అందరూ అమాయకులే (బాలల కోసం):-- కందర్ప మూర్తి , హైదరాబాదు.

పల్లె గ్రామంలో ముసలయ్యకున్న నలుగురు కొడుకులు
పుట్టు గుడ్డివాళ్లు. లోక జ్ఞానం లేని అమాయకులు. భార్య చనిపోవడంతో ముసలయ్యే వారి అవుసరాలు తీరుస్తూ
జీవనోపాధికి  వారి చేత గంపలు తట్టలు తాళ్లు చేయిస్తూ
సంతల్లో అమ్మి పోషిస్తున్నాడు.
      వారు పెరిగి పెద్దయేసరికి ముసలయ్య కూడా వార్ధక్యంతో
చనిపోతే  అంధులైన నలుగురు అన్నదమ్ములు అనాథలయారు
     వారికి ఊరిలో తిండి పెట్టేవారు లేకపోయారు.పట్నానికి పోయి బిచ్చమెత్తుకుని బతకమని ఎవరో చెబితే నలుగురు
అన్నదమ్ములు చిన్న చేతికర్రల సాయంతో అడవిలో కాలిబాట
న నడుచుకుంటూ పట్నానికి బయలు దేరేరు.
     కొంతదూరం వచ్చేసరికి దారిలో వారికి ఒకచోట పెద్ద ఏనుగు
విప్ప పువ్వులు మస్తుగా తిని మత్తుగా నిద్రపోతోంది.
    దారిలో పడుకుని ఉన్న  ఏనుగును అదేమిటో వారు గుర్తించ
లేకపోయారు.
      నలుగురు గుడ్డి అన్నదమ్ములు ఏనుగుకు చెరోవైపు వెళ్లి
ఒకడు తోక పట్టుకుని చీపురు అన్నాడు.ఇంకొకడు దాని దంతాలు పట్టుకుని  వెదురు బొంగులనీ, మరొకడు కాలు పట్టుకుని చెట్టు మొదలు అన్నాడు.చివరివాడు ఏనుగు బాన
కడుపును చేత్తో తడిమి రాతిబండ అన్నాడు.వాళ్ల దినచర్యలో
ఎదురయ్యే వస్తువులు పేర్లు చెప్పుకున్నారు.
   తను చెప్పిందే సరైందని వాళ్లలో వాళ్లు వాగ్వివాదానికి దిగారు.
    ఇంతలో అటుగా వచ్చిన ఒక చెవిటివాడు వాళ్లు నలుగురు
ఏనుగును అమ్మడానికి సంతకు ఎలా  తీసుకెళ్లాలో తెలియక
తర్జనభర్జన పడుతున్నారను కున్నాడు.
      తన గుడిసెలో పెద్ద మోకుతాడు వెదురు తడిక ఉన్నాయని
చెప్పి వాటిని ఏనుగు దగ్గరకు తీసుకు వచ్చి విషయం వివరించిఅంధ అన్నదమ్ముల సాయంతో మోకుతాడును ఏనుగు
కడుపుకి కట్టి  వెదురు తడిక మీదకు పొర్లించారు.
      మోకుతాడును అందరూ పట్టుకుని మత్తులో పడుకున్న
ఏనుగును కాలిబాట వెంట చెమిటి వాని సాయంతో  ముందుకు 
ఈడ్చుకెల్తున్నారు.
    కొంత దూరమెళ్లేసరికి  దారిలో వారికి ఒక మూగవాడు
ఎదురు పడి చేతి సంజ్ఞతో  ఎక్కడి కెల్తున్నారని అడిగాడు.
అతని చేతి సంజ్ఞలు చూసిన చెమిటివాడు ఏనుగు ధర ఎంతని
అడుగుతున్నాడనుకుని వెయ్యి రూపాయలన్నాడు.
    నేనూ సాయం చేస్తానని వాళ్లతో పాటు తాడును పట్టుకున్నాడు
   గుడ్డి నలుగురు అన్నదమ్ములు ఏనుగును వెనక నుంచి నెట్టు
తుంటే, మూగివాడు చెవిటివాడు తాడు పట్టుకుని ఏనుగును ముందుకు లాక్కెళుతున్నారు.
     సగం దూర మెళ్లేసరికి వారికి మద్యలో నీటి కాలువ అడ్డు
వచ్చింది.
     నీటికాలువ మద్యకు రాగానే నీళ్ల చల్లదనానికి తడిక మీద
 పడున్న ఏనుగుకి విప్పపువ్వు మత్తు వదిలింది.
   కళ్లు విప్పి తన శరీరానికి కట్టిన మోకుతాడును చూసి
వేటగాళ్లు బంధించి తీసుకెల్తున్నారని భయపడి ఒక్కసారిగా
లేచి నిలబడి ముందున్న చెవిటి వాడిని  మూగవాడిని తొండంతో విసిరి కొట్టింది.
    కళ్లు కనబడని నలుగురు అన్నదమ్ములు ఏనుగు కాళ్లను
గట్టిగా పట్టుకున్నారు.ఏనుగుకు కోపం పెరిగి నడుముకు
కట్టిన తాడును విదిలించుకుని ఆ నలుగుర్నీ కాళ్లతో కుమ్మేసి
అడవిలోకి పారిపోయింది.
     అజ్ఞానంతో అందరూ అమాయకంగా వారికున్న అంగ
వైకల్యం తో ఒకరి భావం ఇంకొకరు అర్థం చేసుకోలేక ప్రాణాల
మీదకు తెచ్చుకున్నారు.
                    *                 *               *


           


కామెంట్‌లు