నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు: - ఎం. బిందు మాధవి

నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు
బయట కుక్క చేత భంగ పడును
స్థాన బలిమి కాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ"'వినయ్' పేరులో తప్ప అణుమాత్రం కూడా వినయం లేని పిల్లవాడు.
తల్లిదండ్రుల గారాబం కొంతా, పుటకతీరు కొంతా!


చెల్లి పింకీని గిల్లి ఏడిపించటం, అయిన దానికి, కాని దానికీ తల్లితో పేచీ పెట్టటం అతని దిన చర్యలో భాగాలు.


తండ్రి ఆఫీస్ పనిలో ఎప్పుడూ బిజీ. వినయ్ గురించి పట్టించుకునే ఖాళీ ఉండేది కాదు. ఇలా పదో క్లాస్ దాకా "ఆడింది ఆట పాడింది పదం" లాగా జరిగిపోయింది.


వినయ్ జీవితంలో మంచి ఉచ్చ స్థితికి వెళ్ళాలంటే ఈ సమయంలో కొంత క్రమశిక్షణ అవసరం అనుకుని, అతని తల్లి సూర్యప్రభ, వినయ్ ని తన అక్కగారి ఇంటి దగ్గర పెట్టి చదివించాలనుకుని, ఆ మాటే భర్త తో చెప్పి ఒప్పించింది.


సూర్యప్రభ బావ 'రాజేష్' కొన్నాళ్ళు మిలిటరీ లో పని చేసి వచ్చాడు. ఇంట్లో ప్రతి విషయంలోను కొన్ని ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలని కోరుకునే వ్యక్తి.


వినయ్ ఇంటర్మీడియెట్ చదవటానికి పెద్దమ్మ ఇంటికి అయిష్టంగానే వెళ్ళాడు.
పెద్దమ్మ ఆప్యాయంగానే చూసినా తన తల్లి దగ్గర ఉన్న ఆట విడుపు అక్కడ సహజంగానే ఉండదని గ్రహించాడు.


అందులోను పెదనాన్నగారు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులందరు నిశ్శబ్దంగా భోజనం చేసి వెళ్ళవలసిందే. ఈ పదార్ధం నాకు సహించదు, అందులో పులుపు ఎక్కువయింది, ఈ పూట ఇది తినను లాంటి పిచ్చి వేషాలకి అవకాశాలు ఉండవు.


చదువైనా, ఆహార విహారాలైనా ఒక పద్ధతిలో ఉండ వలసిందే!


వినయ్, మొదట్లో నీళ్ళల్లో నించి బయటపడ్డ చేప లాగా ఊపిరి సలపక గిలగిల్లాడాడు. నెమ్మదిగా అలవాటు పడ్డాడు.


సెలవలిచ్చారని నెల రోజులు తల్లిదండ్రులదగ్గర ఉండటానికి వచ్చాడు.


అక్క ఇంటికి వెళ్ళక ముందు కి, ఆరు నెలలు అక్కడ ఉండి వచ్చిన తన కొడుకులో వచ్చిన మార్పుకి అతని తల్లి సూర్యప్రభ ఆశ్చర్య పోయింది.


భార్య ఆశ్చర్యం చూసి వినయ్ తండ్రి వాసు


"నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు
..............................
స్థాన బలిమి కాని తన బలిమికాదయా
...............................


అని, నువ్వు వాడిలో కోరుకున్నది ఈ మార్పే కదా, అని తృప్తిగా తల పంకించాడు.