జస్ట్ లైక్ దట్:--- యామిజాల జగదీశ్

1
జననమరణాలు 
మనల్ని వెతుక్కుంటూ వస్తాయి
మిగిలిన వాటిని
మనం వెతుక్కుంటూ పోతాం
2
 అబద్ధమని తెలిసినా
సహనాన్ని పాటించేవారు
అమూల్యులే....!!

కోపంతో ఉన్నప్పుడు
చేతిలో ఉన్నదాన్ని 
విసిరేయడం తెలుసు కానీ
కోపాన్ని విసిరేయడం 
తెలీదు
4
ఆశలకు
మరో ఆశే ఉండదు
అవి నెరవేరే వరకూ

ఇది మారాలి
లేదా మార్చుకోవాలని 
అనుకునే కన్నా
ఉన్నది ఉన్నట్లు 
స్వీకరించే ప్రత్యేకత ఉంటే
జీవితాన్ని ఆస్వాదించొచ్చు
6
ఆదుకుంటున్న ఆకులను నరికి
ఆక్సిజన్ కోసం అన్వేషించడం అర్థరహితం!
7
అగ్గిపుల్ల వెలుగునిచ్చి
దీపం కాంతికి అందరూ దండం పెట్టారు
అగ్గిపుల్లేమో చెత్తకుండిలో
పడుంది
8
అదా ఇదా స్పష్టత లేకుంటే 
మానసిక కలత మనల్ని 
హరించేస్తుంది
9
వయస్సెంతైనా కావచ్చు
ఏదైనా సమస్యంటూ వచ్చినప్పుడు
ముందుగా గుర్తుకొచ్చేది అమ్మే...
ఎందుకంటే అమ్మ ప్రేమ అన్నింటికీ అతీతం
10
కంటికి కనిపించే దోమలనే 
సమూలంగా నిర్మూలించలేని మనిషి 
కంటికి కానరాని
వైరస్సులనేం చేయగలడు?