చమత్కార బాణం..!'--సుజాత.పి.వి.ఎల్.

మహాకవుల పలకరింపులూ భలే ఇంపుగా ఉంటాయి. అప్పట్లో మద్రాసులో ఓ కవిసమ్మేళనం జరుగుతోంది. 
విశ్వనాథ, జాషువా, దువ్వూరి రామిరెడ్డి, దేవులపల్లి లాంటి మహామహులందరూ హాజరయ్యారు. 
వీరిలో రామిరెడ్డి, జాషువా ఇద్దరూ మంచి మిత్రులు. పక్కపక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన విశ్వనాథ.. ‘‘పక్షులు రెండూ ఒక్కచోటకు చేరాయే’’ అన్నారట. రామిరెడ్డి, జాషువాలిద్దరికీ ‘కవికోకిల’ అన్న బిరుదు ఉంది కదా!.. దాన్ని దృష్టిలో పెట్టుకుని చమత్కార బాణం వదిలారు ‘కవిసమ్రాట్‌’.
దానికి బదులివ్వాలి కదా మరి! వెంటనే జాషువా తిరుగుబాణం సంధించారట.. ‘‘కిరాతుడి కన్ను ఇంకా పక్షుల మీదనే ఉన్నదే’’! విశ్వనాథ హాయిగా నవ్వేసుంటారని వేరే చెప్పాలా!! 
ఇంతకూ ఆయన కిరాతుడు ఎలా అయ్యారో అర్థమైందా? క్రౌంచ పక్షుల శోకానికి కారణమైన తన బాణాలను విడిచిపెట్టి ఘంటాన్ని చేతబట్టిన కిరాతుడు వాల్మీకి అయ్యాడు. ‘రామాయణ కల్పవృక్షం’ రచనతో విశ్వనాథ ‘అపర వాల్మీకి’ అనిపించుకున్నారు. 
కాబట్టి జాషువా చమత్కారం పండినట్టే కదా!