బాలసాహిత్యం---56(2);- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి:ఫోన్ : 7013660252.

బి.వి. పట్నాయక్ గారు నివసిస్తున్న ఇల్లు గ్రంథాలయంలా ఉండేదని చెబుతుంటారు. దీనికి కారణం పట్నాయక్ గారు విద్యార్థి దశలో ఉన్న కాలంలోనే వారి సోదరుడు భీమేశ్వరరావుగారు రచనలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో బాల సాహిత్య పుస్తకాలు కోకొల్లలుగా ఇంట్లో లభించేవి. అవి చదవడం వలన బాల సాహిత్యం పై మక్కువ ఏర్పడింది.పిల్లలకు కథ చెప్పడం అంటే పట్నాయక్ గారికి చాలా ఇష్టం. పిల్లలు చదువులో ఒత్తిడిని ఎదుర్కొనే సందర్భాన్ని గుర్తించినప్పుడు వారి ఒత్తిడిని అధిగమించే నిమిత్తం వారు ఒక కొత్త కథను అల్లి పిల్లలకు చెబుతారు. కథలో కొత్తదనం కోసం పిల్లలతో చర్చించి కథను తయారు చేస్తారు.వీరు రాసిన కథలో చాలా వరకు ఇటువంటి కథలే.
ఇప్పటి వరకూ చందమామ, బొమ్మరిల్లు, బుజ్జాయి, నాని, బాలమిత్ర, చిన్నారి, చిన్నారి లోకం, జాబిల్లి , సప్తగిరి, బాలబాట మొదలగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. చందమామలో " రైతే రాజు" అనే కథను ప్రచురించి ఆ పత్రిక సంపాదకులవారు ఆ కథకు ప్రత్యేక బాక్స్ ను ఏర్పాటు చేసి ఆ కథపై కామెంట్ ను రాసి బి.వి.పట్నాయక్ గారిని ప్రశంసించారు. ఇది వారి జీవితంలో మరపురాని సంఘటనగా భావిస్తారు. ఈనాడు హాయ్ బుజ్జిలో వీరు వ్రాసిన 75 కథలు ప్రచురింపబడ్డాయి. మంచిపల్లి వారు నిర్వహించిన  కథల పోటీలో పట్నాయక్ గారి కథకు ప్రత్యేక ప్రశంస బహుమతి ఇచ్చి గొల్లపూడి మారుతీరావు గారిచే సన్మానింపబడ్డారు.  సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన కథల సంకలనంలో “స్వార్థ జీవి” అను కథను ప్రచురించారు. ఇప్పటివరకూ పట్నాయక్ గారి పుస్తకాలు 11 వరకు విడుదల య్యాయి. వాటిలో కొన్ని పుస్తకాలు--1. జలకన్య.( జానపద నవల) 2. పాలనా రహస్యం (కథల సంపుటి)  3. కొంగ  ఎత్తు- నక్క చిత్తు 4. పిల్లకోతి సింగారం- తల్లి కోతి మమకారం. ఇవి గాక  పొలంబడి వాచకాలకు గేయాలు కూడా రాశారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు వీరిచే రెండు వ్యవసాయ వాచకాలు కూడా  వ్రాయించి ప్రచురణ చేశారు. ఇక పట్నాయక్ గారి సన్మానాలు విషయానికొస్తే హిమకర పబ్లికేషన్స్ వారు, బాలబాట వారు, విశాఖ సంస్కృతివారు,
మంచి పల్లి వారు, చైతన్య భారతి గజపతినగరం వారు, అక్షర విజయం సందర్భంగా మండల స్థాయి, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి ద్వారా వివిధ కార్యశాలలలో పాల్గొన్న సందర్భంగా ఉపాధ్యాయునిగా ,బాల సాహిత్య రచయితగా సన్మానాలు పొందారు. వీరి కథలు పత్రికలలో ప్రచురణ అయ్యేటప్పుడు వాటిని ముందుగా వీరి విద్యార్థులు చదివేటప్పుడు పట్నాయక్ గారికి ఫోన్ చేసేవారు. ఆ సందర్భంలో పట్నాయక్ గారి ఆనందానికి అవధులు ఉండేవి కావు. విజయ నగరం డైట్ వారు నిర్వహించిన " బాలల విజయం" పత్రిక కార్యశాలలో సంపాదక వర్గ సభ్యునిగా ఉండేవారు. వీరు కథా రచయితగానే గాక, గేయ రచయితగా కూడా రుచులు చూపించాలనే కోరిక 
తో  " నా కాలిమువ్వ” అనే గేయ సంపుటిని రాశారు. పొలం బడి వాచకాలకు గేయాలు కూడా రాశారు. 'కాలి మువ్వ' అనే గేయ సంపుటిలో కొన్ని గేయాలను చూద్దాం !  అరటి పండు గురించి పిల్లలకు చెబుతూ " అదిగదిగో అరటిపండు/ చక్కనైన పసుపురంగు/చక్కెరలా తియ్యగుండు/తింటేనే బలం మెండు" //రోజుకొక్క అరటిపండు/తిని చూడు పసందుగా/ పొందగలవు ఆరోగ్యం/ అదే నీకు మహా భాగ్యం// అని అంటారు. ఇక పట్నాయక్ గారు  మతం గురించి రాస్తూ - “ మతమంటే మంచి రా/ మానవతకు కంచెరా/ పరులకొరకు బతికేటి/ పదిలమైన తరువురా// " బలం కోసం" అనే గేయాన్ని చూద్దాం ! " గంప కింద కోడి పెట్ట వచ్చి చేరింది/ గుట్టుగాను ఒక గుడ్డు పెట్టి వెళ్ళింది/ గుడ్డు తీసి అక్కేమో అట్టు పోసింది/ బలం కోసం అందరికీ పంచి పెట్టింది//- అంటారు. శక్తి- యుక్తి అనే గేయంలో  “ గర్వం అనే మదము చేత/ విర్రవీగు వారికెపుడు/ పరాభవం కలుగుచుండు/ పరాజయం తోడుగుండు// అంటారు. ఇలా పట్నాయక్ గారు ఎన్నో గేయాలను, గేయ కథలను రాసి ఉన్నారు. వీరి రచనలు బాలలకు ఎంతో ఉపయుక్త కరంగా ఉంటాయి.పెద్దలు కూడా వీటిని చదువ వలసిందే! కొసమెరుపుగా మనం చెప్పుకో వలసిందేమిటంటే -- బి వి పట్నాయక్ గారి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి  ప్రస్తుతం పరిశోధన చేస్తున్నారు. ( సశేషం )