ఈతరం--- యామిజాల జగదీశ్

నాటితరం
అందరూ బాగుండాలని 
అనుకునేది!
తర్వాతితరం 
స్వార్థం పెంచింది!
ఈతరం
యువతరం
రెండింటి మధ్యా
కొట్టుమిట్టాడటంతో
రేపటి తరం ప్రశ్నార్థకమే


ముందూ వెనుకా
రెండింటినీ చూసినా
ముళ్ళూ పూలూ
మార్గాలను చూసినా
ముందుతరం 
ముందుమాటలు
పాఠాలుగా చేసుకుని
పెద్దల మాటలను
పెట్టుబడిగా మలచుకుని
ముందడుగు వేయడం
తక్షణకర్తవ్యం....


కొత్తొక వింతనుకుని 
అందులోనే మునిగిపోతున్న 
యువతరం
కళ్ళు తెరచి
తామున్నది భూమ్మీదేననే
నిజాన్ని తెలుసుకోవాలి


పూర్వం 
బంధాలూ అనుబంధాలూ
ప్రేమానురాగాలూ
కోకొల్లలు
ఈతరం 
జీవమున్న బంధాలను కాక
జీవంలేని వస్తువులపై మోజు పెంచుకుని
దారులు మరచి
అడ్డదారులు తొక్కి
అత్యాశలతో
అవస్థలు పడుతూ
కష్టాలను కోరితెచ్చుకుంటున్నాది


దారి తప్పిన ఈతరం
యువతరం
లేని చిరునామాకోసం 
వెతుకుతూ
నిరాశానిస్పృహలతో
తడబడుతోంది


వాలిపోకమునుపే 
ఈతరం యువతరం
సమాజంలో తలెత్తుకుని 
నడయాడేందుకు
చైతన్యవంతులు కావాలి 
అనుభవజ్ఞుల మాటలను
బంగారు బాటకు
పునాదులుగా చేసుకుని
అడుగులేయడం 
అన్ని విధాలా శ్రేయస్కరం
 
తరతరాల మధ్య
దూరభారాలు తగ్గించుకుని
మానవత్వ మనసుతో 
ముందుకుసాగాలి


విజ్ఞాన విశ్వంలో
నింగినే చూస్తూ
ఊహాలోకంలోనే
ఉండిపోక 
కలల ప్రపంచంలోనే
ఉండిపోక 
నేలపై నలుగురికోసం బతికేందుకు
లక్ష్యాన్ని నిర్దేశించుకుని
కార్యాచరణతో
పురోగమించాలి
సత్ఫలితాలు సాధించాలీతరం, యువతరం