ఎంగిలిపూల_బతుకమ్మ:సరోజ పోచమల్లు

ఇగ ఇయ్యాల గదే నుల్లా బొడ్డెమ్మ పున్నం పోయినంక అచ్చె అమాస. ఎంగిలి పూల అమాస మీద ఇగ ముచ్చట సురువ్ జెద్దాం.అదే నుల్లా సిన్న బతుకమ్మ.
ఇగ గీ పండుగ అయితే మన తెలంగాణ ల జరుపుకునే పెద్ద పండుగ నాయే.గిది గా గౌరమ్మ ను పసువు,కుంకుమ ఏసీ తొమ్మిదొద్ధులు  ఆడి పొలగాండ్లు,లగ్గం అయిన మన అక్కలందరు ఆడే ఆట.
ఇగ గిది ఆశ్వయుజ మాసం ల ఆత్తదాయే.అదే నుల్లా ఇంగిలీష్ నెలలు అయితే సెప్టెంబర్,అక్టోబర్ నెలల్ల అత్తది.
ఇగ గిప్పుడు,గిప్పుడే జెరంత ఆనలు ఎనకకు వట్టి.ఇగ ఆయిటి వూనంగా పెట్టిన పూల సెట్లన్నీ ఇరగ ఊసే కాలం.తీరొక్క పువ్వు సెట్ల నిండా ఇరగ బూత్తయ్. బతుకమ్మ పండుగ ను గందుకే పూల పండుగ అని అంటరు.
ఇగ అమ్మ లక్కలు కూడా పొలం పనులు జెరంత ఎడ అచ్చె కాలం నాట్లు, కలుపులు అయ్యి ఇగ సేతికచ్చే పంట కోసం ఎదురు సూసుకుంటా ఇగ గా గౌరమ్మను మంచిగ మొక్కు కుంట ఆడుకుంటరు.
లగ్గం గానోళ్లు జెప్పన లగ్గం కావాలె అని మంచి సంబంధం దొరింపు అయ్యి అయినోళ్లు ఇంట్ల (జెరంత మంచి గా ఉన్నోళ్లు)వడాలే అని మొక్కుకుంటా ఆడుకుంటరు.
ఇగ బొడెమ్మ ఆడుడు అయినంక సిన్న బతుకమ్మ..
గియ్యాల మేము అయితే మబ్బుల లేసి.గుమ్మడి పూల కోసం పోయేది..బతుకమ్మను తీరొక్క పువ్వు పెట్టుడే.. ఉద్రాచ్చ,కట్ల పువ్వు..మందార పువ్వులు,గునుగు తంగేడు..ఏ పువ్వు అన్న పెడతరు.
పొద్దుగాల పువ్వులన్ని తెచ్చుకొని..తలకు ఓసుకొని..
ఇగ మాదరోళ్ళు తెచ్చిన సిబ్బిల రెండు సిబ్బిలు తెచ్చేది...రెండు బతుకమ్మలు పేర్వాలట..
ఇగ తీరొక్క పువ్వు తోని బతుకమ్మలు పెర్సి..
ఇగ మాపటేళ్లకు జీడీ గింజల నూనె దిగా పార ఎట్టుకొని.. నున్నగా తలదూసి..పౌరడ్, కాటుక, బొట్టు ఎట్టి..ఇగ మంచిగ తయారయ్యి..
మా ఊళ్లే ఆఫీసు కాడ మేమంతా అడేదుల్లా..
ఇగ గా ఆఫీసు ముందఉన్న అడ్లోల్ల సీలత ..ఊడిసి అలికి మొగ్గు ఎట్టేది..
ఇగ మేమంతా బతుకమ్మ లు తీసుకుపోయి ఎట్టి అడంగా..పెద్దోళ్ళు అచ్చి ఓ అయిదు సుట్లు తిరిగి ఇగ ఆడుకొండ్ర పొరగాళ్ళు పొద్దంత పని సేసి ఉన్నమ్ మల్ల కొద్దీగాగినంక అచ్చి అడుతం అని పోయేది..
ఇగ గప్పుడు మాదే మోక గప్పుడు డి, జె .లు గియ్యన్ని ఎమ్ లేకుండా...
సేతులతోని సప్పట్లు కొట్టుకుంటా అంగుకుంట, లేసుకుంట ఆడేది..
ఇగ ఎలుమొల్ల వనమాల బతుకమ్మ పాట పాడేది..
" ఇద్దరక్క సెల్లె0డ్లు ఉయ్యాలో..
ఓక్కూరికిత్తె ఉయ్యాలో..
ఒక్కడే మాయన్న ఉయ్యాలో..
సూసన్న రాకాపాయ ఉయ్యాలో.."
అని..పాడేది..
ఇగ ఇంకోలు  పాడేది.. అప్పుడే
"సింత కింద సాలోడ ఉయ్యాలో ..
సీర నేత్తవ  ఉయ్యాలో..
నేత్త,నెత్తా గాని ఉయ్యాలో..
నేనొక్క పోగు ఉయ్యాలో.."
అని అన్ని సిన్న సిన్న పాటలు పాడుకునేది..
ఇగ కొంచం సేపు పెద్దోళ్ళు కూడా ఆడేది..
సప్పట్ల ఆట అయినంక  కోలలు ఆడేది..
గియ్యికూడా సెత్తోనే ఆడేది..
"ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ..
ఏమేమి కాయప్పునే గౌరమ్మ..
గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ..
గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ..
గుమ్మాడి పూలతో ఆడే వారెవరో,పాడేవారెవరో.."
అని పాడుకుంటా ఆడినంక..
ఇగ బతికమ్మలు తీసే టప్పుడు..బతుకమ్మలు ఎత్తి సేతుల వట్టుకొని..
"ఒక్కేసి పువ్వేసి సంద మామ..
ఒక్కజాము అయ్యే సందమామ..
రెండేసి పువ్వేసి సందమామ..
రెండు జాములు అయ్యే సందమామ" 
అని  సిబ్బిల పువ్వులు ఒక్కోటి కింద అలికిన ముగ్గు మీద ఏసుకుంటా..పాడినంక..
ముందు గాల నాడు ఏదన్నా పచ్చని సెట్టు కింద ఏసేది...
ఇగ గి పండుగ అంటే..పొద్దంతా అప్పాలు సేసి నాతిరి ఆడేది..
ఇగ మా అవ్వ అయిదు తీర్ల సత్తుల సేసేది...
మక్కలు, పెసల్లు, బియ్యం ఏంచి ఇసురవుతు తోని ఇసిరి సెక్కర కూడా ఇసిరి..గండ్ల కలిపేది..
ఇగ మా అవ్వ తంక (టంక)మెత్తు  నెయ్యి..తెచ్చి గన్ల కలిపితే మస్తు రుసి ఉండేది..
ఇంకా నువ్వుల సత్తు, పల్లి సత్తు సేసేది..
ఇగ మా అన్న గాల్ల సోపతి  గాళ్ల తోని పోయి..గునక పువ్వు తెచ్చేది..
ఇగ గా పువ్వు కట్టలు,కట్టి రంగులేసి.. ఎట్టేది...
ఇగ మా దోస్తులు నేను మా ఊరికచ్చిన మూటలన్న దగ్గర సిల్కు బట్ట తీసుకొని..
అడ్లోల్ల లచ్చక్క దగ్గర లంగ, జాకిటి కుట్టిచ్చు కునేది..
ఇగ  రాయన్నలమ్మ దగ్గర గాజులు,బొట్టు కీసలు ,దండలు అన్ని కొనుక్కోని..
ఇగ గి సిన్న బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడేది..
అడుడు అయినంక బతుకమ్మ లు తీసుకొని పోయి మా ఊరి మత్తడి కాడ పారే నీళ్ళల్లో ఏసేది..
ఇగ సద్దుల బతుకమ్మ,దసర ముచ్చట ఇంకా మిగిలి పాయే  అది ఇగ అటెంక సెప్త ఉంటనుల్ల.
~~ SN ~~