మట్టిలో మాణిక్యం పిల్లల కోసం-- కందర్ప (వెంకట సత్యనారాయణ) మూర్తి , హైదరాబాదు

       ఊళ్లో జరుగు బాటు కాక పట్నం బాట పట్టిన సింహాద్రికి
చిన్న ఇనప సామాన్ల దుకాణంలో పని దొరికింది.
     పెళ్లాం దేవుడమ్మ ,  ఐదేళ్ల కొడుకు నారాయణతో గుడిసె అద్దెకు తీసుకుని నివాశం ఉంటున్నాడు. దేవుడమ్మ అపార్టుమెంట్లలో పనులు చేసుకుంటోంది.
     వెళ్లేటప్పుడు నారాయణను వెంట పెట్టుకుని అక్కడున్న దేవుడి
గుడి దగ్గర వదిలి పనికి పోయి వచ్చేటప్పుడు కూడా తీసుకు వస్తుంది. సింహాద్రి పని చేసే దుకాణం నుంచి వచ్చేటప్పటికి
బాగా రాత్రవుతుంది. నారాయణ బువ్వ తిని తొంగుంటాడు.
      గుడి దగ్గర కూర్చున్నప్పుడు గుడి పూజారి గారు మిగిలిన
దేవుడి ప్రసాదం తినమని నారాయణకి పెట్టేవారు.
      నారాయణ గుడి చుట్టూ ఉన్న మొక్కలకి గొట్టంతో నీళ్లు పెట్టడం చీపురు పెట్టి పరిసరాలు శుభ్రం చేస్తూంటాడు.
అప్పుడప్పుడు దగ్గరగా ఉన్న పూజారి గారి ఇంటికెళ్లి పూజా వస్తువులు  పువ్వులు తెచ్చి సహాయం చేస్తున్నాడు.
  పిల్లలు    రంగు రంగుల యూనిఫారాలతో వీపు మీద పుస్తకాల బేగులతో కబుర్లు చెప్పుకుంటూ వెళ్లడం ఆశక్తిగా చూస్తుంటాడు
నారాయణ. కాని అమ్మ నన్ను బడికి  పోనీదని మనసులో
అనుకుంటూంటాడు.
     అది గమనించిన పూజారి గారు దేవుడమ్మతో నారాయణని
బడికి  పంపమంటే , మాకెలా  సాగుద్ది బాబూ! కూలీ నాలీ సేసుకుని బతికే  మాబాటోళ్లకు సదువు లెందుకు.ఆడి సదవుకి
పుత్తకాలు సంచులు బట్టలకి డబ్బులెక్కడి నుంచి తేవాల.గుడిసె అద్దె తిండికీ మా సంపాదన సరిపోతాదని తన
అశక్తత చెప్పింది.
     చురుకైన తెలివైన వినయ విధేయతలు కలిగిన నారాయణ
లాంటి వాడికి చదువు అబ్బితే ఎంతో ప్రయోజకుడౌతాడని తలిచి  పూజారి గుడి కమిటీ మేనేజ్మెంట్ వారి సాయంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశం కల్పించి కావల్సిన పుస్తకాలు బేగ్ సమకూర్చేరు
   చురుకైన నారాయణకి  చదువులో ఆశక్తి చూసిన
అధ్యాపకులు వాడి పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరిచే వారు.
వాడికి గుడిసెలో ఉంటే చదువు సక్రమంగా సాగదని గుడి ప్రాంగణంలో నివాశం కల్పించారు గుడి కమిటీ వారు.
          నారాయణ తన వినయ విధేయతలతో కమిటీ వారి
మెప్పు పొంది  ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రవేశం పొంది
 చదువుతో పాటు ఆటపాటలలో తన మేధస్సు కనబరుస్తున్నాడు.
   పూజారి గారు వాడికి తిండి సదుపాయం వారి ఇంటి వద్దే ఏర్పాటు చేసారు. ఇప్పుడు గుడిసెలోని నారాయణ కాదు.
స్మార్టుగా చక్కని భాష ఉచ్ఛారణ మాట తీరుతో చూసే వారికి
సదభిప్రాయం కలిగేలా ఉన్నాడు.  రోజూ దేవుడమ్మ ఇళ్లలో పనికెళ్లేటప్పుడు కొడుకు ఉన్నతిని చూసి మురిసిపోయేది    గుడి కమిటీ వారి మన్ననలు పొందుతున్నాడు నారాయణ. చదువుకుంటూనే గుడి పరిసరాలు చుట్టూ పూలమొక్కలు
పైంటింగులతో గుడి గోడల మీద ఆధ్యాత్మిక సందేశాలు దేవుళ్ల
బొమ్మలతో  అందం తెచ్చాడు. భక్తుల రాక పెరిగి హుండీ ఆదాయం పెరిగింది.
       గుడిలో ఉంటూనే నారాయణ స్కాలర్ షిప్ సంపాదించి
డిగ్రీ పూర్తి చేసాడు. గుడి కమిటీ వారి ప్రోత్సాహంతో బి. ఎడ్
 చదివి తను చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమితుడయాడు. తండ్రిని తల్లినీ పనులు మాన్పించి చక్కటి అద్దె ఇంట్లో నివాశముంటున్నాడు.తనలాంటి నిరక్షరాస్యుల్ని
 చేరదీసి వారికి విధ్యాబుద్దులు మంచి నడవడితో తీర్చిదిద్దుతున్నాడు.
       గుడిసెలో నిరక్షరాస్యుడిగా జులాయిగా తిరిగే నారాయణ లాంటి  మట్టిలో మాణిక్యాల్ని  మెరుగు పెడితే  సమాజానికి ఎంతో ఉపయోగ పడగలరని  నిర్ధారణ అయింది.
                       *                *                 *


             .