మోక్షకామి:-- జగదీశ్ యామిజాల

చలంగారికి ఇంటర్వ్యూలు, సన్మానాలు, సభలూ వంటివి ఎప్పుడూ ఇష్టం లేదు. ఓమారు శ్రీ వాత్సవ గారు ఒక సాహిత్య సభకు రావలసిందిగా చలంగారిని కోరగా చలంగారు ఇచ్చిన సమాధానం....


"ముందు మీ హృదయాల్లో సభలు జరుపుకోండి" అని.


జవహర్ గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చలంగారితో అనేక విషయాలపై మాట్లాడారు. 


జవహర్ గారి ప్రశ్నలకు చలంగారు చెప్పిన జవాబులలోంచి కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాను.



"......ఇవన్నీ పుస్తకాల్లో రాశాను జవహర్. కాని పూర్తిగా చదవరు. society అంటే వుత్త myth. పొరుగు వాళ్ళని చూసే భయపడే వాళ్ళ పెనుభూతం.


Society కాదు, నువ్వు మారు. అంటే వినరు. Man perfect కావాలని, అవుతాడని imagine చేశాను. మంచి అంటే అంతరాత్మనే అడగమంటాను.


...అవును చలం ఎవడో తెలుసుకోడానికే ఈ అరుణాచలం వొచ్చాడు. Who am I అంటూ.....



మోక్షకామి అంటే అర్థం చూడు. మోక్షాన్ని కామించడం. మోక్షమంటే కామం నించి విముక్తి. కామం నుంచి విముక్తిని కామించడం.


కామి ఐనవాడు కామి ఐన కొద్దీ ఇంకా కామిజాతోనే వుంటాడు. అనుభవించడం వల్ల కోర్కె ఆరదు. ఇంకా మండుతుంది. శరీరం ముసలిదైనా ఇంకా వీలులేదే అని ఏడుస్తాడు. జ్ఞాపకాలతో బాధ పడతాడు. కొందరు కోతలు కోసుకుంటూ బతుకుతారు.....


అసలు ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళెవరూ కాములు కారు. చాలా మంది సహజ వైరాగ్యంతోనే పుడతారు. కామి ఐన వాళ్ళల్లో కూడా అంతకన్న గొప్ప సుఖాన్ని తెలుసుకోవడం వల్ల, కోర్కెల నించి మనసుని సులభంగా తిప్పుకుంటాడు.


ఏ గొప్ప జ్ఞానీ యింద్రియ సుఖభోగాన్ని తిట్టడు. లంపటత్వాన్ని తిడతాడు. లంపటత్వం వల్ల అనుభవించే శక్తి పోతుంది. ఇంక సుఖం రాదు. ఏ కాంతికీ, ధర్మానికీ అంధుడౌతాడు.


ఈ తత్వాల నీతి బోధనలు, భగవద్గీత ఉపన్యాసాలూ ఏమీ రాని వారి నించి వస్తాయి. ఊరికే బోధించడమే. ఆ బోధ ఎంత విన్నా విన్న వారికేం రాదు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక మార్గం జన్మల మీద పని. చాలా గట్టి ఇనుప తలుపులు గట్టిగా గడియలు వేసి బిగించినవి అడ్డమున్నాయి.


ఆధ్యాత్మిక స్థితి దొరకడం అరుదు. అట్లాంటప్పుడు సామాన్య ప్రజల్ని అనుభవించే సుఖాలని తిట్టడం – ఏ జ్ఞానీ చెయ్యడు. ఇంత కన్న అతీతమైన సుఖముంది, దాని వేపు చూడమంటాడు.


మోక్షమంటే అర్పణ. అన్ని బంధాలూ కోర్కెలూ అర్పించేస్తే గాని యేమీ దొరకదు. తనకేం నష్టం లేకండా యేది దొరుకుతుందా అనే cowards కి మోక్షమా...వాళ్ళూ కాములేనా. తనని తాను మరచి లాభనష్టాల్నీ లెక్క చూడక తెగించి దూకేవాడు కామి. ఈశ్వరుడి ముందు తాను అనేది లేకండా కరిగిపోయే వాడికే మోక్షం. అట్లాగే దేశానికో కామానికో స్త్రీకో ధర్మానికో బీదలకో తాను, తన క్షేమం అని యోచించక అర్పించుకునే కామికే మోక్షం ఏ నాటికన్నా.


-------------


గమనిక


కొంత భాగమే ఇచ్చానిక్కడ.