లోట్టాయి ( బాలల కథ )డా.. కందేపి రాణీప్రసాద్.

ఒక ఊర్లో ఒకడుండేవాడు.వాడి కాలు కొంచెం అవుడు గా ఉంటుంది.వాడిని అందరూ లోట్టాయ్ అని పిలిచే వాళ్లు.వాడి అసలు పేరేమిటో  ఎవరికీ తెలీదు.వాడిని లోట్టాయి అని పిలవడం వాడికి అస్సలు ఇష్టం ఉండేది కాదు.అలా పిలిచిన వాళ్ళందరితోనూ కోట్లడేవాడు.అయినా వాళ్లు అలాగే పిలిచేవారు.
               కొన్నాళ్లకు లోట్టాయికి పెళ్లయింది.ఇంటికి భార్య వచ్చింది.చక్కగా కాపురం చేసుకుంటున్నారు.ఒక రోజు లోట్టాయి బయటకు వెళుతుండగా భార్య ఏవండీ అని పిలిచింది.అతనికి వినబడలేదు.నాలుగైదు సార్లు పిలిచింది అయినా అతను పలకలేదు.భార్యకు కోపం వచ్చి 'లోట్టాయ్ ' అని గట్టిగా కేకేసింది.అప్పుడు వెనక్కు తిరిగాడు వాడు.భార్య లోట్టాయ్ అని పిలిచేసరికి వాడికి చాలా కోపమొచ్చింది." ఏంటీ నువ్వు కూడా నన్నట్లా పిలుస్తవా? అని అగ్రహా దగ్రుడై భార్యను చంపేశాడు.
            చనిపోయిన భార్య శవాన్ని వాడి ఇంటి పెరట్లో ఉన్న మట్టిని గొయ్యి తీసి   పాతి పెట్టాడు.కొన్నాళ్ళకు వర్షాలు వచ్చి అక్కడ తోట కూర మొక్కలు మొలిచాయి.మొక్కలు బలంగా ఏపుగా పెరిగాయి.ఒకరోజు లోట్టాయి ఆ తోటకూరను కోసుకోని కూర వండటం మొదలు పెట్టాడు.కూర పొయ్యి మీద ఉడుకుతోంది.దాంట్లో నుంచి "తుక్ తుక్ లోట్టాయి,తుక్ తుక్ లోట్టాయి " అని శబ్దాలు వినిపించాయి,లోట్టాయికి కోపం వచ్చింది.నువ్వింకా చావలేదా అంటూ ఆ కూర మొత్తం తీసుకెళ్లి ఆవూకు వేశాడు.
            ఆవు కూర తిన్నది.అప్పుడు 'అంబా లోట్టాయి! అంబా లోట్టాయి ' అంటూ ఉన్నది ఆవు.ఇది విన్నాక లోట్టాయి ఉగ్రుడై పోయాడు. ఆ ఆవును చంపేసి చర్మం వలిచి చెప్పులు కుట్టించుకున్నాడు. ఆ చెప్పులు తోడుక్కోని బజారుకు వెళ్లాడు.అప్పుడు చెప్పులు కిర్రు కిర్రు లోట్టాయి,కిర్రు కిర్రు లోట్టాయి " అని అన్నాయి.లోట్టాయికి అగ్రహం వచ్చింది.ఆ చెప్పులు విసిరేశాడు.కుక్క ఎత్తుకు పోయింది.కుక్క చెప్పుల్ని కోరుక్కు తింటున్నది.అది తింటూ తింటూ భౌ  భౌ లోట్టాయి,భౌ భౌ లోట్టాయి అని అరుస్తున్నది.
             లోట్టాయికి తీవ్రమైన కోపం వచ్చింది.వెళ్ళి ఆ కుక్కను కోట్టి బావిలో పడేశాడు.ఆ కుక్క బావిలో మునుగుతూ బుడుగు లోట్టాయి!బుడుగు బుడుగు లోట్టాయి! అన్నది.ఇక లోట్టాయి కోపాన్ని ఆపుకోలేక పోయాడు," నువ్వింకా చావలేదా! నేనోచ్చీ నీ పని పడతా ఉండు " అని లోట్టాయి కూడా బావిలో దూకాడు. లోట్టాయి కూడా చచ్చిపోయాడు.