ఉల్లి నేర్పిన పాఠం (పిల్లల కథ) రచన ;బి. వి. పట్నాయక్. 9441349275.

కూరగాయల దుకాణం రద్దీగా ఉంది.అందులో ఓక దుకాణం దగ్గర అన్ని బుట్టల్లోను కూరగాయలతో పాటు ఉల్లి కూడా ఉంది.
        అందరూ అన్ని కూరగాయలు కొంటున్నారు. గాని ఉల్లిపాయల దగ్గరకు వచ్చేసరికి ఇంకా ధర తగ్గలేదా? అంటూ ఆరా తీస్తుండేవారు.
                         మరి కొందరైతే ఉల్లి ఇప్పుడు బంగారమైపోయింది అంటే ఇంకొందరు ఎప్పుడూ ఉల్లి కోస్తే కన్నీరు వచ్చేది ఇప్పుడు కొంటే కన్నీరు వస్తుంది బాధను వ్యక్తం చేసేవారు.
                 కూరగాయలన్నీ ఉల్లి వైపు చూసేవి. ఉల్లి ఓకింత గర్వంగా కూరగాయలవైపు చూసేది.
         ' చూశారా!  నా వైభోగం . ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ  నీవెంత ఉడికినా నీ  కంపుపోదు అన్న వాళ్ళంతా ఇప్పుడు నా కోసం ఎలాంటి పడిగాపులు కాస్తున్నారో 'కూరగాయలతో అంటూ మిడిసి పడింది ఉల్లిపాయ.
         ' ఉల్లిపాయా! ఇందులో నీ గొప్పతనమేమి లేదు. వర్షాలు విపరీతంగా కురవడం వలన నీ పంట దిగుబడి తగ్గింది. పెరుగుట విరుగుట కొరకే అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ పరిస్థితి నిన్ను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది' హెచ్చరించినట్టు చెప్పాయి కూరగాయలు.
      '  మీ కుళ్ళుబోతుతనం ఇప్పుడు బయటపడింది. నా ఉన్నతిని మీరు కూడా తట్టుకోలేకపోతున్నారు' నిందారోపణ చేసింది ఉల్లిపాయ.
         '  నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నిన్ను  మెుదటలో ఆట పట్టించిన మానవులు కూడా తప్పును సరిదిద్దు కొని ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని నెత్తిన పెట్టుకున్నది నిజం గాదా!యదార్థం చెబుతున్నాం.నీ మీద ఎటువంటి అసూయ ద్వేషాలు లేవు' సర్ధి చెప్పాయి కూరగాయలు.
          ' మీ కపటప్రేమ నాకు తెలుసు. నేను లేకపోతే మీ కూరగాయలకు రుచి పుట్టదు. నన్ను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు ' కూరగాయలను ఎద్దేవా చేసింది ఉల్లిపాయ.
            కూరగాయలు ఉల్లిపాయ మాటలకు చిన్నబుచ్చుకొని మౌనంగా ఉండిపోయాయి. ఇంతలో ఆ దుకాణానికి దూర ప్రాంతం నుండి వచ్చిన ఉల్లిపాయల వ్యాపారి 'రానున్న రెండు మూడు నెలల వరకు ఉల్లి కరువు ఉంటుంది. నాలుగు డబ్బులు సంపాదించాలంటే జాగ్రత్తగా అమ్ముకో' సలహాగా చెప్పాడు
          దుకాణం యజమానికి ఆశ కలిగింది. ఉల్లి బుట్టను తీసి ఎవ్వరికి కనిపించకుండా ఓ మూల దాచి పెట్టాడు. మిగిలిన ఉల్లి మూటలను ఎవ్వరికి కనిపించకుండా భద్ర పరిచాడు. ధర బాగా పెరిగాక అమ్మాలని నిర్ణయించుకొన్నాడు.ఈవిషయాన్నిచుట్టు పక్కల వ్యాపారులకు కూడా చెప్పి కృత్రిమ కొరత సృష్టించాడు.
         కొనడానికి వచ్చిన వారు ఉల్లి గురించి అడిగితే చాలా 'ధర పెరిగిపోయింది. మీకు కావలిస్తే మా ఇంటికి దాచుకొన్న ఉల్లి ఇస్తాను ధర విషయంలో రాజీలేదు' మురిపించేటట్టు చెప్పేవాడు.
         యజమాని మాటలు ఉల్లిపాయల చెవికి ఇంపుగా వినిపించేవి. సంతోషంతో ఉబ్బితబ్బిబైపోతుండేవి.
       ఎప్పడూ కిలోలు కొద్ది ఉల్లి కొనేవారు ఇప్పుడు తక్కువ పరిమాణంలో కొనడం ప్రారంభించారు.
             ఉల్లి ధర విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు కూడా కూరలలో ఉల్లి వేయకుండా దాని స్థానంలో కేబేజి ఆకు తురుము వాడడం ప్రారంభించారు.
          కొంత మేర సర్ధుబాటు ధోరణి అవలంభించిన ప్రజల వలన ఉల్లి కోనే వారి సంఖ్య తగ్గిపోయింది.ఇప్పుడు వ్యాపారస్తుడు ఆందోళన చెంది నిల్వ ఉంచిన ఉల్లిని బయటకు తీయడం ప్రారంభించాడు. అప్పటికే నిల్వ ఉంచిన ఉల్లి సగానికి పైగా కుళ్ళి పోయింది. తన దురాశకు తగిన శాస్తి జరిగిందని యజమాని బాధ పడ్డాడు.
           సగం కుళ్ళిన తన శరీరాన్ని చూసుకున్న ఉల్లి పెరుగుట విరుగుట కొరకే అని కూరగాయలు అన్న మాట నిజమైందని గుర్తించి ఉసూరు మంది.
       ఇంటి దగ్గరకు వచ్చి తను నష్టపోయే తీరు భార్యతో చెప్పి ఏడుపు అందుకున్నాడు దుకాణం యజమాని.
             చదువుకున్న దుకాణం యజమాని భార్య బాగా ఆలోచించి నిజాన్ని చెప్పడం ప్రారంభించింది.
        'సర్ధుబాటు ధోరణి మానవ మనుగడకు మూలం.  ఉల్లి లేకపోతే ప్రపంచమే తల క్రిందులైపోతుందన్న ఆలోచన నుండి మానవుడు బయట పడాలి.  ఒక వస్తువు కొరత కనిపించినప్పుడు దాని ప్రత్యమ్నాయ వస్తువుకోసం అన్వేషించాలి.రేపటి తరం కోసం సర్ధుబాటు ధోరణి కూడా అవలంభించాలి.  ఇప్పుడు ఉల్లి సంగతే మనం తెలుసుకున్నాం.రేపు వరికి కూడా ఈ ప్రమాదం రాబోతుంది. వర్షపాతం రోజు రోజుకి తగ్గి పోతున్న సమయంలో వరి పంట పండించడం కష్టమైన విషయాన్ని చూస్తున్నాం. ఇప్పటికైన కళ్ళు తెరచి ప్రజలు తక్కువ వర్షపాతంలో పండే చిరు ధాన్యాలను ఆహారంలో  వినియోగించడం అలవాటు చేసుకుంటే వరి వినియోగం పై  ఒత్తిడి తగ్గు తుంది . ధర కూడా నిలకడగా ఉంటుంది. లేకపోతే కోరి కష్టాలకు స్వాగతం పలికిన వాళ్ళమౌతాం.మనం కూడా అందుకు సిద్ధంగా ఉండాలి. ఉల్లి మంచి పాఠమే నేర్పింది 'అంటూ ఓదార్చి వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పింది భార్య.