ఔ మల్ల--- బాలవర్ధిరాజు మల్లారం

తంగేడి పూలుంటేనే
బతుకమ్మన్నట్టు!
ఆడివిల్లలుంటేనే బతుకమ్మ పండుగున్నట్టు!!
మా అక్క దేవక్క
రుద్రంగిల ఉంటది
గీ బతుకమ్మ పండుక్కు
మా అక్కను తీసుకచ్చుటానికి
మా నాయిన బతుకమ్మ పండుక్కు
ఒక్క దినం ముందుగాలనే
రుద్రంగికి పోయేటోడు.
రుద్రంగి కి చుట్టుముట్టు గుట్టలు,జెంగలి ఉంటది
మా బావ అంబటి గంగారాం మా నాయినను తోలుకొని గా జెంగల్ల కోయి తంగేడి పూలు
తెంపు కచ్చేటోల్లు
మా మల్లారం ల తంగేడి శెట్లు ఎక్కువ ఉందేటివి కాదుల్లా!
రుద్రంగిల పువ్వు తెంపుకొని
మా అక్కను మా ఇద్దరల్లుల్లను తోలుకొని
మల్లారం అంబటాల్లకు అచ్చేటోడు.
అప్పటికే మా అవ్వ అలుకు వూత జేసెటిది
ఇగ నేనేమో బామండ్ల గడ్డకువోయి
గునుక పువ్వును తెచ్చే టోన్ని
తాంబోలమును మంచిగ సింత పండుతోని కడిగి
దాంట్లనే తంగేటి పువ్వుతో
మా అవ్వ బతుకమ్మను పేర్సేది
కొద్దిగ బతుకమ్మను పేర్సినంక
గునుక పువ్వును సిన్న సిన్న కట్టలు గట్టి
జాజి రంగు, ఆసుమాన్ రంగుల్లో ముంచి ఆరినంక
ఆటిని గుడ ఒక కట్ట మీద ఒకటీ పేర్సేది
నడుమల తంగేడాకును పోసేది
పసుపును తడిపి ముద్ద జేసి దాన్ని
గౌరమ్మ అని బతుకమ్మ పేర్సుడు
ఆయినంక బతుకమ్మ మీద పెట్టేది.
మాపటి జాములకు మా ఇంటి పక్కన
బజార్ల అలుకు జల్లి ముగ్గేసి దాంట్ల
బతుకమ్మ లను పెట్టే టోల్లు
ఆడివిల్లలు గా బతుకమ్మల సుట్టు తిరుక్కుంట
బతుకమ్మ పాటలు పాడే టోల్లు
మల్లారం నుండి ఏరే ఊరికిచ్చిన ఆడివిల్లలను
అన్నగాడో, తమ్ముడో, నాయిననో పోయి
తప్పకుంట తోలుకచ్చు కునేటోల్లు
గట్లనే మా అక్కను గుడ 
పండుక్కు తోలుకచ్చు కునేటోల్లం.
తంగేడి పూలుంటెనే బతుకమ్మ పండుగన్నట్టు
ఆడివిల్లల్లుంటేనే బతుకమ్మ పండుగున్నట్టు
ఔ మల్ల!