సద్దుల బతుకమ్మ ఉయ్యాలో--సల్లంగ చూడమ్మ ఉయ్యాలో-- --పద్మ త్రిపురారి--జనగామ

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
చల్లని తల్లివి  ఉయ్యాలో
చల్లంగ చూడమ్మ ఉయ్యాలో.
తొమ్మిది రోజులు ఉయ్యాలో
తీరొక్క పూలతొ ఉయ్యాలో
అతివలు కొలువంగ ఉయ్యాలో
ఆనందమే పొంగ ఉయ్యాలో
సద్దులు సేయంగ ఉయ్యాలో
సాగనంపేవేళ ఉయ్యాలో
ఉల్లాసంగా జనులు ఉయ్యాలో
ఉత్సవాలు సేయ ఉయ్యాలో
వాడవాడల్లోన ఉయ్యాలో
వెలదులే కొలువంగ ఉయ్యాలో
ప్రకృతి పండుగ ఉయ్యాలో
సంస్కృతే చాటంగ ఉయ్యాలో
సౌభాగ్యమిచ్చేటి ఉయ్యాలో
చక్కని  బతుకమ్మ ఉయ్యాలో
జగతి సిగలోన ఉయ్యాలో
వెలిగినే బతుకమ్మ ఉయ్యాలో
తొమ్మిది సద్దులు ఉయ్యాలో
తీరు తీరున పెడుదురుయ్యాలో
చింత పులుపు సద్ది ఉయ్యాలో
చెంత చేరి ఇద్దు రుయ్యాలో
చింతలే తీర్చమ్మ ఉయ్యాలో
చలువనే పంచమ్మ ఉయ్యాలో
నిమ్మకాయ సద్ది ఉయ్యాలో
నెనరుతోడ పెడుదు రుయ్యాలో
నెమ్మదైన ఓర్పు ఉయ్యాలో
నెమ్మి పెంచవమ్మ ఉయ్యాలో
పెరుగుతోటి సద్ది ఉయ్యాలో
ప్రేమతో పెడుదు రుయ్యాలో
పెరుగుతున్న స్వార్థముయ్యాలో
తుంచవమ్మ జనుల ఉయ్యాలో
పెసరుతోటి సద్ది ఉయ్యాలో
కొసరి ఇద్దురమ్మ ఉయ్యాలో
పెరిగిన అవినీతి ఉయ్యాలో
వేళ్ళతో కదిలించు ఉయ్యాలో
నువ్వుల సద్దిని ఉయ్యాలో
నమ్మినీకిద్దురు ఉయ్యాలో
నిలిచిన అభివృద్ధి ఉయ్యాలో
నీవునడుపవమ్మ ఉయ్యాలో
కొబ్బరి సద్దిని ఉయ్యాలో
కోరి నీకు పెడుదు రుయ్యాలో
కోపాలు తాపాలు ఉయ్యాలో
లేకుండ చూడమ్మ ఉయ్యాలో
శనగపప్పు సద్ది ఉయ్యాలో
శ్రద్ధతో పెడుదురుయ్యాలో
శ్రద్ధను బుద్ధిని ఉయ్యాలో
మంచినే పెంచమ్మ ఉయ్యాలో
ఆవపొడిసద్ది ఉయ్యాలో
ఆత్మతో నేపెడుదు రుయ్యాలో
ఆత్మీయతే పంచి ఉయ్యాలో
అనురాగమే పెంచు ఉయ్యాలో
దబ్బనిమ్మ సద్ది ఉయ్యాలో
దండిగా నిద్దురు ఉయ్యాలో
ధనదాన్యాలిచ్చి ఉయ్యాలో
దయతో మము సూడు ఉయ్యాలో
మలీద ముద్దలు ఉయ్యాలో
మమతతో నిడుదు రుయ్యాలో
మితిమీరిన చెడును ఉయ్యాలో
మనుషుల్ల తగ్గించు ఉయ్యాలో
సత్తుపిండి ముద్దలుయ్యాలో
సత్యంగ ఇద్దురు ఉయ్యాలో
సత్తునే మాకిచ్చి ఉయ్యాలో
సత్యమే పెంచమ్మ ఉయ్యాలో
పసుపు కుంకుమలు నీకు ఉయ్యాలో
పసిడిగా ఇస్తాము ఉయ్యాలో
పాడి పంటలు మాకు ఉయ్యాలో
పచ్చగా పండించు ఉయ్యాలో
భక్తి శ్రద్ధలతోటి ఉయ్యాలో
మెండుగా పూజిద్దురుయ్యాలో
పిల్ల పాపల జనులనుయ్యాలో
దయనుజూడవమ్మ ఉయ్యాలో.


    .