సర్సిల్క్ సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి

అప్పట్లో అంటే 85 ప్రాంతంలో మా స్వగ్రామం ఎలగందుల మానేరు ముంపుకు గురై కళకళ లాడే ఊరు కొద్ది రోజల్లోనే కళావిహీనమై అచిరకాలంలోనే ఊరంతా పాడుబడిన దిబ్బగా మారిపోయినప్పుడు నేను తిరిగిన పాత ప్రదేశాలను చూద్దామని మా ఊళ్లో తిరిగాను.అప్పటికి ఊరు బయట, మరియు ఊరికి పడమట ముంపు ప్రభావం లేని గ్రామం కొంత మిగిలి ఉంది.మా ఇల్లు కూడా ఊరిబయట కట్టిన ఇల్లు గనుక అమ్మా బాపూ తమ్ముళ్లు చెల్లెలు అక్కడ ఉండేవారు.
     ఊరంతా తిరిగి ఇంటికి వస్తుంటే వెతలోనుండి బయటకు వచ్చిన ఓ గేయం 
రాచరికపు వైభవమున
వెలుగొందిన వెలగందుల
బీడుపడిన గుండెలతో
బిక్కు బిక్కుమంటున్నది


చెట్లుచేమలు పెరిగిపోయెను
ఊరు అడవిగమారిపోయెను
చెల్లచెదురుగ కుప్పతెప్పల
చిల్ల పెంకుల దారులాయెను


ఆలయమ్మున దేవుడేడీ 
అయ్యయో కనిపించడాయె
జంతువులు తమఇచ్చవచ్చిన
యటుల గుడిలో తిరుగ సాగె


అలుకుపూతల ఇండ్లుబోయెను
అరుగు గద్దెలు మాయమయ్యెను
మట్టిగోడలు కూలిపోయెను
ఊరు పేరుకు మిగిలిపోయెను  


తీర్చిదిద్దిన రంగవల్లుల 
ముంగిళులు మటుమాయ మాయెను
మామిడాకుల తోరణమ్ముల
గుమ్మములు కనుపించవాయెను


జీవకళ లేనట్టి గ్రామము
గాంచి ఉల్లము తల్లడిల్లెను
మానవునికే కాదు మరణము
ఊళ్లకైనను తథ్యమాయెను
అని రాసుకున్నాను.
రామాయణంలో పిడకలవేట లాగా ఈ సంగతి ఎందుకు చెబుతున్నానని మీకు
సందేహం కలుగవచ్చు. ఎందుకంటే అదే పరిస్థితి కొన్నేండ్ల తరువాత సర్సిల్కు కాలనీలో చూడవలసి వచ్చింది కనుక.
కళకళలాడిన సర్సిల్కు కారణాంతరాల వల్ల మూతబడటంతో తెరుస్తారని ఎదురు చూపుల్తో కొన్ని రోజులు,తెరిచే ప్రసక్తి లేదని అర్థమైనా అర్థాంతరంగా ఏం చెయ్యాలో తోచక కొన్ని నాళ్లు,ఆ తరువాత ఎవరికి తెలిసిన మార్గంలో 
వాళ్లు వెళ్లటం సర్సిల్కు కాలనీ దిక్కులేని అనాథగా పదిపదిహేను సంవత్సరాలు
చీకటిలో మగ్గింది.ఇప్పుడిప్పుడు అన్యుల చేరికతో కొంత మార్పు కనిపించినా నాటి కళ లేదు.సర్సిల్కు మిల్లు ఉన్న ప్రాంతం ఇప్చటికీ జీవచ్ఛవంగానే ఉంది.వెతికితే దొరకలేదు కాని వెతలతో రాసిన ఓ వచన కవిత ఉండాలి ‘శిథిల యంత్రాలయం’ పేరుతో.
     ఒక ఉచ్ఛదశను చూసిన ఈ కళ్లే దాని దీన దశను కూడా చూడవలసిరావటం
మా ఊరి విషయంలో ,మిల్లు విషయం నాకు ఒకేలాగ అనిపించింది. సరే సర్సిల్క్ మూతబడిన విషయం దానికి కారణాలు కూడా గ్రంథస్థం చేస్తే బాగుంటుందనిపించింది .కనుక నాకు తెలిసిన కొన్ని రాజకీయ పరిస్థితులు ఈ సందర్భంగా తెలియజేస్తాను