పండుగే పండుగ! రచన:బి.వి.పట్నాయక్

అదొక అందమైన అడవి. క్రమశిక్షణకు మారు పేరు అయిన కోతి గురువు గురుకులాన్ని స్థాపించడంతో జంతువులన్నీ సంతోషించాయి. తమ పిల్లలను గురుకులంలో చేర్పించి నిశ్చింతగా ఉండేవి.
          ఆ గురుకులంలో  ఒక ఎలుగు తన పిల్లను చేర్పించింది. అప్పుడప్పుడు గురుకులానికి వెళ్ళి పిల్ల యోగక్షేమాలతో పాటు చదువు సంధ్యల గురించి కోతి గురువును అడిగి తెలుసుకొంటుండేది.
       రోజులు గడుస్తున్నాయి, పరీక్షలు నెలరోజులు ఉన్నాయనగా తన పిల్లను చూడడానికి గురుకులానికి ఎప్పటిలాగే వెళ్ళింది తల్లి ఎలుగు.
       తల్లి ఎలుగు  ఒక్కసారి కనిపించడంతో పిల్ల ఎలుగు ఆనందానికి అవధుల్లేకపోయాయి. తల్లి చెంతకు చేరి హత్తుకుంది.
       ఇంటిపై దృష్టి ఉన్న పిల్లలు నడుచుకున్న మాదిరిగా పిల్ల ఎలుగు నడుచుకుంది అనుకుంది తల్లి ఎలుగు.
         తనతో పాటు తెచ్చిన తినుబండారాల సంచిని పిల్ల ఎలుగు చేతిలో పెట్టింది తల్లి ఎలుగు.      '  ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెచ్చావు?' అంటూ ముభావంగా ఉండిపోయింది పిల్ల ఎలుగు.
           పిల్ల ఎలుగు మాటల్లో తేడాను గమనించింది తల్లి ఎలుగు.
          ' ఎందుకు అలా అంటున్నావు?  నిన్ను చూడాలని వచ్చినప్పుడు ఏదో ఒక తినుబండారం తీసుకురావడం నాకు అలవాటేగా' చెప్పింది తల్లి ఎలుగు.
          'నన్ను ఇంటికి తీసుకుపోడానికి వచ్చావనుకున్నాను' మనసులో మాట చెప్పింది పిల్ల ఎలుగు.
         'పరీక్షలకి ఇంకా నెలరోజుల సమయం ఉంది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఏమి చేస్తావు? ఈ సమయంలో గురుకులంలో చదువే నీకు శ్రేయస్కరం' లాలనగా  ఒప్పించే ప్రయత్నంలో చెప్పింది తల్లి ఎలుగు.
         ఇక్కడ చదువు సవ్యంగా సాగడం లేదు. రాత్రి అయ్యే సరికి పిల్లలంతా కబుర్లతో కాలక్షేపము చేస్తున్నారు. వాళ్ళ మధ్య నా చదువు   ఏకాగ్రత లేని చదువుగా మారి బుర్రకెక్కకుంటుంది? తన సమస్యను చెప్పుకుంది
పిల్ల ఎలుగు.
                పర్యవేక్షించే గురువు కాలక్షేపం చేస్తున్న వారిని మందలించడం లేదా? అడిగింది తల్లి ఎలుగు.
       మందలించినా,పిల్లలెవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.పరీక్షలు అయిపోయాక సరదాగా ఎలా గడపాలన్నదానిపై అందరు చర్చించుకుంటున్నారు. అదీగాక ఇప్పుడు గురుకులంలో పిల్లలకు తిండి పెట్టే విషయంలో పెద్దగా శ్రద్థ తీసుకోవడం లేదు కూడా! లోటుపాట్లు ప్రశ్నించే పిల్లలకు వస్తున్న ఉగాది పండుగ రోజు ఘనమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పి తప్పించుకుంటున్నారు' తల్లి ఇంకా తన దారికి రాకపోవడంతో గురుకులంలో లోటును అసహనంతో ఫిర్యాదు చేసింది పిల్ల ఎలుగు.
           తల్లి ఎలుగుకి కోపం వచ్చింది. పరీక్షల సమయంలో ఆరోగ్యాన్నిచ్చే తిండి అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో కోతి గురువును నిలదీయడానికి సిద్ధపడింది.
         పిల్లను తీసుకుపోయి కోతి గురువును కలిసింది.మిగతా జంతువుల పిల్లలు కూడా తల్లి ఎలుగుని అనుసరించి గురువు ముందుకు చేరాయి. తిండి విషయంలో గురుకులంలో పిల్లలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లోటుపాట్లు సరి దిద్ది మంచి తిండి పెట్టే ఏర్పాట్లు చేయండి సూచన చేసింది తల్లి ఎలుగు.
            మా గురుకులంలో పిల్లలు చాలా తెలివైన వారు.వాళ్ళదారిలోనే నేను నడుస్తున్నాను చెప్పింది కోతి గురువు.
           తెలివికి, తిండికి సంబంధమేమిటి? తల్లి ఎలుగు అసహనంతో ప్రశ్నించింది.
        'పరీక్షలు వస్తున్నాయి,సాధన చేయండి అని చెబితే ఇంకా పరీక్షలకు చాల సమయం ఉంది. అప్పుడు చదువుకోవచ్చు అని ధీమాగా చెబుతుంటారు ఈ పిల్లలు. వారి శక్తి సామర్థ్యాలు తక్కువగా అంచనా వేసిన నా తెలివితక్కువతనాన్ని గుర్తించాను. అది సరిదిద్దు కొనే క్రమంలో  తిండి విషయంలో కూడా వారి శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయకూడదనే తలంపుకు వచ్చి పండుగ రోజు ఘనమైన భోజనం పెడితే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చాను. అందుకోసమే ప్రస్తుత భోజన ఏర్పాట్లు పట్ల పెద్దగా శ్రద్ధ పెట్టలేదు'అసలు విషయం చెప్పింది కోతి గురువు.
         జంతువుల పిల్లలన్నీ గురువు మాటలకు కంగుతిన్నాయి.తమలో ఉన్న లోపానికి విరుగుడుగా కోతి గురువు ప్రవర్తించిందని తెలుసుకొని సిగ్గు పడ్డాయి. తల్లి ముందు దోషిగా నిలబడిన పిల్ల ఎలుగు తప్పు దిద్దుకుంటానని లెంపలేసుకుంది.
         'చదువుకొనే వయస్సులో చదువు మీద దృష్టి పెట్టాలి. ప్రతి రోజు మంచి తిండి ఎంత అవసరమో, సాధన కూడా అంత అవసరం ఉంటుంది. పరీక్షలు వచ్చేటప్పుడు చదువుకోవచ్చు అనే భావన బద్ధకస్తులకి మాత్రమే ఉంటుంది. బద్ధకస్తుడికి బతుకంతా భారంగానే ఉంటుంది. మీలో మార్పు కోసం ఈ పని చేశాను. ఇక నుండి ప్రతి రోజు పండుగలా భోజన ఏర్పాట్లు చేస్తాను 'హామీ ఇచ్చింది కోతిగురువు.
         'నువ్వు బద్ధకస్తుడివి కాదనే నమ్మకం నాకు ఉంది. నిరంతర సాధనతో ప్రతి విషయాన్ని సులభతరం చేసుకో. సులభతర చదువుకి వ్యక్తి గత క్రమశిక్షణ అవసరం ఎంతైనా ఉంది ' అంటూ పిల్ల ఎలుగుకి హితబోధ చేసింది తల్లి ఎలుగు.