న్యూఢిల్లీ లో ఉంటున్న ఒక అధికారి,
ఆత్మీయ మిత్రుడు ఈ రోజు సాయంత్రం ఫోన్ చేసాడు.
'ఆంధ్ర ప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టం ' ఏమిటి....అసలక్కడ ఏమి జరుగుతోంది ? కార్యక్రమాల రూపకల్పన , అమలు, నిధులు ఎంత ? ఎలా ? వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి బాగా కనిపించింది.
మీరు అనుసరిస్తున్న'ఎడ్యుకేషన్ సిస్టం' దేశమంతా ప్రవేశ పెట్టడం సాధ్యం అవుతుందా ? అని చివరిగా అడిగాడు.
ఆ మాటే 'ఒక విజయం' అనిపించింది .
ప్రతి విద్యార్థి కోరుకున్న ఆకాంక్ష ఇది.
ప్రతి తల్లీ తపించిన తపన ఇది.
ప్రతి ఉపాధాయ్యుడు కోరుకున్న గౌరవం ఇది.
ప్రతి ఊరు కల కన్న కమనీయ ఉత్సవం ఇది.
అందరూ చెప్తారు. కొందరే ఇలా చేసి చూపిస్తారు.
అలాంటి కారణ జన్ములకే కాలం కిరీటం పెడుతుంది .
జాతీయ మీడియా ఈ మధ్య 'ఆంధ్ర ప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టం ' గురించి వార్తలు ఇస్తోంది.
అమ్మ ఒడి ,గోరు ముద్ద, స్టూడెంట్ కిట్ , నాడు -నేడు కార్యక్రమాల గురించి ఇతర ప్రాంతాల వారికి తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతోంది .
నిజమే!
గతం లో ఢిల్లీ లో జరిగిన విద్యా సంస్కరణల గురించి కూడా ఇలాగే మాట్లాడుకున్నారు.
దేశమంతా ఈ రోజు 'ఆంధ్ర ప్రదేశ్ విద్యా విధానం ' వైపు చూస్తోంది.
ఇవాళ విద్యార్థులకు ఇచ్చిన స్టూడెంట్ కిట్లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ టెస్ట్ బుక్స్, నోటు బుక్స్, వర్క్ బుక్స్, ఒక స్కూల్ బ్యాగ్ ఉన్నాయి.
'నాడు- నేడు' కార్యక్రమం ద్వారా 45వేల పాఠశాలల స్థితి గతులను మార్చి నూతన శోభ ను చేకూర్చడం .650 కోట్ల రూపాయల కార్యక్రమం పాఠశాలలకు ఊపిరి పోసింది .కొత్త ఉషస్సును ఆవిష్కరించింది .
ఆ సందు చివర కాల్వ పక్కన ఎప్పుడు కూలిపోతుందో తెలియని పాతకాలం పైకప్పు; పెచ్చులు ఊడి ఎప్పుడు పడిపోతాయోతెలియని గోడలు ; చెదలు పట్టి ఊగుతున్న కిటికీలు, తలుపులు;ఇది నాడు మన ఊరి బడి దృశ్యం . నేడు దాని స్వరూపం మారుతున్న దశ.
అక్కడికి రెక్కలు కట్టుకొని ఒక సారి మీ 'ఊరి బడి' లోకి వెళ్లి చూసి వచ్చి 'న్యాయం' మీరే చెప్పండి. రాజకీయాలకు అతీతంగా 'ధర్మం' మాట్లాడండి.
ప్రభుత్వ పాఠశాలల్లో 'ఇంగ్లీష్ మీడియం' ఒక స్వప్న సాకారం.
'అమ్మ ఒడి' ద్వారా ప్రతి సంవత్సరం పాఠశాలలకు పిల్లలను పంపే తల్లి అకౌంట్ లో 15 వేలు జమ చేయడం జరుగుతోంది.
'గోరుముద్ద' ప్రోగ్రాం లో భాగంగా పిల్లలకు వారానికి మూడు రోజులు 'చిక్కీలు' ఇవ్వడం, శనివారం నాడు 'స్వీట్ పొంగల్ ' పెట్టడం... 43లక్షల మంది పిల్లలకు షూస్ ఇవ్వడం కోసం పాదకొలతలు ఆన్ లైన్ లో సేకరించడం, ' కిట్ 'లో ఇచ్చిన 3 జతల దుస్తులకు కుట్టు కూలీ తల్లి అకౌంట్ లోకి జమ చేయడం...నూతన పాఠ్య పుస్తకాల్లో పిల్లల సృజనాత్మకత కు అవకాశం కల్గించడం. వంటి విద్యా సంస్కరణల గురించి ఎంతయినా చెప్పవచ్చు .
--------------------
'విద్యా విజయం' వెనుక ఎందరో మహానుభావులు...
-------------------------------
పిల్లల ఆత్మీయ ' మేనమామ' ఒక నమ్మకం. ఒక భరోసా.ఒక అభయ హస్తం.మన పిల్లల నేస్తం .
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారికి
43లక్షల మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు.
విజయవంతంగా విద్యా వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న సారధులు
విద్యాశాఖ మంత్రి డా// ఆదిమూలపు సురేష్ గారికి, పాఠశాల ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ ఐ.ఏ.ఎస్, పాఠశాల డైరెక్టర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ఐ.ఏ.ఎస్,ప్రభుత్వ సలహాదారుడు శ్రీ ఆకునూరి మురళి ఐ.ఏ.ఎస్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రిసెల్వి ఐ.ఏ.ఎస్, SCERT డైరెక్టర్ శ్రీ బి .ప్రతాప రెడ్డి,
సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ ఆర్. మధుసూధన రెడ్డి మరియు విద్యాశాఖ ముఖ్య అధికారులందరికీ ,విజయం వెనుక ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.
''ఈ రోజు చదువు పైన ఖర్చు పెట్టక పోతే రేపు జైళ్ళ పైన దానికి నాల్గింతలు ఖర్చు పెట్టవల్సివస్తుంది.'' అని పెద్దలు ఎప్పుడో చెప్పిన మాట శిలాక్షరం .
చరిత్ర ఎట్లా నిర్మితం అవుతుందని ఎప్పుడూ
అడుగుతుంటావు కదూ...
ఇదిగో ఇలాగే ...నిశ్శబ్దంగా!
అన్ని ప్రశ్నలూ... విమర్శలూ...ఒకే జవాబు !
చిన్నారుల ముఖాల్లో చిరునవ్వుల వెలుగులు...కొత్త కాంతి. కొత్త శోభ.
బడికెళ్ళడం నిజంగా వేడుక .
ఆంధ్ర ప్రదేశ్ మోడల్ స్కూల్ విజయ గాధ --- డాక్టర్ వేంపల్లి గంగాధర్: ( విద్యా వేత్త, పాఠ్యపుస్తకాల సమన్వయకర్త.భారత రాష్ట్రపతి పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార గ్రహీత )