బంగారు: - డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి

‘‘ఆడంబరాలు అనివార్యమైన స్థితికి చేరుకున్నయ్’’ బుంగి బాధగా అన్నడు.
‘‘సెలబ్రిటి కల్చర్ తప్పనిసరైన తంతు అయింది’’ అన్నాను.
‘‘మా పెద్ద బాపు కొడుక్కు బిడ్డ పుట్టింది. పుట్టిన రోజు నుండి ఇరవై ఒకటి వరకు జరిగిన తతంగం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.’’ అంటూ పాప ఫంక్షన్ విశేషాలు చెప్పడం మొదలు పెట్టిండు.
నామకరణం రోజు పట్టువస్త్రాలు, బంగారు నగలతో ఫైవ్‌స్టార్ హోటల్‌కు అందరూ బయల్దేరారు. పాప తండ్రికి పుత్తడి బొమ్మ అయింది. ఏసి చల్లదనాన్ని స్రవిస్తుంది. మనుషులు కాంతులీనుతున్నరు. పగలు, రాత్రి కాని వాతావరణం ఏర్పడింది. పలకరింపుల్లో అంచనాలు బయటపడుతున్నాయి. ఖరీదైన స్థితి పాపను ఉక్కిరి బిక్కిరి చేసింది. గిఫ్ట్‌ల గోల, పెద్దల హేలలతో పాప ఏడుపు అందుకొంది. తల్లిచేతుల్లో నుండి తండ్రి ఒడిలోకి మారింది. డిన్నర్ మొదలయింది. బఫ్ సిస్టమ్‌లో పారవేయగలిగినంత పెట్టుకొని తినగలిగినంత తింటున్నరు. తల్లి నవ్వుతూ అందర్ని పలకరిస్తుంది. పాప ఏడుపు ఇంకా ఆపలేదు. ఆహార పానీయాల ఘుమ ఘుమలు ముక్కుపుటాలకు తాకి రుచులను తెలుపుతున్నాయి. పదిరకాల పదార్థాలు జిహ్వను పరుగులు పెట్టిస్తున్నవి. పాపను ఊరడించడానికి గది నుండి బయటకు వచ్చాడతడు. మంద్రంగా గాలి వీచింది. నక్షత్ర కాంతి చల్లదనాన్నిచ్చింది. పిండి ఆరబోసినట్లున్న వెన్నెలకు, పాప కనులు తెరిచింది. హాయి గొలిపే గాలిలో, సుఖాన్నిచ్చే ఒడిలో పాప కేరింతలు కొట్టింది. పాపను చూసి ఏసీ గది వెలవెల బోయింది.
ప్రియము లేని విందు పిండి వంటలు చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్ర మెరుగనీవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినురవేమ
వేమన శతకం
వేమన