ఐదేళ్ల చింటూకు ప్రతి రోజూ బాల్కనీలో కూర్చుని క్రింద రోడ్డు పక్కన కుక్కలు ఆడుకోవటం సరదాగా చూసేవాడు.ఆ బాల్కనీ అంటే చాలా ఇష్టం చింటూకు.
భోజనం, హోమ్ వర్క్, ఆటలు అన్నీ వాటిని చూస్తూనే పూర్తి చేసేవాడు.
ఒకరోజు అందులో ఒక కుక్క చిన్ని చిన్ని నాలుగు కుక్క పిల్లలకు జన్మ నిచ్చింది. ఇంక చింటూ సంతోషానికి అవధులు లేవు తన ఆనందం రోజు కంటే ఎక్కువైంది.....
ఇక రోజూ వాటి ఆటలు చూడటం కోసం త్వర త్వరగా భోజనం,హోమ్ వర్క్ పూర్తి చేయటం అయిపోయేవి ...
అలా వాటి ఆటలు చూస్తున్న చింటూకు ఒక రోజు వాటి లో ఒక కుక్క పిల్ల లేవక అలా పడుకుండి పోవటం చూశాడు. కుక్క తో పాాటు మిగతా కుక్క పిల్లలు,దాని చుట్టూ తిరుగుతూ" కుయ్ కుయ్ "మని మొరుగుతూ తల్లడిల్లి పోవడం చూసి మరింత దిగాలు పడ్డాడు చింటూ. ముందు చింటూకు ఏమీ అర్థం కాలేదు తర్వాత తల్లి కుక్క బాధ చూసి అర్థం కాక పోయినా చిన్న కుక్క పిల్ల ఆడక పోవటంతో ఏదో జరిగిందని అర్థం అయింది.
చింటూకు ఏమీ తోచడం లేదు. అలా చూస్తూ సరిగ్గా భోజనం చేయలేదు హోం వర్క్ కూడా చేయలేదు. తల్లి లతను లాక్కెళ్ళి బాల్కనీలో కుక్క పిల్లను చూపించాడు. "అవి అంతే రోడ్డు మీద అలా ఆడుతూ పడుతూ లేస్తుంటాయి వాటి గురించి మనం పట్టించుకో కూడదు అంది లాలనగా."
ఆ సమాధానం నచ్చలేదు ఐదేళ్ల చింటూకు. రోజంతా చిన్న కుక్క పిల్ల కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తోంది తల్లి కుక్క.
ఆ రాత్రి సరిగా నిద్ర పోలేదు చింటూ కళ్ళల్లో చిన్ని కుక్క పిల్లే కనపడుతున్నది .
ఉదయం చింటూ లేవలేదు స్కూల్ టైం అయినా. లత కంగారుగా వచ్చి "ఏమైందని అడిగింది"
" కడుపు నొప్పిగా ఉందని అన్నాడు చింటూ".
ఆ రోజు ఆఫీసుకు శెలవు పెట్టి చింటూ ను హాస్పిటల్ కు తీసుకెళ్ళ బోయాడు శేఖర్ . కారు ఎక్కబోయే సమయానికి చింటూ సడెన్ గా " కుక్క పిల్లను కూడా తీసుకుని వెళదాం నాన్నా హాస్పిటల్ కు"అన్నాడు గారంగా.
"వద్దు నాకసలే టైం లేదు నీ కోసమని ఓ గంట లేట్ గా వస్తానని చెప్పా ఆఫీస్ కు అన్నాడు చిరాగ్గా "
"పద చింటూ అసలే నాన్నగారికి ఆఫీస్ కు టైం లేదు " అంది లత కూడా .
"అయితే నిన్న టీవీ లో ఒక కుక్కపిల్ల రోడ్డు పక్కన పడిపోతే ఎవరికీ అసలు మానవత్వం లేదు అని మీరిద్దరూ కోప్పడ్డారు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంటే హాస్పిటల్ తీసుకెళదామంటే వద్దంటున్నారు ." అంటూ ఏడుపు లంఘించు కున్నాడు.
చిటూ మాటలు వినగానే ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు .
మానవత్వం ఏదైనా చాతల్లో చూపాలే గానీ మాటల్లో కాదనే చిన్న సత్యాన్ని గ్రహించని తమ అజ్ఞానానికి చింతిస్తూ
" ఆ పద పద తీసుకొని వెళదాం " అనగానే వేయికాంతుల విద్యుత్ దీపాలు ఒకేసారి వెలిగాయి చింటూ మోములో....
(సమాప్తం)
.
..మానవత్వం --మొహమ్మద్ అఫ్సర వలీషాద్వారపూడి (తూ గో జి)