పెత్ర_అమాస-- సరోజ పోచమల్లు

ఇగ గి అమాసకు అందరూ పెద్దలకు బియ్యం ఇత్తరు..
పున్నం బోయినంక మొదలు వెట్టి ఎంగిలి పూల అమాస దాకా ఇత్తరు.
మన కాడ గొంత మంది కాలం సేసిన అయ్యా, అవ్వలకు తిథి తోని ఆడాది కో పారి గా తిథి నాడే అయ్యా, అవ్వకు  బియ్యం ఇత్తరు.ఇగ గిట్ల ఈలు కానోళ్లు  పెద్దల్ల కలుపుతరు.ఇగ పెద్దల్ల కలుపుడు అంటే సచ్చి నోళ్లు అందరూ గి అమాసకు ఇత్తార్లు ఏసుకొని తుర్తిగా తినటానికి అచ్చి కూసుంటరట.
ఇగ తిథి తోని ఇయ్యనోళ్లు అందరు గూడ ఇయ్యల బియ్యం ఇత్తె ఆళ్ల ఆత్మ కు నిమ్మలంగుంటది అని.


ఊల్లెకు జంగమయ్యా,లేకుంటే అయ్యగారు అచ్చి తీసుకుంటరు..కొందరు అడ్డ బొట్టు,కొందరు తిరుమందార్లు(పొడుగు) బొట్టు వొళ్ళు.ఇగ జంగమయ్యా అయితే అడ్డ బొట్టు ఓళ్లకు,అయ్యగారు అయితే పొడుగు బొట్టు ఓళ్లకు. ఇగ పొద్దుగాలనే అయ్యగారు ఓ పారి ఊరంతా తిరుగుతడు.


ఊరుకంత ఒక్కడే అయ్యగారు,ఒక్కడే జంగమయ్యా ఇగ ఎనకా,ముందు అయిన గీల్లు అచ్చె దాకా ఆగి గాళ్లకే బియ్యం ఇచ్చుడు.ఏరే టోళ్లను పుస్కన పిలిత్తే ఇగ లోల్లే నా ఉల్లేకు  నువ్వు ఎట్ల అచ్చినవ్ అని.తీసుకచ్చుకునోళ్ళను ,అచ్చి నోళ్లను తప్పు వెట్టిచ్చిడే..ఎనకట అయ్యగార్లు,జంగమయ్యలు ఊళ్ళు పంచుకునేది.అన్న, దమ్ముల కొడుకులు ఇంకా ఏరే టోళ్లు అయిన సుత గిట్ల ఊళ్ళు వంచు కొని ఎవలూల్లే  కు అల్లే పోయేది.వేరే టోళ్లు ఉల్లేకు పోతే తప్పు దండగ కుట్టిచ్చు కునేది.


ఇగ అయ్యగారు ,జంగమయ్య అచ్చి మంత్రాలు సధివేది.గిట్ల సదువంగా ఆళ్ల అయ్య,అవ్వ లతోని,
ఇంకా అయ్య అయితే,ఆళ్ల అయ్యే (తాత),ఇంకా ఆళ్ల అయ్య(ముత్తాత)మూడు తరాల దాకా పేర్లు సెపిచ్చి.మంత్రాలు సధివి.మల్ల గీ దినం అరకు తుర్తిగా భోజనం సేయండి.అని ఆళ్ల ఆత్మ ను నిమ్మలం సేసేది.
ఇగ అవ్వ కు ఇచ్చేదుంటే ఆళ్ల అవ్వ పేరు గాక ఆళ్ల అత్త,అత్తకు మల్ల అత్త పేరు సదివిత్తరు.
ఇగ గిట్ల అత్త పేరు ఎందుకో అవ్వ పేరు  ఎందుకు సదువరో నా సిన్నప్పుడు కొద్దిగ కూడా మనసున వట్టక పోయేది.ఓ పారి మా బాపును అడిగిన సెప్పిండు ఇగ.ఎవ్వలి అంశం మొత్తరో గాళ్ళ పేరే సదువుతరు అని. ఇగ గి బియ్యం ఇయ్యంగా సేతి నడిమిట్ల ఏలుకు దర్భ (గడ్డి) అయితే ఉంగరం వోలె తొడిగిత్తరు.ఇంకా ఆవు పెండ తోని అలికి  నల్ల నువ్వులు తోని నీళ్లు ఒదిలి పిత్తరు.అన్ని సదువుడు అయినంక సేతికి ఉన్న దర్భను తీత్తరు.గి దర్భ ఆగులల్ల దొరుకుద్ధి.


సాట్ల బియ్యం,పప్పు,ఉప్పు ,కూరగాయలు,సింత పండు అన్ని ఎట్టి మొక్కి అయ్యగారికి ఇచ్చినంక ..ఇగ గా అయ్యగారి తోని బొట్టు వెట్టిచ్చు కొని ఇగ అయ్య గారిని  సాగదోలి..ఇగ బొక్కల గొట్టుడే.. కోన్ని, మేకను, గొర్రెను ఏది తినేటోళ్లు అది..


ఓ.దిక్కు కడుపుల పేగులు ఒర్రిన గూడ అయ్య గారు అచ్చి పోయినంకనే బువ్వు కూర.
ఇగ పేదోళ్లకు తుర్తి కావడానికి ఆళ్లకు ఏది ఇట్టమో గాదే అండి పోటువ కాడ వెట్టి మొక్కి తింటరు.
ఇగ కొందరు అయితే ఏది తాగే టోళ్లు అది తెచ్చుకుంటరు.
ఇగ అమాస రోజు దాంక తునుకల బువ్వే..
 తతిమ్మ ముచ్చట సెప్తగాని ఇగ ఉంటనుల్ల.


~~ SN ~~