తెల్ల కాగితాలు
మైనపు ముద్దలు చిన్నారులు
బుగ్గ మీద మెరిసిన చుక్కల్లో చమక్కులు ముద్దొచ్చే బాల్యం అమూల్యం!
కుప్ప తొట్టెల ఎంగిలి
మెతుకులపై వాలిన ఆకలి
ఛీత్కారం తృణీకారం
ప్లాట్ ఫారం ఆవాసం
కోరికలు తీర్చుకున్న
పాప ఫలాల ప్రతిరూపం!
అమ్మా నాన్నల మాటల కత్తుల రణ రంగంలో బలియైన శైశవం
క్షణి కావేశంలో తీసుకున్న
ప్రాణాల సంతు బతుకు
సాంతం ముళ్ల పుంత
మొక్కకు నీటి ఆసర
చిట్టి చేతులకు ప్రేమ ఆసరా
ఒక పరిశ్వంగo చాలు
కాలం వదిలేసిన ఒంటరితనాన్ని జయించి విజయ కేతనం ఎగురవేయడా నికి
బాయిలర్ కోళ్లకు వెలుగు తెలియదు
విలాసాలు విందులు విలువలు నేర్పవు మట్టి స్పర్శ తో మనిషి పునీతం
గడ్డి పరక సైతం మట్టి తో నే సతత హరితం
అందమైన బాల్యం ఓ అద్దం
చిన్నరాయి విసిరినా
ముక్కలయే ముఖ బింబం