మిన్ను - బాలల నవల ఐదో భాగం--డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 చానా రోజుల వరకు చిన్ని, మిన్ను గుడ్డు పొదగలేక పోయిన ఆ చిన్న పిట్టల గురించే తలచుకుంటా బాధపడ్డారు. కానీ అంతలో పరీక్షలు దగ్గర పడ్డాయి. దాంతో చదువుల్లో మునిగిపోయారు.


సవి సెలవులు వచ్చేశాయి. ఎప్పటిలాగే ఆ ఎండాకాలం కూడా ఇంటిల్లిపాదీ కలసి మిన్నూ వాళ్ళ తాత వాళ్ళుండే వూరికి చేరుకున్నారు. అది కందనవోలు నుంచి యాభై మైళ్ళదూరంలో వుంటాది. ఊరు రోడ్డు మీంచి చానా లోపలికి వుంటాది. గుర్రపు బండి ఎక్కి పోతా వుంటే దారికి ఇరువైపులా పచ్చని పళ్ళమొక్కలు, పూలమొక్కలు దానా కనబడతా వుంటాయి. ఆ వూరి పేరు పాణియం. రంగురంగుల పూలమొక్కలు పెంచి అమ్మడంలో మంచి పేరు సంపాదించింది. చిన్నీ మిన్నులు మొట్టమొదటిసారి నల్లరంగు గులాబీని చూసింది ఇక్కడే. దేశవిదేశాల్లో పూచే అనేక రంగురంగుల అరుదైన పూలరకాలు కూడా ఇక్కడ అమ్ముతారు. ఆ తోటలని చూసుకుంటా వూరి దగ్గరికి వచ్చారు. ముందు పెద్ద చెరువు వుంది. ఆ వూరికి అదే ఆధారం. ఎండాకాలం గూడా అందులో ఎంతో కొంత నీరు వుంటుంది. ఆ చెరువు దాటగానే వూరు మొదలవుతుంది. పూరి నడిబొడ్డున వున్న రామాలయం దాటి, ఎటూ తిరగకుండా చక్కగా పోతే చాలు తాతయ్య ఇల్లు చేరుకోవచ్చు.


తాతయ్య వీళ్ళు వచ్చేది ముందే తెలుసుకొని మంచి మామిడిపళ్ళు బనగానపల్లె తోటల నుంచి తెప్పించి మాగేసినాడు. ఇక సపోటా పళ్ళకయితే లెక్కేలేదు. అక్కడ చీనీ పళ్ళ తోటలు గూడా చానా మంది పెంచుతా వుంటారు. అక్కడ వున్నన్ని రోజులూ విందులు, వినోదాలే... అమ్మమ్మ, తాతయ్యలు చానా బాగా చూసుకునేవాళ్ళు.


మిన్ను మిద్దె మీదికి ఎక్కి చల్లగాలికి అటూయిటూ తిరుగుతా వుంటే ఆకాశంలో పెద్ద పావురాల గుంపు కనిపించింది. అవి రయ్యిమని గిరికీలు కొడతా చానా సేపు ఆకాశంలో తిరిగి నెమ్మదిగా దూరంగా వున్న ఒక ఇంటి మిద్దె మీద ఒకొక్కటి వాలసాగాయి. మిన్ను కిందకి దిగి నెమ్మదిగా ఆ పావురాలు వాలిన ఇంటివైపు అడుగులు వేశాడు.


అక్కడక్కడ రకరకాల రంగురంగుల పావురాలు నీలిరంగు కళ్ళతో కువకువలాడుతా తిరుగుతా వున్నాయి. కొన్ని బూడిదరంగులో, మరికొన్ని తెలుపురంగులో, ఇంకొన్ని నలుపు రంగులో మెరిసిపోతా వున్నాయి. చిన్నవి, పెద్దవి, అడవి, మగవి చానా వున్నాయి. ఒక పిల్లవాడు చేతిలో గింజలు తీసుకొని వాటివైపు చల్లుతా వున్నాడు. పావురాలు ఎగిరివచ్చి ఆ పిల్లవాని ముందు వాలి ఆ గింజలను తింటా వున్నాయి. ఆ పిల్లవాన్ని చూసి అవి కొంచం గూడా భయపడడం లేదు. బాగా మచ్చిక అయినట్టున్నాయి. ఆ పిల్లవాడు వాటిని పట్టుకొని నిమురుతా వుంటే ఆ పావురాలు ఆనందంగా కళ్ళు మూసుకొని చేతుల్లో మరింతగా ఒదిగిపోతున్నాయి. మిన్ను దూరం నుంచే నిలబడి ఆ పిల్లవాన్ని, పావురాలను చూడసాగాడు.


కాసేపటికి ఆ పిల్లవాడు మిన్ను వంక చూసి దగ్గరకు రమ్మని సైగ చేసి “ఎవరు నీవు... చానాసేపటి నుంచి ఇక్కడే నిలబడి వున్నావు. వూరికి కొత్త వానిలా వున్నావే" అనడిగాడు.


మిన్ను చిరునవ్వుతో “పాతవాడినే. పుట్టింది గూడా ఈ పూరిలోనే. ఇది మా అమ్మమ్మ తాతయ్యల వూరు. కాకపోతే పుట్టింది ఇక్కడైనా పెరిగిందంతా కందనవోలే. సెలవులు గదా అందుకే వచ్చాం. నా పేరు సుహాస్. ముద్దుగా అందరూ 'మిన్నూ' అంటారు. మరి నీ పేరు" అన్నాడు అరచేయి ముందుకు చాచి.


“నా పేరు రాము. ఏడవ తరగతి చదువుతా వున్నా" అన్నాడు ఆ పిల్లవాడు మిన్ను చేయి అందుకుంటా.


అలా ఒకటి రెండు రోజుల్లోనే వాళ్ళు బాగా కలసిపోయారు. రామును కదిలించితే చాలు పావురాల గురించి అనేక సంగతులు ఆపకుండా చెబుతుండేవాడు.


“మిన్నూ... పావురాలు పరిసరాలను బాగా మతికి పెట్టుకుంటాయి తెలుసా... ఆకాశంలో మిగతా పావురాలతో కలసి గుంపులు గుంపులుగా గిరికీలు కొడతా వుంటే చూడ్డానికి భలే మజాగా వుంటుంది. అన్ని పావురాలు కలసి తిరిగీ తిరిగి అలసిపోయి ఒకొక్కటిగా మరలా కిందకు చేరుకుంటాయి. అందరి ఇళ్ళకప్పులు దాదాపు ఒకేలా వున్నా, అవి కొంచం గూడా పొరబడవు. చక్కగా వచ్చి ఎవరింటిపై అవి వాలిపోతాయి.


అందుకే రాజుల కాలంలో తమ దగ్గర బాగా మచ్చికయిన పావురాలని చుట్టూ వున్న ఇరుగుపొరుగు రాజులకు ఇచ్చి అలాగే వాళ్ళ దగ్గర మచ్చికయిన పావురాలని తాము తెచ్చుకునేవాళ్ళు. ఏదయినా అవసరం పడినపుడు చిన్న చీటీలో విషయం రాసి దానిని పావురం కాలికి కట్టి ఎగురవేసేవాళ్ళు. పావురం తన సొంత యజమాని ఇల్లు వుండే దిశను బాగా మతికి పెట్టుకుంటుంది. దాంతో ఎక్కడా ఆగకుండా ఎగురుతా వచ్చి యజమానిని చేరుకునేది. అక్కడి వారు దాని కాలికి కట్టి పంపిన చీటీ వల్ల విషయం తెలుసుకుంటారు. అలాగే సైనికులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు గూడా తమతో బాటు పావురాలను వెంట తీసుకెళ్ళేవారు. గూఢచారులు గూడా ఎప్పటికప్పుడు విషయాలను పావురాల చేత రాజుకు పంపుతా వుండేవారు. మనకు మొట్టమొదట ఉత్తరాలు అందించి ఎంతో సహాయపడ్డవి ఈ పావురాలే తెలుసా" అంటా అనేక విషయాలు తెలియజేసేవాడు. రాము నోరు విప్పితే చాలు... పావురాల గురించి తప్ప వేరే సంగతులు ఏవీ వచ్చేవి కాదు. దానికి తోడు మిన్ను గూడా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకునేవాడు. దాంతో రాము చెబుతూ వుంటే బాగా వినేవాడు.


“రామూ.... పావురాలు ఎంత దుమ్ములోనైనా, ధూళిలోనైనా హాయిగా ఆకాశంలో వేగంగా ఎగురుతుంటాయి గదా... మరి ఆ దుమ్ము, ఇసుక వాటి కళ్ళలో పడదా" అంటూ అడిగాడు మిన్ను.


రాము నవ్వుతా “వాటి కళ్ళపై రెప్పలుగాక మరో పలుచని పొర వుంటాది. దుమ్ము, ధూళీ వున్నప్పుడు కళ్ళలో పడకుండా ఆ పొర కాపాడుతుంటాది" అంటూ "నీకు తెలుసా పావురాలు తమ పిల్లలకు ఆహారాన్ని అందించేటప్పుడు ముందుగా గింజలను తమ గొంతులో చానా సేపు నానబెడతాయి. అవి బాగా మెత్తగయ్యాక పాలలాగా చేసి పిల్లల నోటిలో వాటిని వదులుతాయి” అని చెప్పాడు.


ఒకసారి రాము ఆకాశంలో రెండు పావురాలు ఎగురుతా వుంటే వెంటనే గబగబా గూటిలోంచి నాలుగు పావురాలు తీసుకువచ్చి గాలిలోకి వదిలాడు. మిన్ను అది చూసి "ఎందుకలా వదిలావు. ఇప్పుడే గదా అవి ఎగిరి ఎగిరీ అలసిపోయి గూటికి చేరింది” అన్నాడు.


రాము ఆకాశంలోని పావురాలనే గమనించుకుంటా “మిన్నూ... అప్పుడప్పుడు అడవుల్లో, మసీదుల్లో, దిగుడుబావుల్లో పెరుగుతున్న ఎవరికీ చెందని పావురాలు ఆకాశంలో తిరుగుతా వుంటాయి. మనం మన దగ్గర బాగా మచ్చికయిన పావురాలను తీసుకొని వచ్చి ఆకాశంలోకి వదలగానే అవి వాటితో బాటు తిరుగుతా తిరుగుతా బాగా కలసిపోతాయి. అలసిపోయేదాక గిరికీలు కొట్టీకొట్టి మరలా నెమ్మదిగా మనవి మన ఇంటి మీద వాలతాయి. అప్పుడప్పుడు వాటితోబాటు వేరే పావురాలు గూడా వాలుతాయి. మనం ఇక్కడ ముందే గింజలు చల్లి దూరంగా వాటికి కనబడకుండా దాచిపెట్టుకొని వుందాం. కొత్త పావురాలు గింజలు తినడంలో మునిగిపోతాయి. అప్పుడు మనం అదును చూసుకొని చప్పుడు కాకుండా ఒకొక్క అడుగే వేసుకుంటా వెనుక నుంచి వచ్చి లటుక్కున వాటిని పట్టేసుకుందాం. అదిగో గూటిలో లావుగా, తెల్లగా మెడ మీద నల్లమచ్చలతో వుంది చూడు, ఆ పావురం అలా పట్టుకున్నదే” అంటూ నవ్వాడు.


“మరి నువ్వు రోజూ గూడు తెరచి వాటిని బైటకు వదులుతా వుంటావు గదా. అప్పుడు అవి మరలా వెళ్ళిపోతే" అన్నాడు మిన్ను అనుమానంగా.


రాము నవ్వుతా "మనం కొత్తవి కొన్నప్పుడు గానీ, ఇలా పట్టుకొన్నప్పుడు గానీ వాటికి గాలిలో ఎగరడానికి ఉపయోగపడే ఈకలను నెమ్మదిగా తీసేసి ఇంటి వద్ద వదులుతాం. దాంతో అవి పైకి ఎగరలేవు. ఇక్కడే మిగతా పావురాలతో కలసి తిరుగుతా, గెంతుతా, గూళ్ళోనే వుంటా వుంటాయి. అలా వాటికి రెక్కలు తిరిగి వచ్చేసరికి అవి బాగా ఈ ఇంటికి అలవాటయిపోతాయి. దాంతో ఇంకెక్కడికీ పోవు" అని చెప్పాడు.
అలా రాము, మిన్నుకు పావురాల గురించి అనేక విషయాలు వివరించేవాడు.