బాలలపై లైంగికనేరాలకు మరింత కఠినశిక్షలు: ఏపీ మహిళా శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఏఆర్ అనూరాధ వెల్లడి


 పోక్సోచట్టం కొత్త నిబంధనలపై పునశ్చరణ తరగతులు
*ఆన్ లైన్లో మాట్లాడిన డైరెక్టర్ కృతికాశుక్లా, సిఐడి డిజిపి సునీల్ కుమార్బా
లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి మరింత కఠినశిక్షలు తప్పవని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, సీనియర్ ఐపిఎస్ అధికారిణి ఏఆర్ అనూరాధ హెచ్చరించారు.
పోక్సో చట్టంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై పునశ్చరణ తరగతులను ఆన్ లైన్ ద్వారా బుధవారం నిర్వహించారు. ఏపీ బాలల సంక్షేమం, సంస్కరణసేవల శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  అనూరాధ హాజరై మాట్లాడారు.
అలాగే రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమశాఖ సంచాలకులు కృతికాశుక్లా, ఏపీ సిఐడి అదనపు డిజిపి పి.వి. సునీల్ కుమార్, బాలల సంక్షేమశాఖ జేడీ బి.డి.వి. ప్రసాదమూర్తి, యూనిసెఫ్ ప్రతినిధి, బాలల సంరక్షణ నిపుణులు ఎస్. జార్జి, సీనియర్ న్యాయవాది అనంత్ కె.ఆస్తానా తదితరులు ఆన్ లైన్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.


ఈ సందర్భగా వక్తలు మాట్లాడుతూ, పిల్లలపై లైంగిక నేరాల నియంత్రణకు కఠినచర్యలు తప్పవన్నారు. బాధితుల సంరక్షణ, సంక్షేమం దిశగా తక్షణచర్యలు తీసుకోవాలన్నారు. వారికి విద్య, వైద్యచికిత్స, న్యాయసహాయం ఉచితంగా అందేలా పాటుపడాలన్నారు. 
భాగస్వామ్య సంస్థలు, అధికారుల సమిష్టికృషితో పోక్సో, దిశ వంటి చట్టాలు విజయవంతంగా అమలవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా 8 పోక్సో కోర్టులు పనిచేస్తున్నాయని, త్వరలో మరో 8 రానున్నాయని తెలిపారు. అధికశాతం లైంగికనేరాల కేసుల్లో బాధితుల పరిచయస్తులే నిందితులుగా తేలుతోందని వెల్లడించారు.
పోక్సో చట్టం కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. వీటిని కఠినంగా అమలుజేయాలని రాష్ట్రాలకు లేఖలు కూడా పంపిందని తెలిపారు. పిల్లలపై లైంగిక నేరం జరిగిన పాఠశాల, బాలల సంరక్షణ కేంద్రాల (సిసిఐ) ప్రతినిధులను తప్పనిసరిగా పోలీసులు విచారించాలని సూచించారు. అశ్లీల సమాచారానికి సంబంధించిన వస్తువులు లభ్యమైతే తక్షణమే పోలీసులకు అందించాలన్నారు. నేరాన్ని బాలల ప్రత్యేక పోలీస్ యూనిట్ (SJPU) దృష్టికి తేవాలన్నారు.సైబర్ క్రైమ్ పోర్టల్ లో కూడా  పొందుపరచ వచ్చని వివరించారు. బాలల హక్కులు, వాటి పరిరక్షణ గురించి నిరంతరం బోధిస్తూనే ఉండాలని స్పష్టంచేశారు.
పిల్లలపై లైంగికనేరాల నియంత్రణకు కేంద్రప్రభుత్వం పోక్సో-2012 చట్టం తీసుకొచ్చిందన్నారు. దోషులకు మరణశిక్ష విధించేలా చట్టసవరణ కూడా జరిగిందన్నారు. 
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ 'రాజ్యమహిళా సమ్మాన్' అవార్డు గ్రహీత,  బాలల సంక్షేమ సమితి (సిడబ్ల్యూసి) ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి, సభ్యులు వై.శ్రీనివాసులు, ఎం.నాగరాజు, డిసిపిఓ డా.దాసరి సుబ్రమణ్యం, పలు భాగస్వామ్య శాఖల అధికారులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.