అమ్మ మాట ( గేయ కథ):- దార్ల బుజ్జిబాబు

"బడికెళ్ళనోయమ్మ
 బడికెళ్లనూ నేను
బడికెళితే మాస్టారూ
బెత్తంతో కొడతారు.


బెత్తంతో కోడితేనూ
బూరెలయ్యే చెయ్యి 
జల జలా కళ్లేంట
జారినూ కన్నీళ్లు "


"వద్ధయ్య ఓ నాన్నా
బడికొద్దు నీవు
పొద్దున్నే మా వెంట 
పనికొద్దుగాని


పనికి రానేయమ్మ 
పని చేయలేను
పని చేస్తే చేతులు
బొబ్బలెక్కెను."


"బడికొద్దు,పనికొద్దు 
నా బుజ్జి నాన్న 
ఇంటి ముందే వుండి
తతయ్యనూ చూడూ"


"తాతనసలే చూడ
ఓయమ్మ నాయమ్మ
చుట్ట పొగతో నన్ను
చంపి తింటాడు."


"బడిలేదు,పనిలేదు
తాతనసలే చూడవ్
మరి ఏమి చేస్తావు
ఓ బుజ్జి కన్నా "


"బాజారుకెళతాను
గోళీలు ఆడతాను 
జేబు నిండా గెలిచి 
దాచుకుంటాను"


"ఆటలాడావంటే 
మాలాగే ఉంటావు
మీ నాన్న లాగానే 
అరకగడతావు


ఓ మాట చెబుతాను 
బుద్ధిగా వింటావా?
నా మాట వింటేను
గొప్పగా ఉంటావు"


"ఆ మాట చప్పవే 
తొందరగా చెప్పు.
గోళీల ఆటకు
పొద్దెక్కుతున్నాది"


"పుస్తకాలను పట్టీ
బడికెళ్ళు కన్నా
కష్టపడితే నీవు 
కాలక్టరువే అవుతావు


అరకదున్నోడి కొడుకు
కారెక్కినాడంటూ 
వూర్లోని వారంతా
చెవులు కొరికేరు?"


"కష్టమైన సరే
బడికి పోతానే
పంతుళ్ల దెబ్బలను
ఓర్చుకుంటానే 


కలక్టరునే అయ్యి
కారులో వస్తానే
నీ మాట నిలబెడత
ఇప్పుడే బడికెళతా!"