197.మరో ప్రథమ బహుమతి::బెలగాం భీమేశ్వరరావు,9989537835.

2015 లో శ్రీవాణి పలుకు బాలల మాస పత్రిక
వారు కథలపోటీ నిర్వహించారు. విజేత అనే
కథను పంపగా వారు ఎన్నుకున్న మొదటి 5 కథలలో అది నిలిచింది. ఆ 5 కథలకు ప్రథమ
బహుమతి స్థాయిని ప్రకటించారు. ఆ కథల్లో
'దారిన పోయిన దానయ్య' వాణిశ్రీ గారు రాశారు.
'దేవుళ్ళు'కథ దాసరి వెంకట రమణ గారు రాశారు.
'భూమ్మీదే స్వర్గం, నరకం' వసుంధర గారు రాశారు.'ఆర్భాటంలో అగచాట్లు' బి.వి.పట్నాయక్
గారు రాశారు.'విజేత'కథ నేను రాశాను.ఈ ఐదు
కథలు 2015 జూన్ నెల శ్రీవాణి పలుకులో
ఒకేసారి వచ్చాయి. నా కథ విజేత సంక్షిప్తంగా...
వేదగిరి రాజ్యాన్ని మాధవ వర్మ పరిపాలిస్తుండే
వాడు.అతడికి ఒకే ఒక కుమార్తె.పేరు సుజాత.
పెళ్ళీడు వచ్చింది. హాయిగా రోజులు గడుస్తున్న
సమయంలో వేదపురికి దొంగల బెడద వచ్చి
పడింది. రక్షక భటులు అదుపు చెయ్యలేకపోయారు. దొంగలు విజృంభించారు.
రాజు అసంతృప్తికి లోనయ్యాడు.ప్రజల సంపదకు
రక్షణ కలిగించనప్పుడు మనం ప్రజలకు, పొరుగు
రాజ్యాలకు అలుసవుతామని మంత్రి వద్ద 
వాపోయాడు.మంత్రి "లక్షలాది ప్రజలున్న మన
రాజ్యంలో దొంగలను అరికట్టే వీరులు చతురులు
ఉండవచ్చు.మనం ఆ దిశగా ఆలోచించడం
మంచిది"అని తన అభిప్రాయం వెలిబుచ్చాడు.
రాజుకు మంత్రి సలహా నచ్చింది."అటువంటి 
మొనగాడే తటస్థిస్తే నా కుమార్తెనిచ్చి పెండ్లి
చేస్తాను"అన్నాడు. రాజ్యంలో చాటించండని
ఆజ్ఞాపించాడు. ప్రకటనకు స్పందించి ఎందరో
యువకులు ముందుకు వచ్చారు.ఆ ప్రయత్నం లో
కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి కొందరు
విఫలులై ఇంటిదారి పట్టారు.ఇద్దరు యువకులు
మాత్రం విజయం సాధించారు.వ్యూహాత్మక 
ఎత్తుగడలతో దొంగలందరిని బంధించగలిగారు.
రాజు ఆ ఇద్దరు యువకుల ధైర్యసాహసాలను
ప్రశంసించి దొంగల ముఠాలను చెరసాలలో
పెట్టించాడు.ఆ తరువాత రాజులో ఆరంభమయింది ఆందోళన. ఆ ఇద్దరు యువకుల్లో రాకుమారిని ఎవరికివ్వాలో అర్థం
కాలేదు. ఇద్దరు యువకులు అందంలోను వీరత్వం
లోను ఒకరికొకరు తీసిపోరు.రాజు అయోమయంలో పడ్డాడు.రాజు ఆందోళనను
గమనించాడు మంత్రి.అతడప్పుడు యువకులతో "మీ శక్తి యుక్తులు సమానం.సంశయం లేదు.
ఇక పాలన పట్ల మీకు గల అభిప్రాయం తెలుసుకొని విజేతను నిర్ణయిస్తాం"అన్నాడు .
ఇద్దరు యువకులు తల పంకించారు.ఒకరు
నాగరాజు. మరొకరు రవితేజ. మర్నాడు  సభకు రమ్మని ముందుగా నాగరాజుకు కబురందింది.
నాగరాజు సభకు హాజరయ్యాడు.అతడిని
చూసి మంత్రి"మాకు అప్పజెప్పిన దొంగలను
ఏం చేయమంటావు?"అని అడిగాడు. వెంటనే
నాగరాజు " దొంగలకు ఉరిశిక్షే సరైనది.అప్పుడే
రాజ్యంలో దొంగతనం చేయడానికి ఎవరూ
సాహసించరు! " అని సమాధానమిచ్చాడు.
తరువాత రవితేజను సభకు రమ్మనమని కబురందింది. నాగరాజుకు అడిగిన ప్రశ్నే
రవితేజను అడిగాడు మంత్రి. సభలో అందరూ
రవితేజ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు.
మంత్రి అడిగిన ప్రశ్నను ఆకళింపు చేసుకొని రవితేజ గొంతు విప్పాడు." సమాజంలో ఒక వ్యక్తి
దొంగగా మారడానికి కారణాలెన్నో ప్రభావం 
చూపుతాయి.ఆకలి తీర్చుకోడానికి కొందరు దొంగ
లవుతారు.మరికొందరు నైతిక విలువలకు కట్టుబడక దొంగలవుతారు.ఈర్ష్యతో పరుల నాశనాన్ని కోరుతూ కొందరు దొంగలవుతారు.
మరి కొందరు విలాస జీవితం గడపాలనే ఆకాంక్ష తో అక్రమ సంపాదన చేయడానికి నీచమైన దొంగ
వృత్తిని ఎంచుకుంటారు.ఇలా కారణాలెన్నో
మనకు కనిపిస్తాయి!"అప్పుడు మంత్రి దొంగలకు
ఉరిశిక్ష అమలు చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. రవితేజ " పరిస్థితులు చక్కదిద్దకుండా
పట్టుబడ్డ దొంగలను ఉరేసుకుపోతూంటే సమాజంలో జనాభా తగ్గుతుందే కాని నేరాలూ
దొంగతనాలూ మాత్రం ఆగవు!"అన్నాడు. రాజు
అప్పుడు కలుగజేసుకొని పరిస్థితులు ఎలా 
చక్కదిద్దాలో చెప్పగలవా అని అడిగాడు.రవితేజ
స్పందిస్తూ" ప్రజల ఆకలి తీరే మార్గం చూపాలి.
నైతిక విలువలు బాల్యం నుంచే నేర్పాలి.యువతకు ఉపాధి చూపాలి.తగిన జీతభత్యాలివ్వాలి.శ్రమవిలువ సమాజంలో ఎంత
గౌరవప్రదమైనదో చాటి చెప్పాలి.ఇటువంటి మార్గాలను అనుసరించకుండా దొంగలను ఉరితియ్యాలనుకోడం సముచితం కాదు"అని
అన్నాడు. రవితేజ మాటలకు రాకుమార్తె స్పందించి ఆనందంతో కరతాళధ్వనులు చేసింది.
రాజు చిరునవ్వు నవ్వాడు. మంత్రి రాజు అనుమతితో సభనుద్దేశించి" రవితేజుని ఆలోచనా
విధానం బాగుంది. రాకుమారికి వరుడిగా, రాజ్యానికి వారసుడిగా అతడికే అర్హత ఉంది!"అని
ప్రకటించాడు.వెనువెంటనే మంత్రి రెండవ విజేత
అయిన నాగరాజు శక్తియుక్తులను కూడా 
ప్రశంసించాడు."నాగరాజు సమ్మతిస్తే అతడికి
నా కుమార్తె నిచ్చి పెళ్లి చెయ్యగలను"అన్నాడు.
నాగరాజు అంగీకరించాడు.ఒకే ముహూర్తాన
రెండు పెళ్ళిళ్ళు జరిగిపోయాయి.ఇద్దరు యువకుల సహాయ సహకారాలతో వేదపురి 
రాజ్యం అరాచకాలకు దూరమయింది.ఆ రాజ్యానికి తదుపరి రాజెవరో, మంత్రెవరో వేరే
ఎంచుకొనే అవసరం లేకుండా పోయింది.(సశేషం)