శరన్నవరాత్రులు - రాజగోపాల్ కుప్పిలి

శరదృతువు తొలి రోజైన శరన్నవరాత్రుల ప్రారంభవేళ తొమ్మిది రోజులూ ఒక నియమంగా అమ్మవారిని ఆరాధించాలి. ఈ తొమ్మిది రోజులు చేసే శ్రీ లలితా స్తోత్ర పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి.
      ఆడంబరాలు, డాంబికాలు, భేషజాలు, స్వార్ధ ఫలాలు లేని ఆధ్యాత్మిక సాధననే అమ్మవారు ఆనందంగా స్వీకరించి, అనంత రూపాలతో మనలను రక్షిస్తుంది. అదే శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల ఉజ్వల ఫలం, జీవితానికి పరమైశ్వర్యం.
        గోరంత భక్తి పొంగేవారింట కొండంత కటాక్షం కురిపించే కనక దుర్గమ్మ మనల్ని కాపాడుగాక!
కంచి కామాక్షి మన కోర్కెలు తీర్చుగాక!
మధుర మీనాక్షి మహా శక్తుల నిచ్చుగాక!
కాశీ విశాలాక్షి వాత్సల్యం పొంగు లెత్తుగాక!
శ్రీశైల భ్రమరాంబ మన బాధలను తీర్చుగాక!
శృంగేరి శారదాంబ శాంతి సౌఖ్యాల నిచ్చుగాక!
ఉజ్జయిని మహంకాళి వరాలిచ్చుగాక!
భక్తి నిండిన మన హృదయాలు భద్రకాళిని స్మరించుగాక!
కలకత్తా కాళీమాత కలకాలం కరుణించుగాక! 


మొదటిరోజు అలంకారం - 
బాలాత్రిపుర సుందరీదేవి (17-10-2020)
      శరన్నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున ఇంద్ర కీలాగ్నిపై కనకదుర్గాదేవి బాలాత్రిపుర
సుందరీదేవిగా దర్శనమిస్తుంది. హేమకీర్తి, రత్నావళి అనే దంపతులకు దుర్గాదేవి బాలా త్రిపుర సుందరీ రూపంలో  దర్శనమిచ్చి, వారికి సంతానం అనుగ్రహించినట్లుగా బ్రహ్మాండ పురాణాన్ని బట్టి తెలుస్తుంది.
       బాలా త్రిపుర అమ్మవారు షోడశీ విద్యకు అధిదేవత. మనస్సు, బుద్ధి, అహంకారం ఈమె అధీనంలో ఉంటాయి. బాలా మంత్రం సకల దేవీ ఉపాసన మంత్రాల్లో అత్యంత ఫలప్రదమైనది. ఆధ్యాత్మిక సాధనకు ఇది తొలి బీజం. బాలాదేవి అనుగ్రహం లభిస్తేనే ఆది పరాశక్తి అనుగ్రహానికి మార్గం ఏర్పడుతుంది. ఇంతటి శక్తి స్వరూపిణి అయిన బాలా త్రిపుర సుందరీదేవిని ఎర్రని వస్త్రాలు, అదే రంగులో జపమాల  ధరించి, "ఓం ఐం హ్రీం శ్రీం బాలాత్రిపుర సుందర్యై నమోనమః" అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అమ్మవారికి పాయసం నివేదన చేయాలి.  
శ్లో ll   హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం                                                   కళాంబిభ్రతీం
          సౌవర్ణాంబర ధారిణీం వరసుధా దౌతాం 
                                         త్రినేత్రోజ్జ్వలాం
          వందే పుస్తక పాశమంకుశధరాం
                             స్రగ్భూషితాముజ్జ్వలాం
           త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం
                                     శ్రీచక్ర సంచారిణీం ll