బాలసాహిత్యం---56(1)-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి ఫోన్ : 7013660252.

బి వి పట్నాయక్ గారు పూర్తి పేరు బెలగాం వెంకటేశ్వర పట్నాయక్. అయినా బి.వి. పట్నాయక్ గానే అందరిచే పిలవబడుతుంటారు. ప్రస్తుతం వీరు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తాళ్శబురిడి, పార్వతీపురం మండలం నందు గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా  పనిచేస్తున్నారు. బి. వి. పట్నాయక్ గారు 17 డిసెంబర్ 1965న పార్వతీపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు బెలగాం రాజేశ్వరిగా‌రు , గంగారామ్ గారలు. పట్నాయక్ గారికి తొలి గురువు తన తండ్రి గారైన బెలగాం గంగారామ్ గారే ! దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గంగారాం గారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బెలగాం భీమేశ్వరరావు గారు, బెలగాం కేశవ రావు గారు బి వి పట్నాయక్ గారు గంగా రామ్ గారి కుమారులే ! ఈ ముగ్గురు బాల సాహిత్యవేత్తలగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఆ తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అని మనం భావించాలి. వీరు ముగ్గురూ ఎంతో సౌమ్యులు. ఈనాటి సమాజానికి అనుగుణంగా మెలిగే వారే ! ఉపాధ్యాయులుగా, బాల సాహిత్య రచయితలగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారే ! బి వి పట్నాయక్ గారు తన ప్రాథమిక విద్యను మున్సిపల్ పాఠశాల చింతాడ వారి వీధి నందు, ఉన్నత పాఠశాల విద్య ఆర్.సి.యం సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాల నందు,. ఇంటర్మీడియట్ విద్య ప్రభుత్వ జూనియర్ కాలేజీ పార్వతీపురం నందు అభ్యసించారు. 1984 - 85 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ఏలూరు నందు శిక్షణ పొందియున్నారు. 1989 సంవత్సరం సెప్టెంబర్ 25న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ ఉద్యోగం పొంది ఉన్నారు. ఆ తర్వాత బి ఎ(చరిత్ర), బిఏ (గణితం) ఎమ్.ఏ చరిత్ర, బి.ఇడిలను ప్రైవేటుగా చదివారు.బి వి పట్నాయక్ గారు ఇన్ని డిగ్రీలను ప్రైవేటుగా చదివి పొందడం వారి మేధాశక్తిని, పట్టుదలను మనం మెచ్చుకోవాల్సిందే ! బాల్యము నుండీ 
వీరికి కథల పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. పాఠశాల లో చదువుతున్నప్పుడు  పాఠ్య పుస్తకాలతో పాటు కథల పుస్తకాలను కూడా సంచిలో ఉంచి పట్నాయక్ గారు క్లాసుకు
తీసుకు వెళ్ళి లీజర్ పీరియడ్స్ లో చదువుతుండేవారు. బి.వి. పట్నాయక్ గారు నివాసం ఉంటున్న ఇల్లే ఒక గ్రంథాలయంగా ఉండేదని చూసినవారు చెబుతుంటారు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులలో ఒకనాడు కెమిస్ట్రీ సబ్జెక్టు చదువుతుండగా ఒకపక్క గుడ్లగూబ, మరోపక్క కోయిల అరుపులు పట్నాయక్ గారికి  వినిపించసాగాయి. 
ఆ అరుపులను విన్న తనకు మరి చదవాలనిపించలేదు. తన  మైండ్ ఆ పక్షులవైపు డైవర్ట్ అయిపోయింది.     గుడ్లగూబ , కోయిలపై  అందరికీ ఉన్న నమ్మకాలు తన మనసులో మెదిలాయి. వెంటనే కథ రాయాలనిపించింది. చిత్తునోట్స్ తీసి ఒక కథ వ్రాయడం ప్రారంభించి  దానికి
 “ తెలివైన కోయిల ” అనే టైటిల్ ను కూడా పెట్టి కథ  
 "బాలజ్యోతి" మాసపత్రికకి పంపగా నెల రోజులలో మే 1982 సంచికలో ప్రచురించి 20 రూపాయలు పారితోషకం కూడా పంపించారు. చాలా ఆనందం అనిపించింది. అప్పటి నుంచి కథలు రాయడం అధికంగా చేసారు. అంతేకాదు. ఇతరులు రాసిన కథలను కూడా చాలా చదివేవారు.1985 సంవత్సరం 25 తేదీ నుండి 11 వారాల పాటు ఆంధ్రప్రభ వీక్లీ లో బాలప్రభ  శీర్షిక నందు " హంసనారి" అను పక్షుల సీరియల్ ప్రచురణ జరిగింది. అప్పటినుండి అనేక కథలు, గేయాలు, గేయ కథలు, వ్యాసాలు పొడుపు కథలు, సీరియల్స్ లాంటివి సుమారు1000 కి బడిన రచనలు పట్నాయక్ గారివి ప్రచురింపబడ్డాయి. పట్నాయక్ గారు అప్పుడప్పుడు సరదాగా కార్టూన్ లు  కూడా వేసేవారు. అవి వార్త ఆంధ్ర పత్రిక, ఆంధ్ర భూమి, భారతి  మొదలగు పత్రికలో ప్రచురింపబడ్డాయి. పట్నాయక్ గారి కథలన్నీ బాలలు చదువుకునేందుకు వీలుగా సరళ శైలిలో ఉంటాయి. తన కథల ముగింపులో కొసమెరుపు తప్పనిసరిగా ఉంటుందని
పట్నాయక్ గారు చెబుతారు. అది ఎంతవరకూ నిజమో తెలుసుకోవాలంటే పట్నాయక్ గారి కథలు చదవ వలసిందే.( సశేషం )