దినము: -- డాక్టర్. బి. వి. ఎన్ . స్వామి

ఆడిటోరియంను అందంగా అలంకరించారు. కులబాంధ వులనుద్దేశించి మంత్రిగారు ఆప్యాయంగా మాట్లాడినారు. చనిపోయినవారికి, పూర్తిగా దెబ్బతిని లేవలేనివారికి, పాక్షికంగా దెబ్బలు తిన్నవారికి ఎక్స్‌గ్రేషియా కింద చెక్కులిచ్చారు. ఇదే అదనుగా అందరికి మాంసంతో వండి వడ్డించారు. ఆ విధంగా మంత్రి మంచోడనిపించుకున్నడు. చేతికిచ్చిన చెక్కులు మా ఘనతే అన్నట్టు ఆయన కనిపించిండు. అంతా ఆనందమే అనిపించి మంత్రి మాయమైండు తెలిసిన వారిని బుంగి కదిలించిండు.
‘‘అన్నా ఈ డబ్బులతోటి ఏం చెయ్యాలనుకుంటున్నావు’’
‘‘చచ్చి పోదామనుకుంటున్న’’
‘‘ఏదైనా చేసుక బతకాలని కదానీకు యాభై వేలిచ్చిండు’’
‘‘కల్లుగీతకు తాడెక్కితి. కండ్లు తిరిగి పడిపోతి. రెండు కాళ్ళు ఇరిగె. సర్కారు దవాఖానకు పోతె వట్టిగనె  మంచంల పండబెట్టిరి. కాళ్ళు కుళ్ళిపోవట్టే. ఇగెట్లరా రాములూ. అని పెళ్ళాం మీది పుస్తెలమ్మి ప్రైవేట్లకు పోతె రెండు కాళ్ళు తీసేసరి. ఇపడు నేను కూసుండి బతుకుడే కదా. దినం ఎట్ల గడవాలె. ఇంత వరకు రెండు లక్షల అప అయింది.’’
‘‘గతం గతః ఇక ముందు ఎట్ల బతకాలనుకుంటున్నావు’’
‘‘నేను బతుకడమే నష్టం. అపడే చస్తే ఎక్కువ డబ్బులచ్చి పోరగాండ్లకు పనికచ్చు. నేనిపడు ఎట్ల కూడా పనికి రాకుంటయిన పెండ్లాం పిల్లలకు భారమైన’’ అంటూ భోరున ఏడ్చిండు.
‘‘అట్ల అనుకుంటరా చెప’’
‘‘గౌండ్లోని బాధ ఎవరు పట్టించుకుంటున్నరు. తాళ్ళు ఎక్కటానికి ఏవైనా అల్కటి పనిముట్లు ఉంటె బాగుండు’’
‘‘రెండు, మూడు రకాల ఆధునిక పరికరాలు కనుగొన్నరు కదా’’
‘‘అవి పనికస్తలేవు. వాటి కంటె పాతయే నయం’’ అంటూ నిట్టూర్చిండు
‘‘అన్నా! నీ భార్యా పిల్లలు బుద్ధిమంతులు, నువ్వేం రంది పెట్టుకోకు’’ అంటూ అనునయించిండు బుంగి.
కొన్నాళ్ళు సుఖము కష్టము
కొన్నాళ్ళు భుజింపకున్న గొరగాదు సుమీ
పున్నమ దినముల వెన్నెల
యెన్నంగ నమాసలందు నిరులు కుమారీ
కుమారీ శతకం
పక్కి లక్ష్మీనరసింహ కవి