ఉపాధ్యాయపర్వం-17: - రామ్మోహన్ రావు తుమ్మూరి

కొన్ని నిజాలు నమ్మటానికి వీలులేకుండా ఉంటాయి. అలాంటివి నాకు చాలా సార్లు అనుభవైకవేద్యాలు. మనకు తెలియకుండానే మనం చేయబోయే పనికి మనల్ని ఎవరో పురి కొల్పుతారు. దానినే మన వాళ్లు కార్య కారణ సంబం ధం అన్నారు. అసలు కొందరి పరిచయా లు అయినప్పుడు ఊహించలేము. భవిష్యత్తులో వారి పాత్ర మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని. ఇప్పుడు సంధ్యాతటి నుండి సింహావలోకనం చేస్తే అలాంటి వ్యక్తులు సాలభంజికలై దర్శనమిస్తారు. అది చిన్న ప్రయోజన మా పెద్ద ప్రయోజనమా అన్నది కాదు విషయం.ప్రమేయమే ప్రధానం.
   అలా వెనుదిరిగి చూసినప్పుడు ముందు కనిపించేది తిరుమలయ్య గారు.వారు ఆయుర్వేద వైద్యులు.మా కుటుంబానికి బాగా సన్నిహితపరువు. బాపు కన్నా కొంచెం పెద్దవారే కాని వారిరువురి మధ్య మైత్రీ బంధం గొప్పది.
వారికి బాపు ఆర్థిక పరిస్థితి తెలుసు కనుక వారు సర్సిల్కు మిల్లు లో పని చేసే కుమారుని చెవిలో వేశారు. ఆయన వెంటనే స్పందించటం నేను కాగజ్నగర్ రావటం అదంతా ముందే వివరించాను
అయితే దానికంటే ముందు ఇంకో చిన్న గమ్మత్తు జరిగింది.
      1968 లో నేను H.S.C (Higher Secondary certificate) పాసయ్యాను. తరగతులవారీగా చూస్తే అది 11 వ తరగతి.అది కాగానే ఒక సంవత్సరం P.U.C. (Pre-University Certificate),ఆ తరువాత డిగ్రీ మూడేళ్లు.అయితే డిగ్రీ B.Sc.(M.P.C),
B.Sc.(B.P.C),B.A.,B.Com. అని నాలుగు రకాల కోర్సులుండేవి. పై నాలు గింటిలో దేంట్లో చేరాలో పి.యు.సి. లోనే నిర్ణయించుకోవాలి.అప్పట్లో కాలేజీలో మా మేనబావ మధుసూదన్ రావు బయాలజీ సెక్షన్లో డెమాన్స్ట్రేటర్ గా ఉన్నారు.ఆయనకు నేను బి.పి.సి. తీసుకోవాలని ఉండేది. నాకు కూడా అదే ఇంట్రస్టు.లెక్కల్లో నేను అంతంత మాత్రమే కాకుండా జీవశాస్త్రమంటే నాకు స్కూల్‌ లో కూడా ఆసక్తిగా ఉండేవాణ్ని.
సీటు కోసం అప్లై చేసినప్పుడు ఒక వేళ అందులో సీటు దొరకకపోతే కష్టమవు తుందని ముందస్తు జాగ్రత్తగా M.P.C., B.P.C.,రెండు కోర్సులకు అప్లై చేశాను. మాది స్కూల్లో ఆప్షనల్ మ్యాథమెటిక్స్ కనుక మాకు దేనికైనా అప్లై చేసుకునే అవకాశం ఉండేది.బ్రిటిష్ హిస్టరీ ఆప్షనల్ కాలుతున్న వారికి సైన్సు కోర్సుల అవకాశం ఉండేది కాదు. All most all it is decided. B.P.C. చేరవలసిందే. అలా జరిగితే ఈ రోజు నా చరిత్ర ఇలా ఉండేది కాదు.దానికి కారణం చిత్రం మా బాపు మేనత్త కొడుకు ఆయన పేరు కూడా మధుసూదనరావే. ఆయన కొత్తగా హైదరాబాదు నుండి  ఎంప్లాయ్ మెంట్ ఆఫీసుకు బదిలీ అయి వచ్చారు.చదువుకున్న తరువాత ఉద్యోగం చేయాలి కదా!ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుందని అడిగితే, ఆయన M.P.C.అన్నారు. అలా నా భవిష్యత్తు కు ముందే బాటలు ఏర్పడటానికి ఆయన ఒక కారణం. ఎందుకంటే సర్సిల్క్ ఉద్యోగానికి B.SC.
(M.P.C.) క్వాలిఫికేషన్ ప్రాథమిక అర్హత.
    ఇక మళ్లీ  సర్సిల్క్ ఉద్యోగానంతర నిరుద్యోగ పర్వానికి వస్తే ఆవిడ శిశుమందిర్ లో ఉద్యోగం.నేను ప్రొద్దుట పిల్లల్ని స్కూల్‌లో దింపి రావటం, పుస్తకాలు చదవటం ఇంటి ముందున్న జాగాలో మొక్కలు పెంచటం,అన్ని రకాల రిపేరింగు పనులు చేయటం సాయం త్రం కాగానే U.T.C(United Tutorial college)లో ఇంగ్లీషు చెప్పటం. ఆ తరువాత నాటకం రిహార్సల్సు వగైరా.
ప్రపంచంలో Jack of all Master of none కు నా కంటే పెద్ద ఉదాహరణ వేరే ఎవరూ ఉండరు.నేనైతే ఆ సామెత నాకోసమే పుట్టిందనుకొంటాను.మీరు నమ్మరు కాని ఇది చదివే సర్సిల్క్ కాలనీ పాఠకులకు తెలుసు. అదేమిటంటే మిల్లు బందయి నీటికి కష్టమవుతుందని వాకిట్లో పదమూడు అడుగుల లోతు దాకా బావి త్రవ్వి గట్టి నేల కాకపోవడంతో మళ్లీ పూడ్చటం జరిగింది.కుట్టు మిషన్ పాడయితే మొత్తం విప్పి మళ్లీ సెట్ చేయడం,ఇంకా చాలా పనులు చేస్తుంటే వాణ్ని.కొందరి మాటలు జీవితంలో ఎప్పటికీ మరువ లేనివి కొన్ని ఉంటాయి.అలాంటి వాటిలో
మా మేడం వాళ్ల రెండో చెల్లెలు (శ్రీమతి మంజులా రామకృష్ణ,ఈమె వాళ్ల అక్కయ్య కంటే ముందే జరిగిపోయింది) అనే మాట నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తుంది.”బావ అని తలచుకోగానే ఏదో ఒకటి రిపేర్ చేస్తున్నట్లో ఏదో పని చేస్తున్నట్లో రూపమే కళ్లకు కనబడుతుంది”. అదే ఇప్పుడు ఎడతెగకుండా ఫేస్బుక్ తో ఉండటానికి దారి తీసిందేమో.
     ఇలా ఉన్న తరుణంలో ఒకరోజు VSR శర్మ వచ్చి  B.Ed.నోటిఫికేషన్ పడింది అప్లై చేయరాదూ అంటూ వచ్చారు. పనికిరాని పనులు చేయమంటే చేస్తాను కానీ ఇలా పనికి వచ్చే పనులంటే బద్ధకం.నాకు అందుకే ఆయనను నిరాశపరుస్తూ డిగ్రీ చదివి పదిహేనేళ్లు దాటిపోయింది.ఎంట్రన్సులో మనమేం రాస్తాం.వట్టి దండుగ పని అన్నాను. అలా అనగానే ఆయన వెళ్లి పోతే ఆయన శర్మగారు కాదు,ఈ రోజు నేనాయన్ని తలచుకొని మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అవసరం ఏర్పడేదీ కాదు. ఆయన నన్ను వదలకుండా నువ్వు రాస్తే నాకు రాయాలని ఉంది.ఓ రాయి వేసి చూద్దాం.అని బలవంత పెట్టి అప్లికేషన్ తెప్పించేటట్లు చేశారు.అప్లై చేశాం.పరీక్ష రాసాం.1100 ర్యాంకు వచ్చింది.సీటు దొరికే అవకాశాలు తక్కువ.వెయిటింగ్ లిస్ట్ లో ఉంది అన్నారు.ఇక సంవత్సరం వెయిటింగ్ లిస్టులో వచ్చిందా రాలేదా ఎలా తెలుస్తుంది?మనం పోయి తెలుసుకుంటే కదా!మన నాటకాలు మనకున్నాయి.ఆవిడేదో సంపాదిస్తుంది. అలా ఆ సంవత్సరం గడిచింది.అక్కడితోన అయిపోతే కథేముంది.మరుసటి సంవత్సరం మళ్లీ 
బియ్యెడ్ నోటిఫికేషన్ పడింది.పేపరు చదివే అలవాటు లేని మన కెలా తెలుస్తుంది? మళ్లీ శర్మనే తయారు.పేపరు చదవటం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ లేదు. మనది JK మెథడ్.కనుక ఆయనే పేపరుతో సహా వచ్చారు.షరా మామూలే. విధికి నేను ఉపాధ్యాయుడు కావాలని ఎంత ఇంట్రస్టో.ఏదో అందాజాకు టిక్కులు పెడితే 150 ర్యాంకు వచ్చింది.ఇక సీటు రాకుండా ఎక్కడ పోతుంది.ఎక్కడంటే అక్కడే అవకాశం ఉన్నా కాగజ్ నగర్ నుండి వచ్చి పోవడానికి దగ్గరవుతుం దని వరంగల్ కాలేజి ఆప్ ఎడ్యుకేషన్ లో చేరాను. పాపం నాకు వచ్చింది కాని శర్మకు రాలేదు.అలా నా బియ్యెడ్ కోర్స్ కోసమే ఆయన బందరు నుండి సర్సిల్క్ లో చేరారనుకుంటా.బాగా సరదాగా జోకులేసుకుని మాట్లాడుకునే అతి తక్కువ మిత్రుల్లో ఆయనొకరు.ఇంకో రహస్యం చెప్పి ఈ రోజుకి సశేషం అంటాను.అందరూ బియ్యెడ్ ఎంట్రెన్సు టెస్టుకు ప్రిపేరవుతారు కదా! మనం (Royal we)అలాంటి పని చెయ్య లేదు సరికదా పరీక్ష రాయడానికి దక్షిణ్ కు బయలు దేరేముందు గంట సేపు హాల్ టికటు వెతకడానికే సరిపోయింది. అందుకే నాకు ‘సహసా విధధీత నక్రియాం’ బాగా నచ్చుతుంది(సశేషం)
VSR Sharma