ముప్పొద్దులా
పూజలు పునస్కారాలు
చేస్తూ...
పరోపకారానికి తిలోదకాలు
ఇచ్చే మహానుభావులెందరో
రూపాలెన్ని ఉన్నా
దైవం ఒక్కడే అన్న నిజం
ఒప్పుకోలేక..
కులమతాల పిచ్చిలో
మునిగి తేలుతూ... కొందరు
పున్నామ నరకం నుండి
తప్పిస్తారని నమ్మే
తల్లిదండ్రులను బ్రతికి
ఉండగానే నరకం చూపెడుతూ
దైవ కార్యాలు చేసే ప్రబుద్ధులు
ఎందరో...
శిలా రూపానికి
అలంకారాలు.. క్షరాభిషేకాలు...
ఉత్సవాలు చేసేకన్నా.....
ఒక్క పూట అయినా
ఆకలి తో
అలమటించే నిరుపేదల
కడుపు నింపుట మేలు.....
మనసు మందిరాన
మానవత్వమే
దైవంగా నిలుపుకుని
మానవ సేవే మాధవ
సేవగా భావించి
తల్లిదండ్రుల ఆదరించిన
మానవులే మహనీయులు