ముఖం తళతళలాడుతూ మెరిసిపోవాలంటే... పి . కమలాకర్ రావు .

కస్తూరి పసుపు కమ్మని సువాసనను ఇచ్చే పరిమళ ద్రవ్యం. కొన్ని కస్తూరి పసుపు కొమ్ములను తెచ్చి దంచి మెత్తగా పొడి చేసి మీగడలో కొద్దిగా కస్తూరి పసుపు వేసి ఆ రెండింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఒక అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. మెత్తని టవల్తో ముఖంపైన ఉన్న తడిని అద్దుకోవాలి. ముఖంపైన ఉన్న నల్ల మచ్చలు, కంటి క్రింద ఉన్న నల్లని వలయాలు పోయి ముఖం కాంతివంతంగా తళ  తళ  లాడుతూ మెరుస్తుంది.
కొన్ని క్యాబేజీ ముక్కల్ని ముద్దగా దంచి అందులో కొద్దిగా పెరుగు వేసి, నిమ్మరసం పిండి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఒక అరగంట తర్వాత ముఖాన్ని కడిగి వేయాలి. ముఖంపైన ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
కీరదోసకాయ గుజ్జులో కొద్దిగా అతిమధురం పొడి మరియు వట్టి వేర్ల పొడి కలిపి బాగా గిలకొట్టి ముఖానికి పట్టించాలి. ఒక అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. వట్టివేళ్ళు కూడా మంచి పరిమళంతో కమ్మని సువాసనను వెదజల్లుతూ ఉంటాయి.  బజార్లలో బ్యూటీ పార్లర్ పేరుతో చాలా డబ్బులు దండుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో  మనం మన ఇంట్లోనే ఈ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి ఫేస్ ప్యాక్ లు వేసుకొని మన ముఖాలను ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. మన యువతరం ఇలాంటివి నేర్చుకొని, ఉపయోగించుకోవచ్చు. డబ్బు వృధా కాకుండా కాపాడుకోవచ్చు.