుక్కుమన్నా పట్టేసుకుంటారు. దొరికామే అనుకో మన పని అయిపోయినట్టే" అన్నాడు. మిన్ను మౌనంగా వుండిపోయాడు.


రాము మనసంతా ఆ తెల్లని కొత్త పావురాల పైనే వుంది. ఎంతో ముచ్చటపడి పైసాపైసా దాచుకొని, కొనుక్కుని వచ్చాడు. వాటిని తలచుకోగానే రాము కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అది చూసి మిన్ను “రామూ... ఎందుకలా బాధపడతావు. మనం వెనుక నుంచి గోడ దుంకి లోపలికి పోదాం. నీ వెంబడి నేను గూడా వుంటా గదా... భయమెందుకు” అన్నాడు.


“కానీ వాళ్ళు చూసి పట్టుకుంటే" అన్నాడు రాము. మిన్ను చిరునవ్వు నవ్వి “మనకు భయం తప్పకుండా వుండాలి. అప్పుడే బాగా ఆలోచించి తప్పు జరగకుండా 
చూసుకోగలం. కానీ ఆ భయం అసలు పనే మొదలు పెట్టకుండా ఆపేంతగా వుండగూడదు. మనం మన వెంట ఒక గాలిపటం తీసుకుపోదాం. పొరపాటున ఎవరన్నా చూసినా దారం తెగి గాలిపటం లోపల పడితే తీసుకుపోవడానికి గోడ దూకి వచ్చామంటే... చిన్నపిల్లలం గదా తిట్టో, అంతగా అయితే ఒకటి కొట్టో వదలి పెడతారుగానీ ఏమీ చేయరు. దా పోదాం" అన్నాడు.


రాము తన దగ్గర ఎప్పటినుంచో వున్న మంచి పావురాలు రెండు తీసుకున్నాడు. మిన్ను ఒక గాలిపటం కొనుక్కొని వచ్చాడు. ఇద్దరూ కలసి నెమ్మదిగా చప్పుడు చేయకుండా జమీందారు భవనం వెనుకవైపుకి చేరుకున్నారు. లోపలికి ఎవరూ అడుగు పెట్టకుండా గోడ చానా ఎత్తుగా వుంది. ఎలా పోవాలబ్బా అని చుట్టూ గమనించారు. దూరంగా ఒక చెట్టు కనబడింది. దాని కొమ్మ ఒకటి గోడపై నుంచి లోపలి వరకూ వుంది. చప్పుడు చేయకుండా ఆ చెట్టు ఎక్కి నెమ్మదిగా లోపలికి దుంకారు.


లోపల ఎవరూ లేరు. దూరంగా వాకిలి వద్ద ఐదారుగురు ఏవో మాటల్లో వున్నారు. మేడ వెనుక నుండి నెమ్మదిగా మిద్దెపైకి చేరుకున్నారు. దూరంగా పావురాళ్ళు కనబడతా వున్నాయి. వాటి గూళ్ళు మిద్దె ముందు వైపు వున్నాయి. కింద రౌడీలున్నారు. వాళ్ళకి కనబడకుండా అడుగులో అడుగు వేసుకుంటా, వంగి వంగి దాక్కుంటా ముందుగది మీదకు వచ్చారు. దగ్గరలోనే పావురాలు కనబడతా వున్నాయి. పిలుద్దామా అంటే కింద వున్న వాళ్ళకి వినబడుతుంది. తన వద్ద వున్న పావురాలను వాటికేసి చూపుతా మౌనంగా పిలవసాగాడు. ఆ కొత్త పావురాలు వాటికేసి, రాము, మిన్నులకేసి తిప్పి తిప్పి చూడసాగాయి. మిన్ను చిన్న రాయి తీసుకొని వాటికి తగిలేలా విసిరాడు. ఆ దెబ్బకు సుర్రుమని ఒకటి గాల్లోకి ఎగిరింది. దాని వెంటే మరొకటి. వెంటనే రాము తన చేతుల్లో వున్న పావురాలను వాటివైపు విసిరాడు. అవి వేగంగా వాటి పక్కకు దూసుకెళ్ళి కువకువలాడుతూ ఒక్కసారిగా పైకి ఎగిరాయి. ఆ పరిచితమైన పిలుపులు విన్న కొత్త పావురాలు వాటితోబాటే కలసి సంబరంగా దూసుకుపోయాయి. నాలుగు పావురాలు ఆకాశంలో గిర్రున గిరికీలు కొట్టసాగాయి. “హమ్మయ్య ఇక భయం లేదు. అవి ఇంటికి చేరినట్టే. ఇంకో నెల రోజులు వాటిని దూరం తీసుకుపోకుండా ఇంటిని ఇంకా బాగా అలవాటు చేయాలి” అన్నాడు రాము చిరునవ్వుతో. ఇద్దరూ సంతోషంగా మిద్దెపై నుంచి దిగడానికి మేడ వెనుకవైపుకి బైలుదేరారు. అలా పోతా వుంటే ఒకచోట పక్షుల అరుపులు దూరం నుంచి సన్నగా, దీనంగా, బాధగా వినిపించాయి. ఇద్దరూ ఆగిపోయారు.


“రామూ... ఏవో పక్షుల అరుపులు కింద నుంచి వినబడతా వున్నాయి. గమనించావా" అన్నాడు మిన్ను చప్పుడు వచ్చిన వైపు చెవులను రిక్కించి.


“అవునవునూ... నేనూ విన్నాను. ఇంతకు ముందు మనం ఇలా పోయేటప్పుడు గూడా వినబడ్డాయి. కానీ మన చూపంతా పావురాల మీదే వుంది కాబట్టి పట్టించుకోలేదు. ఇక్కడెక్కడో చానా పక్షులు వున్నట్టున్నాయి" అన్నాడు రాము.


ఇద్దరూ నెమ్మదిగా ఆ అరుపులు వినబడతా వున్నవైపు అడుగులు వేయసాగారు. ఆ గది... దగ్గర పడతా వున్న కొద్దీ పక్షుల అరుపులు ఎక్కువ అవుతా వున్నాయి. ఆ గదికి పైన ఒక గవాక్షం వుంది. ఇద్దరూ అక్కడకు చేరుకొని ఆతృతగా లోపలికి తొంగి చూశారు.


లోపల మనుషులెవ్వరూ లేరు. కానీ అనేక పంజరాలు. చిన్నవి పెద్దవి. అందులో అడవిలో దొరికే అరుదైన రంగురంగుల పక్షులు... చిన్న చిన్న జంతువులు... అలాగే ఒక బోనులో ఒక పెద్ద ఎలుగుబంటి ఉన్నాయి.


“రామూ... లోపలికి దిగి చూసొద్దామా" అన్నాడు మిన్ను. “అమ్మో ... నాకు భయం. ఎవరన్నా వచ్చారనుకో.. అంతే " అన్నాడు రాము.


మిన్ను రాము భుజంపై చేయి వేసి “వూరికే భయపడకు. గంగన్న అనుచరులంతా వాకిలి దగ్గరే మాటల్లో మునిగిపోయి వున్నారు. ఏం భయం లేదు! పాపం... అలా చూడు. ఎన్ని పక్షులో... వీలయితే వాటిని కాపాడుదాం. లేదంటే లేదు.
కానీ అసలు లోపల ఏం జరుగుతుందో చూసొద్దాం" అన్నాడు. చివరికి రాము “సరే” అన్నాడు.