సోమరి పెండ్లాం - జానపద హాస్య కథ* - డా.ఎం.హరికిషన్ - 9441032212 - కర్నూలు

ఒకూరిలో ఒకామె వుండేది. ఆమె పెద్ద సోమరిపోతుది. అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టడానికి కూడా తనకలాడేది. ఎప్పుడూ వూరకనే కూచోని అందరితో సొల్లు కబుర్లు చెప్తా వుండేది. ఎంత చిన్నపని చెప్పినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొనేదేగానీ కొంచం గూడా చేసేది కాదు.
      ఒకసారి ఆమె మొగుడు కోడి తీసుకోని వచ్చినాడు. పెండ్లాం మంచమ్మీద పండుకోని వుంది. ఆమెతో “ఏమే... కోడి తీసుకోని వచ్చినా... కోసి కూర చెయ్యే” అన్నాడు. ఆమెకు మంచం దిగి రాబుద్ధి కాక “అబ్బ... నిన్న ఇంటి ముందంతా గడ్డి పీకిపీకి నా నడుమంతా ఒకటే నొప్పి పెడతావుంది. నువ్వే కోసి ముక్కలు చేసి పెట్టు. చేసి పెడ్తా” అనింది. మొగుడు సరేనని దాన్ని కోసి ముక్కలు చేసి “ఏమే... నువ్వు చెప్పినట్టే కోడిని కోసి, చిన్నచిన్న ముక్కలు చేసినా... కూర చెయ్యే” అన్నాడు.
     అప్పుడామె “అబ్బా... నిన్న నీళ్ళు వూరి బైటి బావి కాన్నించి తెచ్చీ తెచ్చి నా కాళ్ళు ఒకటే నొప్పి పెడా వున్నాయి. కొంచం మసాల నూరి, ఉల్లిపాయలు కోసివ్వవా... చేసి పెడ్తా” అనింది. వాడు సరేనని అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర యేసి బాగా మసాల నూరి, ఉల్లిపాయలు కోసి “ఏమే... నువ్వు చెప్పినట్టే మసాల నూరి ఉల్లిపాయలు కోసి పెట్టినా... కూర చెయ్యే” అన్నాడు.
     అప్పుడామె “అబ్బ... అదేందో గానీ నా చేతుల నొప్పి ఇంకా కొంచంగూడా తగ్గలేదు. కొంచం పొయ్యిమీద కుండ పెట్టి కూర ఎక్కియ్యవా” అనింది. ఆ మాటలో వానికి పెండ్లాం మీద చానా కోపమొచ్చింది. పనెగొట్టడానికే ఈ ఎత్తులన్నీ వేస్తుంది అనుకోని ఏమీ మాట్లాడకుండా కూర పొయ్యిమీదికి ఎక్కించినాడు. బాగా వుడికినాక “ఏమే... రుచెట్లా వుందో చూసి వుడికినాక దించి పెట్టు” అన్నాడు.
       ఆమెకు అదింతపని చేయడానికి కూడా బద్దకమేసి “అబ్బ.. నిన్న ఆకులో సున్నమెక్కువయి నోరంతా పొంగి ఒకటే మంట. నువ్వే రుచి చూసి కుండ దించు” అనింది. వాడు మారు మాట్లాడకుండా కుండ దించి వేడివేడి అన్నంలోకి వేడివేడి కూరేసుకోని ఒక్కడే తినసాగినాడు. అది చూసి ఆమె "అయ్యో... కూరంతా ఒక్కనివే తింటున్నావే... నాకు పెట్టకుండా” అనింది. దానికి వాడు "ఏం చేయమంటావ్... నీ నోరంతా ఒకటే మంటంటివి గదా... ఈ కారం తిండి తింటావో తినలేవో అని నేనే మొత్తం కష్టపడి తింటావున్నా... అయినా ఒకమాట.... కారం కొంచం ఎక్కువయినప్పటికీ రుచిమాత్రం భలేగుందే. అసలు నా జన్మలో ఎప్పుడూ ఇంత రుచి చూడలేదు. నీ నోరు బాగుంటే ఎంత బాగుండునో” అని లొట్టలేసుకుంటా ఒకే ఒక ముక్క మిగిల్చి మిగిలిందంతా తినేసినాడు. వాని మాటలకు ఆమె నోట్లో నీళ్ళూరినాయి. కానీ ఏమనలేక లోపల్లోపల నాలుక చప్పరించుకుంటా అట్లాగే వుండిపోయింది. రాత్రయింది. మొగుడు పండుకున్నాక ఆమెకు కూర ఎట్లావుందో రుచి చూడాలనిపించింది. చప్పుడు కాకుండా వంటింట్లోకిపోయి మూత తెరిచి చూసింది. లోపల ఒకేఒక ముక్క కనబడింది. తీసి నోట్లో వేసుకోని చప్పరించింది. కమ్మగా ఒళ్ళంతా జివ్వుమనింది. ఇంకా ఇంకా కావాలనిపించింది. లోపలికి చూసింది. కుండ అడుగున అంటుకోని కొంచం చారు కనిపించింది. ఏలితో గీకితే సరిగా రాలేదు. దాంతో అటూ ఇటూ చూసి తల కుండలోపలికి పెట్టి నాలికతో చప్పరించసాగింది. కుండంతా నున్నగా నాకినాక తల తీయబోయింది. కానీ అది బైటకు వస్తేనా... లోపల్నే ఇరుక్కోని పోయింది. దాన్ని రెండు చేతుల్తో పట్టుకోని ఎంత పీకినా కొంచంగూడా రాలేదు. దాంతో ఆమె లబలబలబ మొత్తుకోసాగింది.
ఆ అరుపులకు, కేకలకు చుట్టుపక్కలున్న జనాలంతా లేసినారు. ఏం కొంప మునిగిందో ఏమో అనుకోని వురుక్కుంటా వచ్చినారు. వచ్చి చూస్తే ఇంకేముంది. ఆమె తల కుండలో ఇరుక్కోని ఎగుల్లాడతా కనబడింది. వచ్చిన జనాలంతా అది చూసి కిందామీదా పడి నవ్వుకుంటా ఆమెనోపక్క , కుండనోపక్క పట్టుకోని లాగినారు. కానీ... అది కొంచం గూడా బైటకు రాలేదు. అప్పుడామె మొగుడు "అది అట్లా రాదులెండి” అంటూ ఒక లావు కట్టె తీసుకోనొచ్చి ఎత్తి కుండమీద ఒక్కటేసినాడు. ఆ దెబ్బకు కుండ రెండు ముక్కలు కావడమే కాకుండా తలమీద గూడా పెద్ద బొడిపె వచ్చేటట్టు మాంచి దెబ్బపడింది. దాంతో ఆమె “అమ్మా... అబ్బా...” అంటూ మొత్తుకోసాగింది.
      చుట్టూ చేరిన జనాలు ఆమె తల కుండలో ఎట్లా ఇరుక్కోని పోయిందో తెలుసుకోని, "ఈ సోమరిపోతు దానికి ఇట్లా కావాల్సిందే” అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోయినారు. దాంతో ఆమె బుద్ధి తెచ్చుకోనింది. అప్పటినుంచీ మొగుడు పిల్లలు కలిసి మెలసి అన్ని పనులూ చేసుకోసాగినారు.