అదే కష్టం--- యామిజాల జగదీశ్

అనగనగా ఒకడు ఇంటి దగ్గరుంటే తాననుకున్న దీక్ష చేపట్టడం కష్టం మనుకుని ఓ అడవికి వెళ్ళాడు. 


అది పేరుకి అడవేగానీ అక్కడేమీ జంతువులేమీ లేవు. చెట్లు అనేకం. రెండు గ్రామాల మధ్య ఉన్న పెద్ద అడవి. రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు ఎక్కువ. కనుక ఇటూ అటూ రాకపోకలు ఎప్పుడూ ఈ అడవి గుండానే సాగేవి.


రెండు గ్రామాలకు ఆ అడవి ఒక వారధిలాంటిది అని అనుకోవచ్చు. అటువంటి అడవిలో ఓ పెద్ద మర్రి చెట్టుకింద కూర్చుని దీక్ష  చేపట్టాడు ఆ మనిషి. 


ఓరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఓ అమ్మాయి ఈ మార్గంలో పోతుండటం చూసి అతని మనసు చలించించింది. మనసులౌ తిట్టుకుని కళ్ళకు గంతలు కట్టేసుకున్నాడు. ఇంకేముంది....ఎవరెళ్ళినా తనకెవరూ కనిపించరనుకున్నాడు. మళ్ళీ దీక్ష కొనసాగించాడు. 


రెండో రోజు సరిగ్గా ఎనిమిది గంటలకల్లా మళ్ళీ అదే అమ్మాయి అటువైపు వచ్చింది. 
అయితే ఈసారి ఆమె మువ్వల చప్పుడు అతని చెవులకు వినిపించడంతో మళ్ళీ దీక్షకు భంగం కలిగింది. ఇకలాభం లేదనుకుని చెవులకు గుడ్డ కట్టేశాడు. ఇక ఏ చప్పుడూ తనకు వినిపించదనుకున్నాడు. దీక్ష కొనసాగిఃచాడు. 


మూడో రోజు ఉదయం ఎనిమిది గంటలైంది. కానీ ఈరోజు ఆమె జడలో పెట్టుకున్న పూల వాసన అతని ముక్కు పసి కట్టడంతో మళ్ళీ దీక్షకు భంగం కలిగింది. వెంటనే ముక్కుకి గుడ్డ కట్టేసుకుని దీక్షలోకెళ్ళాడు. 


ఇప్పుడు ఇంకెవరూ తన దీక్షను చెడగొట్టలేరనుకున్నాడు. 


నాలుగో రోజు ఉదయం ఎనిమిది గంటలైందో లేదో మనసు తడబడింది. అమ్మాయి వచ్చే టైమైంది కదా అనుకుంది. ఇంకేముంది, అనుకున్న క్షణాన అతని దీక్షకు భంగమేర్పడింది. 


అమ్మాయి కనిపిస్తోందని కళ్ళకు గంతలు కట్టాడు. మవ్వలు చప్పుడు నహవినిపించకూడదని చెవులకు ఘగుడ్డ కట్టాడు.  అమ్మాయి జడలో పెట్టుకున్న పూల పరిమళాన్ని ఆఘ్రాణించకూడదని ముక్కుకి గుడ్డ చుట్టాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనసుని దేంతో కట్టాలి? అందుకే అంటారు అనుభవజ్ఞులు మనసుని నియంత్రించడం చాలా కష్టమని. మనసుని గుప్పెట్లో పెట్టుకుంటేనే ఏదైనా చెయ్యగలం. లేకుంటే అంతేసంగతులు.