కోతి బావ సాయం (గేయకథ) రచన:బి.వి.పట్నాయక్,పార్వతీపురం

మందలోని మేక ఒకటి
మేత కొరకు ముందుకెళ్ళి
కొండలన్ని ఎక్కి దిగుచు
అడవి నందు దారి తప్పె!


ఒంటరైన మేకపిల్ల
కంటనీరు పెట్టుకుని
చెంతనున్న ఊరు చేర
భీతి తోడ అడుగు వేసె!


చెట్టు మీద కోతి బావ
బుజ్జిమేక దిగులు చూసి
బుజ్జగింప ప్రయత్నమున
ఓదార్పుగ పలుకరించె!


కోతి:
ఇటువెళ్ళెను మీ బృందం
వేగిరమున పరుగులిడుము
నక్క ఒకటి పొంచి ఉంది
నిన్ను అదియు చంపగలదు


మేక:
నడచి నడచి అలసితిని
దాహముతో సొలసితిని
నీటి జాడ తెలియజేసి
ప్రాణములను కాపాడుము


కోతి:
పక్కన  ఒక  కొలను ఉంది
అందులోను మకరముంది
నీరు తాగు జంతువులను
మింగుటయే దాని గుణం


ఇంతలోన నక్కబావ
నెమ్మదిగా అటకు వచ్చె
మేకను కని నక్క అంత
ఉల్లసమున ఊళ వేసె!


నక్క:
కోతి బావ కోతి బావ
కొమ్మలెక్కి ఆడుకొనుము
మేషమును మెక్కి నేను
పండుగను చేసుకుందు!


మించి చున్న ప్రమాదమును
పసిగట్టిన కోతి అపుడు
నంగనాచి నక్కనేమెు
చిత్తుజేయ ఎత్తు వేసె


కోతి:
నక్కబావ నక్కబావ
తిండి గోల ఆపి చూడు
మహిమ గల కొలను చేరి
మేక పొందె ఉపకారం


నక్క:
మేక మీద మమకారం
నీకుందని నాకు తెలుసు
ఏమి పొందె ఉపకారం
రుజువు చూపు కోతిబావ


కోతి:
నమ్మికతో మేక దిగే
నీటి యందు తోక ముంచె
ధ్యానముతో కళ్ళు మూసె
తోక తగ్గి కొమ్ము లొచ్చె!


నక్క:
భలే భలే కొలను మహిమ
ఆచరించ లాభకరం
కొమ్ము లొచ్చు మెునగాడిగ
కానలోన తిరగవచ్చు


నక్క చేరె కొలను దరిన
తోకనేమెు నీట ముంచి
యోగిలాగ కనులు మూసి 
కొమ్ము లకై కలలు గనెను


పొంచి ఉన్న మెుసలి అంత
నక్కతోక పట్టిలాగె
నీట మునిగి నక్క చచ్చె
ఆరగించె మకర మపుడు